మరుగునపడిన మేధావి మోదుకూరి జాన్సన్‌

మోదుకూరి జాన్సన్‌ పేరు వినగానే మానవుడు - దానవుడు, కరుణామయుడు, దేవాలయం, నేటి భారతం సినిమాలు గుర్తుకు వస్తాయి. నాటక ప్రపంచంలో ‘నటనాలయం’ పేరు తలిస్తే జాన్సన్‌ గుర్తుకు వస్తాడు. పాడిపంటలు సినిమాలో ‘మన జన్మ భూమి బంగారు భూమి’ పాటను శ్రీశ్రీ రాశారా అనుకునేంత గొప్పగా రాశాడు జాన్సన్‌. దళిత రచయితలకు సినిమా రంగంలో అవకాశాలు రావటం, నిలదొక్కుకోవటం, రాణించటం అంత సులభమైన పనికాదు. ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు సైతం సినిమా రచయితగా ప్రయత్నం చేసి అక్కడ ఇమడలేక తిరిగి వచ్చి నాటకాన్నే నమ్ముకున్న పరిస్థితి. ఒక ‘జాలాది’ మాత్రం ప్రత్యేకమైన పల్లె పదాలతో తనదైన ఒక బాణీలో పాటలు రాసి నిలదొక్కుకున్నాడు.

మోదుకూరి జాన్సన్‌ ఏనాడూ సినీ పరిశ్రమకు వెళ్ళాలని ప్రయత్నం చెయ్యలేదు. సినీ పరిశ్రమే ఆయన ప్రతిభను గుర్తించింది. ‘నటనాలయం’ నాటకాన్ని తెనాలి దగ్గర ఒక పల్లెటూర్లో ప్రముఖ సినీ నటుడు గుమ్మడి చూశారు. గుమ్మడికి అందులోని సన్నివేశాలు, విషయాన్ని కొత్త కోణంలో చెప్పిన విధానం నచ్చింది. అదే కాలంలో అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు మరో ప్రపంచం సినిమా కోసం ‘ఎవరన్నా కొత్త రచయితలు ఉంటే చెప్పండి’ అని గుమ్మడిని అడగ్గా వెంటనే మోదుకూరి జాన్సన్‌ని సిఫారసు చేసి మద్రాసు పిలిపించి పరిచయం చేశారు. ఆ విధంగా జాన్సన్‌ మరో ప్రపంచంలోకి అడుగుపెట్టి వెనుదిరిగి చూడలేదు. తెలుగు సినీరంగంలో రచయితగా చెరగని ముద్ర వేశాడు జాన్సన్‌. జాన్సన్‌ 1962లో తెనాలిలో కొంతకాలం అడ్వకేట్‌గా పనిచేశాడు. ఆ రోజుల్లో రాడికల్‌ హ్యుమనిస్టులతో స్నేహం, చర్చలతో సామాజిక అవగాహన పెంచుకున్నాడు. ఆయనలో సృజనాశక్తి ఉన్నందువల్ల ‘దేవాలయం’, ‘హృదయాలయం’, ‘నాగరికత’, ‘నిచ్చెనమెట్లు’ వంటి చాలా నాటకాలు రాశాడు, ప్రదర్శించాడు. జాన్సన్‌ సినిమాలో ఇన్వాల్వ్‌ అయితే ఎలాంటి సాహిత్యం వస్తుందనడానికి ఉదాహరణ కరుణామయుడు. జాన్సన్‌ మాటలు రాసిన ఈ చిత్రంలోనే చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఒకటి రాశాడు. ‘కదిలిందీ కరుణ రధం, సాగిందీ క్షమాయుగం మనిషి కొరకు దైవమే కరిగీ వెలిగె కాంతి పథం’. ఈ పాట జాన్సన్‌ తప్ప ఎవరు రాసినా ఆ స్థాయిలో రాయలేరు. మానవుడు - దానవుడు సినిమా జాన్సన్‌కు డైలాగ్‌ రైటర్‌గా గుర్తింపు తెచ్చింది. ‘అవసరానికి మించి ఐశ్వర్యం ఇస్తే మనిషి కన్నుమిన్నూ కానబోడేమో, కడుపుకు చాలినంత కబలమీయకుంటే మనిషి నీతీ నియమం పాటించడేమో’ అంటూ దేవుడికి మానవుడి బలహీనతల గురించి వివరిస్తాడు జాన్సన్‌. రాసేది భక్తి గీతమే అయినా, అందులోనూ సామాజికాంశాన్ని చొప్పించడం జాన్సన్‌ ప్రత్యేకత.

