హైదరాబాద్ (ధర్మఘంట): ‘అనంత’ అజ్ఞానంలో సినీపాటల రచయిత, కవి అనంత శ్రీరామ్ ఉన్నాడని మామా (మాల,మాదిగల) సమైక్య సమితి జాతీయ అధ్యక్షులు డా. మేడే శాంతి కుమార్ మామా అన్నారు. శనివారం ఆయన నివాసంలో ధర్మఘంట'తో మాట్లాడుతూ తెలంగాణలోని అన్నిరంగాలు కుల, మతాలకతీతంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. సినీరంగంలో మొన్నీమధ్య విజయవాడ సమీపంలో ఏర్పాటు చేసిన విశ్వహిందూ పరిషత్ వారి ‘హిందూ శంఖారావం’ సభలో కర్ణుడి పాత్రను, ఇతిహాస, కావ్య పురాణాల పాత్రలను వక్రీకరిస్తున్నారని, హిందువుగా నేను సహించననీ సినిమా పాటల రచయిత, కవి అనంత శ్రీరామ్ పాల్గొని ప్రసంగించాడని గొంతు చించుకున్నాడని గుర్తుచేశారు.
కర్ణుని పాత్రను కల్కి సినిమాలో గొప్పగా చూపించడం, హిందూమతానికి తీవ్ర అపచారంగా బాధపడిపోయాడని, ‘బ్రహ్మాండ నాయకుడు’ అనే తెలుగు పదాన్ని అన్యమత దేవతలకు వాడరాదని, సినిమా పరిశ్రమలో హిందూ వ్యతిరేక శక్తులున్నారని కళా సాంస్కతిక రంగంలో వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని, పాత్రల వ్యక్తీకరణలను సహించబోమని వీరంగం చేశాడన్నారు.
”ఏమంటివి ఏమంటివి ! జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా? ఇది క్షాత్ర పరీక్షయేకాని, క్షత్రియ పరీక్షకాదే! ఇది కుల పరీక్షయేనందువా! నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది? మట్టికుండలో పుట్టితివి కదా! నీది యే కులము? అస్మత్ పితామహుడు గురకుల వద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా? ఈయినదే కులము? మా వంశమునకు మూల పురుషుడయిన వశిష్టుడు దేవవేశ్యగు ఊర్వశీ పుత్రుడు కాదా?… మా వంశము ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులమూ కులమూ యనే వ్యర్థ వాదమెందుకు?” అని నిండు సభలో దుర్యోధనుడు ఆచార్యులతో చరిత్రనంత తిరగేసి నిలదీసిన పంక్తిని గుర్తుచేసి, కుల సమాజం కూలిపోయి అందరూ సమానంగా బతకాలని కోరుకునే ఆధునికులందరికీ ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలోని మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని, ఉత్సాహాన్నిస్తాయని, సుయోధనుడూ కర్ణుని మధ్య మైత్రీ సంబంధాన్ని ఎంతో ఉదాత్తంగా చిత్రీకరించిన సినిమా అది అని, ఆనాటి ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుందన్నారు. కానీ కుల వ్యవస్థను, వాటి పీడనను కాపాడుకోవాలనుకునే మనువాదులకు, దానికండగా ఉండే మతవాదులకూ చిర్రెత్తుకు వచ్చిందన్నారు.
అలాంటి సినిమాలు, పాత్రలూ ఇపుడు హిందూ మతానికి వ్యతిరేకంగా ఉన్నాయని కొత్తగా గొంతునెత్తుకుని, పెడ అర్దాలతో అక్కసును వెళ్లగక్కుతున్నారని ఆవేదన చెందారు.
అలాంటి ఆక్రోశమే అనంత శ్రీరాంలో మనం చూస్తామన్నారు! మొన్నీమధ్య విజయవాడ సమీపంలో ఏర్పాటు చేసిన విశ్వహిందూ పరిషత్ వారి ‘హిందూ శంఖారావం’ సభలో ఈ సినిమా పాటల రచయిత పాల్గొని ప్రసంగించాడు. కర్ణుడి పాత్రను, ఇతిహాస, కావ్య పురాణాల పాత్రలను వక్రీకరిస్తున్నారని, హిందువుగా నేను సహించననీ గొంతు చించుకున్నాడు. కర్ణుని పాత్రను కల్కి సినిమాలో గొప్పగా చూపించడం, హిందూమతానికి తీవ్ర అపచారంగా బాధపడిపోయాడు. ‘బ్రహ్మాండ నాయకుడు’ అనే తెలుగు పదాన్ని అన్యమత దేవతలకు వాడరాదని, సినిమా పరిశ్రమలో హిందూ వ్యతిరేక శక్తులున్నారని కళా సాంస్కతిక రంగంలో వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. పాత్రల వ్యక్తీకరణలను సహించబోమని వీరంగం వేశాడన్నారు.
