"హై ఆల్టిట్యూడ్ మెడల్" కి ఎన్నికైన కరీంనగర్ సైనికుడు


కరీంనగర్ (ధర్మఘంట): ఆర్మీలో వేల మంది సైనికులు దేశ సరిహద్దుల్లో వివిధ ప్రదేశాల్లో పని చేస్తుంటారు. అలా పనిచేసే ప్రదేశాల్లో అత్యంత క్లిష్టమైన ఏరియా హిమాలయాలు. రక్తం గడ్డ కట్టుకుని పోయే మైనస్ డిగ్రీల చలిలో డ్యూటి చేయడమంటే ప్రాణాలతో చెలగాటమే. అలాంటి హిమాలయాల్లో 9000  అడుగుల పైన ఎత్తులో డ్యూటి చేయడమంటే ఎలా ఉంటుందో ఊహించు కుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి సాహసోపేతమైన విధులు నిర్వహించిన  సరిహద్దు దళాల సైనికులకు ఇచ్చేదే ఈ "హై ఆల్టిట్యూడ్ మెడల్". 1986 లో  ఈ అవార్డు ప్రధానం మొదలై నేటికినీ ఆనవాయితీగా కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ నుండి కరీంనగర్ నివాసి ఆడెపు వెంకటరమణ ఈ మెడల్ కి అర్హత సాధించారు. 

కరీంనగర్ పట్టణం జమ్మికుంటలో నివాసముండే  ఆడెపు రాజయ్య, అన్నపూర్ణ దంపతుల కుమారుడు ఆడెపు వెంకటరమణ చిన్నతనం నుండి కష్ట పడి చదువుకుని సైన్యంలో చేరాలనే ఉత్సాహంతో ఇంటర్ విద్య పూర్తిచేసి ఆర్మీ సెలక్షన్ లలో "ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ పోర్స్" లో సైనికుడిగా విధుల్లో చేరారు. ఎంతో అంకిత భావంతో, దేశ భక్తితో విధులు నిర్వహిస్తూ "హవల్దార్" గా ఎదిగారు. ప్రస్తుతం ఇండో చైనా సరిహద్దుల్లో గడ్డ కట్టే చలిలో 9000 వేల పైన అడుగుల ఎత్తులో విధులు నిర్వహించి "హై ఆల్టిట్యూడ్ మెడల్" కు ఎంపికై, రానున్న ఆగస్టు, 15 నాడు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదగా ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు స్థానిక నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.