రామానాయుడు, కృష్ణ లాంటి నిర్మాతలు జాన్సన్‌ను కోరి మరీ తమ సినిమాల్లో రచన చేయించుకున్నారు. నవయుగ కవి చక్రవర్తి గుఱ్ణం జాషువాతో జాన్సన్‌కు ఆత్మీయ సంబంధం ఉంది. దళితుడుగా తాను పడే బాధలను చెప్పడానికి జాషువా ‘గబ్బిలం’ రాస్తే, జాన్సన్‌ అదే విషయాన్ని మరింత బలంగా వినిపించడానికి ‘కాకి’ కావ్యం రాసి, ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభల వేదిక మీద చదివాడు. జాషువా ‘స్మశానం’ మీద పద్యం రాేస్త, జాన్సన్‌ అదే స్మశానాన్ని ‘దేవాలయం’ సినిమాలో కళ్యాణ వేదికగా మలిచాడు. జాషువా తన చివరి కాలం ఎక్కువగా తెనాలి ప్రాంతంలోనే గడిపాడు. ఆప్రాంతానికి వస్తే జాన్సన్‌ తప్పకుండా జాషువా వెంట ఉండేవాడు. దళితుల ఆత్మ గౌరవం కోసం కులాన్ని పేరు చివర పెట్టుకోవడమే మంచిదని 1970 ప్రాంతాల్లోనే తను ‘కాకి’ కావ్యం రాసే నాటికే అభిప్రాయపడిన క్రాంతి దర్శి జాన్సన్‌.

తెనాలి సమీపంలో 1934 సంవవత్సరంలో ఆగస్టు 8న మోదుకూరి గురవయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించాడు జాన్సన్‌. వీరిది సాధారణ వ్యవసాయ కూలీ మాదిగ కుటుంబం. జాన్సన్‌ కళావాచస్పతి జగ్గయ్య శిష్యుడు. ఆయనే జాన్సన్‌కు ‘అగ్నికవి’ అని నామకరణం చేశాడు. గుంటూరు ఏ.సి. కాలేజీలో బి.ఏ. చదివినప్పుడు ఇంగ్లిష్‌ లెక్చరర్‌ రోశయ్య, తర్వాత ‘లా’ చదవడానికి ఆంధ్ర యూనివర్శిటీ వెళ్ళినప్పుడు అక్కడ కూర్మ వేణుగోపాలస్వామి జాన్సన్‌లోని కవిని, నాటక రచయితని నిద్రలేపి నిలబెట్టారు. ప్రపంచానికి పరిచయం చేశారు. జాన్సన్‌ 1988 డిసెంబర్‌ 24న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.‘చలన చిత్రాలను ప్రేక్షకులు కేవలం వినోదం కోసమే చూస్తారంటే నేను నమ్మను. ప్రజల కష్ట సుఖాలు, వారి సమస్యలకు పరిష్కారాలు చెప్పే చిత్రాలు కూడా చూస్తారు. అసలు సినిమా లక్షణం, ప్రయోజనం అదేనని నా గట్టి నమ్మకం’ అని ఓ సందర్భంలో చెప్పారు మోదుకూరి జాన్సన్‌.

