ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫస్ట్ వన్డేలో భారత్ 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 35.4 ఓవర్లలో ఆలౌట్ అయ్యి 188 రన్స్ చేసింది.
టి 20, టెస్టుల్లో వరుసగా ఫెయిల్ అవుతూ టీమ్‌లో చోటు కూడా కోల్పోయిన కెఎల్ రాహుల్, వన్డేల్లో మాత్రం తన క్లాస్ చూపిస్తున్నాడు. శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ వంటి ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు ఫెయిల్ కావడంతో 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన టీమిండియాని అద్భుత హాఫ్ సెంచరీతో ఆదుకుని, ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో టీమిండియాకి ఘన విజయం అందించాడు కెఎల్ రాహుల్..
73 బంతుల్లో వన్డే కెరీర్‌లో 13వ హాఫ్ సెంచరీ అందుకున్న కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో కలిసి ఆరో వికెట్‌కి 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. కెఎల్ రాహుల్ 91 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 75 పరుగులు చేయగా రవీంద్ర జడేజా 69 బంతుల్లో 5 ఫోర్లతో 45 పరుగులు చేశాడు. వన్డేల్లో ఐదో స్థానంలో 17 ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన కెఎల్ రాహుల్, 7 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ చేయడం విశేషం.
189 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన భారత జట్టు, 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది... 31 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో 39 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది టీమిండియా...
ఈ దశలో హార్ధిక్ పాండ్యా, కెఎల్ రాహుల్ కలిసి ఐదో వికెట్‌కి 44 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 31 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 25 పరుగులు చేసిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా, స్టోయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి... బౌండరీ లైన్ దగ్గర కామెరూన్ గ్రీన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..
83 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది భారత జట్టు. టీమిండియా విజయానికి ఇంకా 106 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా అవుటైతే ఆ తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో చెప్పుకోదగ్గర బ్యాటర్లు కూడా లేరు. దీంతో ఈ ఇద్దరిపైనే మ్యాచ్ రిజల్ట్ ఆధారపడి ఉంది.
189 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి మొదటి ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే రాగా రెండో ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ని ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు మార్కస్ స్టోయినిస్. 5 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. ఆ తర్వాతి ఓవర్‌లో శుబ్‌మన్ గిల్ ఇచ్చిన క్యాచ్‌ని వికెట్ కీపర్ జోష్ ఇంగ్లీష్ డ్రాప్ చేశాడు... లేకపోతే రెండు బంతుల వ్యవధిలో రెండో వికెట్ పడి ఉండేది..
9 బంతుల్లో ఓ ఫోర్‌తో 4 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. తాను వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలుసుకున్న విరాట్ కోహ్లీ, కనీసం డీఆర్‌ఎస్ కూడా తీసుకోకుండా పెవిలియన్ చేరాడు...
ఆ తర్వాతి బంతికి సూర్యకుమార్ యాదవ్‌ని డకౌట్ చేశాడు మిచెల్ స్టార్క్. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా, డీఆర్‌ఎస్ తీసుకున్న ఆస్ట్రేలియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్.. మొదటి 5 ఓవర్లలో 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది టీమిండియా.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 188 పరుగులకి ఆలౌట్ అయ్యింది. మిచెల్ మార్ష్ 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన ఆసీస్ బ్యాటర్లు ఎవ్వరూ 30 ప్లస్ స్కోరు కూడా చేయలేకపోయారు. భారత బౌలర్లలో సిరాజ్, షమీ మూడేసి వికెట్లు తీయగా రవీంద్ర జడేజాకి 2 వికెట్లు దక్కాయి.
నిప్పులు చెరిగిన బౌలర్లు.. బెంబేలెత్తి వికెట్లు పారేసుకున్న ఆస్ట్రేలియా
భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. అనుభవజ్ఞుడైన షమీ(Shami) ఓ పక్క వరస వికెట్లు తీసి ఆసీస్(Australia)ను దెబ్బకొడితే, సిరాజ్(Siraj), జడేజా(Ravindra Jadeja) దానిని కొనసాగించారు.