వ్యాసుడు రాసిన భారతాన్ని ఏ పొల్లు పోకుండా కవిత్రయం అనువదించిందా? ఎన్నిరకాల భారత రామాయణాలు లేవుమనకు! ఎన్ని పిట్టకథల్ని చేర్చుకోలేదు! కావ్యపాత్రలమీద, కథమీద ఎన్నోరకాల విమర్శలు వచ్చాయి. కాలానుగుణంగా వ్యాఖ్యానించుకోవడమూ ఉంది. ‘రామాయణ విషవక్షంలో రంగనాయకమ్మ హేతు విరుద్ధాంశాల నెన్నింటినో ఎత్తిచూపి విమర్శ చేసారు. అవి రచనలు, కావ్యాలు, మత గ్రంథాలు కాదు. సినిమాలను కూడా మత కళ్లద్దాలతో చూడటం, సినిమాల్లో పాటలు, మాటలు ఎలా రాయాలో, రాయకూడదో నిర్దేశించే ఉన్మాదంలోకి మునిగిపోయారు ఈ అనంత అజ్ఞాని. పురాణ పాత్రలను తీసుకుని ఆధునిక పాత్రలుగా మలచటం, నేటి నీతిని, ధర్మాన్ని బోధించడం ఎంతోకాలంగా ఉంది. కళాసాహిత్యా రంగంలోకి, సినిమారంగంలోకి ఈ మతతత్వ విద్యేషాలను తెచ్చే ప్రయత్నాన్ని సంఘీయులు ఈ అజ్ఞాని ద్వారా ఆరంభించారని, దీన్ని ఉన్మాద స్థాయికి తీసుకెళ్లారని విమరించారు.
హిందూ మత ఆచారాలను, విశ్వాసాలను తుంగలో తొక్కి, ”దిగు దిగు దిగు నాగా, దివ్యా సుందరినాగా” అని నాగదేవత పాటను ఐటెం సాంగ్‌గా పాట రాసాడని ఈ విశ్వ హిందూ పరిషత్తే ఆందోళనలు చేసిందొకప్పుడు. అలాంటి అనంతుడే ఇప్పుడు అరచికేకలు పెడుతున్నాడన్నారు. డబ్బులకోసం బూతు పాటలు రాసి, ధర్మం కోసం ద్వేషం రెచ్చగొట్టటం అంటే ఇదే మరి! సినిమాల్లో ఎన్నో పౌరాణిక పాత్రలను ధరించి కష్ణుడంటే, రాముడంటే ఇతడేనన్న భావాన్ని కలిగించిన ఎన్టీ రామారావు ముస్లిం పాత్రలనూ పోషించి ఎన్నో ప్రశంసలందుకున్నారు. ‘అందరికీ ఒక్కడే దేవుడు, కొందరికి రాముడు, కొందరికి రహీము, మరికొందరికి జీసస్. ఏ పేరున పిలిచినా దేవుడొక్కడే’ అని పాటల్లో మత సామరస్వాన్ని, ‘మానవుడే మహనీయుడు’ అంటూ మానవశక్తిని ఉన్నతంగా వినిపించిన చిత్రసీమలో ఇంత విద్వేష విషాన్ని చిమ్మటం సహించరానిదని, కర్ణుని గొప్పవానిగా చూపటమే హిందూ మతానికి ముప్పును తీసుకొస్తుందని, సినీ పరిశ్రమలో ఉన్న ఇతర మతస్తుల వల్ల అపచారం ఏర్పడుతుందన్న ప్రచారం అజ్ఞానికే చేతనయ్యేపనియని, ‘భారతీయులందరూ నా సహోదరులు’ అన్న మన ప్రతిజ్ఞా పాదం అర్థాన్ని రచయితకు అర్థం చేయించవలసే ఉన్నదని, జాతి మత భేదాలు లేక సృజనశీలతతో నిర్మించుకున్నదే సినీ పరిశ్రమ. ఆ పరిశ్రమే శ్రీరాంను కూడా నిలబెట్టిందన్నారు.
పురాణేతిహాసాల కథలను, చిత్రాలను, పాత్రలను కుల, మతాలకతీతంగా ఆదరించి ఆస్వాదించినవాళ్లు తెలుగు ప్రజలు. ఇప్పుడు ఆ ప్రజల్లో చిచ్చురేపే విధంగా అనంతుడు ప్రసంగించడం ఆక్షేపణీయం. ఆయన ఏ ప్రయో జనాలు ఆశించి ఇందుకు పూనుకున్నాడో ప్రజలు అర్థం చేసుకుంటారు. ”మతములన్నియు మాసిపోవును జ్ఞానమన్నది నిలిచి వెలుగును” అన్న గురజాడ నినాదం నిజమై నిలబడుతుందని, కళా సజనలోకి కళంకిత వాదనలు తేవడాన్ని, కల్మషాలు పులమడాన్ని కళారంగం సహించదని, అన్నిరంగాలలోను కుల, మత, జాతి విద్వేషాలు విడిచి విభేద రహితంగా సమాజాన్ని నిర్మించే నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ ప్రగతికి బాటలు వేయాలని కోరారు.