ఆ పాట.. ఆయన.. చిరంజీవులు
(సంభాషణ- రెంటాల జయదేవ) 

ఎన్టీఆర్ ‘పాండురంగ మాహాత్మ్యం’లోని ‘హే కృష్ణా! ముకుందా!’ పాట లాగా చాలా ఉన్నత స్థాయిలో ఉంటూ, దయ, ప్రేమ, దుఃఖం, కరుణ - ఇలా అన్ని రకాల ఛాయలూ ప్రతిఫలించేలా పాటలో వేదన కనపడాలని చెప్పా. మోదుకూరి మారుమాట్లాడకుండా టవల్ మీదే బాత్‌రూమ్‌లోకి వెళ్ళి, షవర్ కింద నీళ్ళలో దేవుణ్ణి కన్నీటితో ప్రార్థిస్తూ, తడిసి ముద్దై వచ్చి, మరొక్క ఛాన్సిస్తే రాసిస్తానన్నారు. నేను సరేనన్నా. అలా షవర్ కింద నీటిలో తన కన్నీటిని దాచుకొని, ఆయన రెండోసారి రాసిందే - ‘కదిలింది కరుణరథం..’ అన్న సూపర్‌హిట్ పాట.

‘కరుణామయుడు’ సినిమాకు సంబంధించి నాకెన్నో అనుభవాలు, అనుభూతులు ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది రచయిత మోదుకూరి జాన్సన్‌తో ఆ సినిమాకు సాగిన ప్రయాణం... ఆ చిత్రానికి ఆయన మాటలు, ‘కదిలింది కరుణరథం...’ పాట రాసిన సందర్భం. మోదుకూరి, నేను - ఇద్దరం రంగస్థలం మీద నుంచి సినీ రంగానికి వచ్చినవాళ్ళమే. ఆయనతో నాకు అప్పట్లో పరిచయం లేదన్న మాటే కానీ, మోదుకూరి రాసిన ‘నటనాలయం’ నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే ఏయన్నార్ - ఆదుర్తి సుబ్బారావులు తమ సొంత చిత్రం ‘మరో ప్రపంచం’తో ఆయనకు సినీ రచయితగా అవకాశమిచ్చారు.

నటుడిగా నాకూ అదే తొలి చిత్రం. అలా అప్పటి నుంచి ఆయనతో నాకు ప్రత్యక్ష పరిచయం. ‘కరుణామయుడు’కి మాటల రచనకు క్రీస్తు జీవితం, సందేశాలతో పరిచయమున్న రచయిత అయితే బాగుంటుందని అనుకున్నాం. నేను, నా భాగస్వామి సజ్జల చిట్టిబాబు కలసి మోదుకూరి గారైతే బాగుంటుందని తీసుకున్నాం. ‘అమృతవాణి’ సంస్థ తరఫున ఫాదర్ క్రిస్టఫర్ కొయిలో ఆంగ్లంలో తయారు చేసిన ఇంగ్లీషు స్క్రిప్టు ఆధారంగా ముగ్గురం ముందుకు సాగాం. దాదాపు 13 గంటల నిడివి గల స్క్రిప్టును ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా ఉండేలా 2 గంటల 45 నిమిషాల నిడివికి కుదించాం.

మోదుకూరి అప్పటికే పేరున్న రచయిత. పెద్ద చిత్రాలకు కథ, మాటలు అందించారు. అయితే క్రీస్తు కథ కాబట్టి, ఈ చిత్ర రచనా విధానం గురించి ఆయనతో మాట్లాడడానికి నేను, చిట్టిబాబు గారు వెళ్ళాం. క్రీస్తు మీద చిత్రం కాబట్టి, ప్రత్యేకంగా ధ్వనించే క్రైస్తవ తెలుగులో మాటలు రాస్తానన్నారాయన. అయితే, నేను మాత్రం వద్దని వాదించా. ‘‘మనం ఈ సినిమా తీస్తున్నది కేవలం క్రైస్తవుల కోసం కాదు. క్రైస్తవేతరులతో సహా అందరూ చూడడం కోసం! కాబట్టి, అందరికీ అర్థమయ్యే సులభమైన తెలుగులో రాయాలి’’ అన్నా. చివరకు క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్‌కు చెందిన ఫాదర్ బాలగర్ (స్కాట్లండ్) కూడా నన్ను సమర్థించారు. మోదుకూరి గారు కూడా మా వాదనలోని అంతరార్థాన్ని గ్రహించి, అంగీకరించారు. మామూలు తెలుగులో మాటలు రాశారు. ‘కరుణామయుడు’ రిలీజయ్యాక ఆ మాటలు, ఆ శైలి తరువాతి క్రీస్తు చిత్రాలకు ఒక ఒరవడి పెట్టాయి.