ఫలితంగా భారత్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 188 పరుగులకే కుప్పకూలింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు వ్యూహాత్మకంగా ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్ నమ్మకానికి నిలబెట్టిన మహమ్మద్ సిరాజ్ రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ ట్రావిస్ హెడ్ (5)ను వెనక్కి పంపాడు. ఆ తర్వాత మార్ష్, స్మిత్ కలిసి వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించాక స్మిత్ అవుటయ్యాడు.
ఆ తర్వాత బౌలర్లు బంతులకు పదునుపెట్టారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఆసీస్ పతనాన్ని శాసించారు. మరీ ముఖ్యంగా షమీ.. మూడు వరుస ఓవర్లలో జోష్ ఇంగ్లిష్ (26), కామెరాన్ గ్రీన్ (12), స్టోయినిస్ (5)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 184 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత మరో నాలుగు పరుగులు మాత్రమే జోడించి మిగతా మూడు వికెట్లను చేజార్చుకుంది. మ్యాక్స్‌వెల్(8)ను జడేజా అవుట్ చేయగా, సీన్ అబాట్(0), ఆడం జంపా(0) వికెట్లను సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా ఆసీస్ ఇన్నింగ్స్ 35.4 ఓవర్లలోనే 188 పరుగుల వద్ద ముగిసింది.
ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ ఒక్కడే భారత బౌలర్లను ధైర్యంగా ఎదురొడ్డి పరుగులు సాధించాడు. మొత్తంగా 65 బంతులు ఎదుర్కొన్న మార్ష్ 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 81 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్లలో షమీ, సిరాజ్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, జడేజాకు రెండు వికెట్లు దక్కాయి. ఆరు ఓవర్లు వేసిన షమీ 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీయడం గమనార్హం.
తొలి వన్డేను వీక్షిస్తున్న రజనీకాంత్..
ఆస్ట్రేలియా- భారత్ తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా స్టేడియంలో సూపర్ స్టార్ రజనీకాంత్ ను చూసి అవాక్కయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ ఎంసీఏ ప్రెసిడెంట్ అమోల్ కాలే తో కలిసి మ్యాచ్ ను వీక్షిస్తున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోటోలు వైరల్ అవడంతో, ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.
తొలి ఇన్నింగ్స్ అత్యల్ప స్కోరు
స్కోరుబోర్డు
ఆస్ట్రేలియా: హెడ్ (బి) సిరాజ్ 5; మార్ష్ (సి) సిరాజ్ (బి) జడేజా 81; స్మిత్ (సి) రాహుల్ (బి) పాండ్యా 22; లబుషేన్ (సి) జడేజా (బి) కుల్దీప్ 15; ఇంగ్లి్‌స (బి) షమి 26; గ్రీన్ (బి) షమి 12; మ్యాక్స్‌వెల్ (సి) హార్దిక్ (బి) జడేజా 8; స్టొయినిస్ (సి) గిల్ (బి) షమి 5; ఎబాట్ (సి) గిల్ (బి) సిరాజ్ 0; స్టార్క్ (నాటౌట్) 4; జంపా (సి) రాహుల్ (బి) సిరాజ్ 0; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 35.4 ఓవర్లలో 188 ఆలౌట్; వికెట్ల పతనం: 1-5, 2-77, 3-129, 4-139, 5-169, 6-174, 7-184, 8-184, 9-188, 10-188; బౌలింగ్: షమి 6-2-17-3; సిరాజ్ 5.4-1-29-3; హార్దిక్ 5-0-29-1; శార్దూల్ 2-0-12-0; జడేజా 9-0-46-2; కుల్దీప్ 8-1-48-1.
భారత్: ఇషాన్ (ఎల్బీ) స్టొయినిస్ 3; గిల్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 20; కోహ్లీ (ఎల్బీ) స్టార్క్ 4; సూర్యకుమార్ (ఎల్బీ) స్టార్క్ 0; రాహుల్ (నాటౌట్) 75; పాండ్యా (బి) గ్రీన్ (బి) స్టొయినిస్ 25; జడేజా (నాటౌట్) 45; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం: 39.5 ఓవర్లలో 191/5. వికెట్ల పతనం: 1-5, 2-16, 3-16, 4-39, 5-83. బౌలింగ్: స్టార్క్ 9.5-0-49-3; స్టొయినిస్ 7-1-27-2; ఎబాట్ 9-0-31-0; గ్రీన్ 6-0-35-0; జంపా 6-0-37-0; మ్యాక్స్‌వెల్ 2-0-7-0.