హైదరాబాద్ : ( ధర్మఘంట) ట్రూ న్యూస్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొనడం ఇదే తొలిసారి అని దాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారో కూడా తెలియదంటూనే.. తన రాజకీయాల ప్రస్థానం గురించి వివరించారు మోదీ. ముఖ్యంగా తాను గతంలో చేసిన తప్పుల గురించి కూడా చెప్పుకొచ్చారు. తన వల్ల కూడా కొన్ని తప్పులు జరిగాయని ఒప్పుకున్న మోదీ.. నేనేం దేవుడిని కాదు, సాధారణ మనిషినే అంటూ వ్యాఖ్యానించారు. ఈ ఇంటర్వ్యూ ఎవరు చేశారు, అందులో ప్రధాని ఏయే అంశాల గురించి మాట్లాడారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాపకుడు అయిన నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న "పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్" అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పీపుల్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ ఎపిసోడ్ 6 ట్రైలర్ అంటూ... హోస్ట్‌గా వ్యవహరించిన నిఖిల్ కామత్ ఈ వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఆ వీడియో మొత్తం 2 నిమిషాల 13 సెకన్లు ఉండగా.. అనేక విషయాల గురించి చర్చించారు. ముఖ్యంగా రాజకీయాలతో పాటు వ్యవస్థాపకత, నాయకత్వ సవాళ్లు వంటి అనేక అంశాలపై మాట్లాడారు. ట్రైలర్ ప్రారంభంలోనే హోస్ట్ నిఖిల్ కామత్ మాట్లాడుతూ.. "ప్రధానిని ఇంటర్వ్యూ చేయాలంటే తనకు భయంగా ఉంది" అని చెప్పారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ బదులిస్తూ.. "ఇదే నా తొలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూ. ప్రజలు దీన్ని ఎలా స్వీకరిస్తారో తెలియదు" అంటూ చెప్పగా ఇద్దరిలోనూ నవ్వులు విరిసాయి. అలాగే తాను హిందీ సరిగ్గా మాట్లాడకపోతే క్షమించాలంటూ నిఖిల్ కోరగా.. మోదీ నవ్వుతూ బదులిచ్చారు. ఆ తర్వాత యువత రాజకీయాల్లోకి రావాలంటే ఎలాంటి ప్రతిభ ఉండాలని నిఖిల్ ప్రధానిని అడగ్గా.. మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని మోదీ చెప్పారు.
ప్రధాన మంత్రి పాడ్ కాస్ట్ మొదటి ఇంటర్వూ