అలాగే, ఆ చిత్రాన్ని అందరిలోకీ తీసుకువెళ్ళిన పాట - ‘కదిలింది కరుణరథం...’. క్రీస్తు జననం నుంచి పునరుత్థానం వరకు అన్నీ ఉండే ‘కరుణామయుడు’లో అతి కీలకమైన పాట - యేసు క్రీస్తు శిలువ మోస్తూ పాడే ఆ గీతం. అది సినిమాకు గుండెకాయ. నిజానికి, ఆ పాటను మోదుకూరితో రాయించాలనుకోలేదు. ఆయన రాసిన మొదటి వెర్షనూ అది కాదు. అసలు ఆ పాటను శ్రీశ్రీ, ఆత్రేయల్లో ఎవరితోనైనా రాయించాలని నా ఆలోచన. ఆ చర్చ జరుగుతున్నప్పుడు మోదుకూరి గారు ‘చూడు విజయ్! ఆ కీలకమైన పాట నేను రాస్తా. నచ్చితే పెట్టుకో’ అన్నారు. అప్పటికే ఆయన ‘దేశోద్ధారకులు’ (‘స్వాగతం దొరా...’ పాట) లాంటి చిత్రాల్లో పాటలు రాశారు. నాకంత ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నా. మంచి గాయకుడు కూడా అయిన మోదుకూరి పిలిచారు. ఆయన ఏదైనా రచన చేస్తున్నా, వినిపిస్తున్నా తెల్లటి టర్కీ టవల్ కట్టుకొని, మంచం మీద బాసింపట్టు వేసుకొని చెప్పేవారు. ఆ పాట చాలా చెత్తగా ఉందంటూ ఆ మాటే ఆయనకు మొహం మీద చెప్పేశా.

ఆయన రెండోసారి రాసిన వెర్షనే - ‘కదిలింది కరుణరథం... సాగింది క్షమా యుగం... మనిషి కొరకు దైవమే... కరిగి వెలిగె కాంతిపథం...’ అన్న సూపర్‌హిట్ పాట. కులమతాలకు అతీతంగా ‘కరుణామయుడు’ అందరికీ చేరువ కావడానికీ, అంత బాగా ఆడడానికీ - ఎంతో తాత్త్వికత, క్రీస్తు జీవిత సారమున్న ఆ పాట ఓ కారణం. నిడివి ఎక్కువగా ఉండే ఈ పాటను డబుల్ పేమెంట్ ఇచ్చి, మద్రాసు విజయా గార్డెన్స్‌లో సంగీత దర్శకుడు జోసెఫ్ వి. కృష్ణమూర్తి, బి. గోపాలం సంగీతంలో రికార్డింగ్ చేయించడానికి చేతిలో తగినంత డబ్బులు లేక అవస్థ పడ్డాను. దేవుడి మీద భారం వేస్తే, ఆటలో డబ్బులొచ్చాయి. అలా ఆ పాట రికార్డింగ్ చేశాం. ఎస్పీబీ తక్కువ పారితోషికం తీసుకొని పాడారు. ఇక, వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ జరపాలని మొదటే బరువైన కొయ్య శిలువ తయారు చేయించాం. ప్రతి లొకేషన్‌లో కొద్దిగా తీశాం. అలా షూటింగ్ జరిగినన్ని రోజులూ అన్ని చోట్లకూ ఆ శిలువ మోసుకుంటూ వెళ్ళాం.

