హైదరాబాద్ : ధర్మఘుంట ట్రూన్యూస్ :
తెలంగాణలో గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల ఫీవర్ మెుదలైంది. గ్రామాల్లో ఏ నలుగురు ఓ చూట గూమి కూడినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఎన్నికల్లో పోటీ చేసే ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న వారు గ్రామాల్లోనే మకాం వేసి ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి, చెడుతూ సంబంధం లేకుండా ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రజలతో మమేకమవుతున్నారు. మరికొందరు ఒకడుగు ముందుకేసి గ్రామాల్లో ప్రత్యేకంగా మేనిఫెస్టో సైతం రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్ వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి చివర్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈనెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు పథకాల అమలు చేయనున్నారు. ఇవి పూర్తైన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని స్థానిక నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిసింది. పథకాలు త్వరితగతిన పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ భావిస్తోందట. ఫిబ్రవరి చివర్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు సమాచారం కాగా, రాష్ట్రంలో మెుత్తం 540 మండలాల్లోని 12,966 గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. 1,14,620 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుంది. వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇప్పటికే సమర్పించింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో మెుత్తం 1,13,152 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఈసారి అదనంగా మరో 5 మండలాలు, 234 గ్రామాలు, 1,468 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం.
గతేడాది ఫిబ్రవరిలో సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తికాగా.. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఇక స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించి కులగణన జరుగుతుండగా.. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది.