కారిడార్ లకు డిపిఆర్ సిద్దం రేవంత్ రెడ్డి సి.యం




హైదరాబాద్ : (ధర్మఘంట ) ట్రూ న్యూస్ హైదరాబాద్ మెట్రోకు రోజు రోజుకూ ఆదరణ పెరిగిపోతుంది. ప్రతినిత్యం దాదాపు 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణాలు సాగిస్తున్నారు. నగరం ఓ మూల నుంచి మరో మూలకు చేరుకునేందుకు నగరవాసులు మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మూడు కారిడార్లలో మెట్రో పరుగులు పెడుతుండగా.. రెండో ఫేజ్‌లో మరో ఐదు కారిడార్లకు డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి పంపారు. ఇక హైదరాబాద్ నార్త్ సిటీ మేడ్చల్, శామీర్‌పేట ప్రాంత వాసులు ఎప్పట్నుంచో మెట్రో కోసం డిమాండ్ చేస్తుండగా.. కొత్త ఏడాది కానుకగా.. సీఎం రేవంత్ ఆయా ప్రాంతాలకు మెట్రో విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా.. శామీర్‌పేట్‌, మేడ్చల్‌తో పాటు ఫ్యూచర్ సిటీ మెట్రో మార్గాల‌పై ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన స‌మ‌గ్ర వివరణాత్మక ప్రణాళికలు (డీపీఆర్‌లు) మార్చి నెలాఖ‌రు నాటికి పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. మూడు మెట్రోల డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ భాగంమోదం పొంది ఏప్రిల్ నెలాఖ‌రుకు టెండ‌ర్లు పిల‌వాల‌ని సీఎం సూచించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో మెట్రో విస్తరణ, రేడియ‌ల్ రోడ్ల నిర్మాణాలు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాల‌పై మంగళవారం సాయంత్రం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్రయం - ఫ్యూచ‌ర్ సిటీ మెట్రో (40 కి.మీ.), జేబీఎస్‌ - శామీర్‌పేట మెట్రో (22 కి.మీ.), ప్యార‌డైజ్ - మేడ్చల్ మెట్రో (23 కి.మీ.) మార్గాల‌కు సంబంధించి భూ సేక‌ర‌ణ‌ను వెంట‌నే పూర్తి చేయాల‌ని అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ల విష‌యంలో భవిష్యత్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎలైన్‌మెంట్ రూపొందించేట‌ప్పుడే క్షేత్ర స్థాయిలో స‌మ‌గ్ర ప‌రిశీల‌న చేయాలన్నారు. మేడ్చల్ మెట్రో ఎలైన్‌మైంట్ ఎన్‌హెచ్ మార్గంలో ఇప్పటికే ఉన్న మూడు ఫ్లైఓవర్లను దృష్టిలో ఉంచుకొని మెట్రో లైన్ తీసుకెళ్లాలన్నారు. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలన్నారు.