ఎన్నో ఇబ్బందుల మధ్య నాలుగేళ్ళు నిర్మాణంలో ఉండి, 1978 డిసెంబర్‌లో విడుదలైన ‘కరుణామయుడు’ మా జీవితాలనే మార్చేసింది. తరువాత నేను తీసిన ‘దయామయుడు’, ‘ఆంధ్రకేసరి’ చిత్రాలకూ మోదుకూరే రచయిత. అలాగే, బాపు-రమణల ‘రాజాధిరాజు’లో ఆయన రాసిన ‘రాజ్యము బలము మహిమ నీవే నీవే...’ పాట కూడా సుప్రసిద్ధం. వ్యక్తిగా ఎంతో మంచివాడు, అభ్యుదయ భావాలున్న మోదుకూరికి ఇవాళ్టికీ రావాల్సినంత గుర్తింపు, పేరు రాలేదు. యాభై ఏళ్ళ వయసుకే ఆయన అర్ధంతరంగా మరణించడంతో ఒక మంచి రచయితను కోల్పోయాం. కానీ, ‘కరుణామయుడు’తో పాటు ఆయన, ఆయన పాట చిరంజీవులే!

మోదుకూరి జాన్సన్ (ఆగష్టు 8, 1936 - డిసెంబరు 24, 1988) నటుడు, నాటక రచయిత. 1970లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన 'మరో ప్రపంచం' సినిమా ద్వారా రచయితగా పరిచయం అయ్యారు.

జననం

ఆగష్టు 8, 1936

కొలకలూరు గ్రామం, గుంటూరు జిల్లా

మరణం

డిసెంబరు 24, 1988

మరణ కారణం

గుండెపోటు

ప్రసిద్ధి

నటులు, నాటక కర్త

తండ్రి

మోదుకూరి గరువయ్య (పేటూరు)

తల్లి

రత్తమ్మ

జననం - విద్యాభ్యాసం - ఉద్యోగం

వీరు గుంటూరు జిల్లా కొలకలూరు గ్రామంలో 1936, ఆగష్టు 8 తేదీన జన్మించారు. వీరు ప్రాథమిక విద్యాభ్యాసం దుగ్గిరాల, గుంటూరులో చేసిన తర్వాత ఆంధ్ర విశ్వ కళాపరిషత్ నుంచి డిగ్రీ తీసుకున్నారు. తెనాలి లో కొంతకాలం న్యాయవాది గా పనిచేశారు,

నాటకరంగ ప్రస్థానం

ఢిల్లీలో జరిగిన అంతర్ విశ్వవిద్యాలయ యువజనోత్సవాలలో పాల్గొని బహుమతులు అందుకున్నారు. వీరు నటనాలయం, దేవాలయం, హృదయాలయ, సిలువభారం మొదలైన నాటకాలు రాసి ప్రదర్శించారు. ఢక్కాభిషేకం నవల రాశారు. రాగ హృదయం అనే రూపకానికి నేపథ్యగానం అందించారు. ఛండాలిక, పైరుపాట సంగీత రూపకాలకు సంగీత దర్శకత్వం వహించారు.

సినీరంగ ప్రస్థానం

మోదుకూరి రాసిన నటనాలయం నాటకం అప్పట్లో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆ నాటకం చూసే అక్కినేని నాగేశ్వరరావు - ఆదుర్తి సుబ్బారావు లు తమ సొంత చిత్రమైన మరో ప్రపంచం సినిమాకు సంభాషణల రచయితగా అవకాశం ఇచ్చారు.[3] వీరు కరుణామయుడు (1978), ఇంద్రధనుస్సు (1978), మానవుడు - దానవుడు (1972), విచిత్ర దాంపత్యం (1971), డబ్బుకు లోకం దాసోహం (1973), ఆంధ్ర కేసరి, దేశోద్ధారకులు మొదలైన సినిమాలకు సంభాషణలు రాశారు.

రచించిన పాటలు

కదిలింది కరుణరథం... సాగింది క్షమా యుగం (కరుణామయుడు)

మన జన్మభూమి... బంగారు భూమి(పాడిపంటలు)

స్వాగతం దొరా (దేశోద్ధారకులు)

మరణం

వీరు 1988, డిసెంబరు 24 తేదీన గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.