తెలంగాణా ఉద్యమకెరటం.. పోరాటం ఆయన నైజం: మహా నాయకుడు కేసీఆర్

కేసీఆర్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో చిన్నపిల్లవాడిని అడిగినా కేసీఆర్ గురించి టక్కున చెప్పేస్తాడు. అంతగా ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయే పేరు కేసీఆర్.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపించిన మహా నాయకుడు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత తెలంగాణను బంగారు తెలంగాణ గా మార్చి .. దేశంలో అగ్రగామిగా నిలిపి దేశం దృష్టిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న గొప్ప రాజనీతిజ్ఞుడు. ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కెసిఆర్ గొప్పతనం గురించి, ఆయన ఉద్యమ ప్రస్థానం గురించి, రాజకీయాలలో కేసిఆర్ పోషించిన పాత్ర గురించి వన్ ఇండియా అందించే ప్రత్యేక కథనం మీకోసం..

చింతమడక చిన్నోడు.. విద్యార్థి దశ నుండే రాజకీయాలలో


1954 ఫిబ్రవరి 17వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ జన్మించారు. మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో రాఘవరావు, వెంకటమ్మ, దంపతులకు జన్మించిన కేసీఆర్ విద్యార్థి దశ నుండే రాజకీయాలలో చురుగ్గా ఉండేవాడు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బిఏ పూర్తి చేసిన కేసీఆర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం. ఏ తెలుగు చేశారు. 1969లో శోభను వివాహమాడిన కేసీఆర్ రాజకీయాలలో ప్రవేశించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. కెసిఆర్ బాటలో ఆయన కుమారుడు కేటీఆర్, కవిత కూడా రాజకీయరంగంలోనే రాణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ ఉద్యమంలో ఎంతోమంది పోరాటం చేసినప్పటికీ సాధ్యం కాని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర లక్ష్యాన్ని కెసిఆర్ ఒక్కడిగా, మొక్కవోని దీక్షతో ప్రాణాలను పణంగా పెట్టి సాకారం చేశారు.

కేసీఆర్ రాజకీయ జీవితం .. తొలినాళ్ళలో ఒడిదుడుకులు


ఇక కెసిఆర్ రాజకీయ ప్రస్తానాన్ని చూస్తే.. అడుగడుగున అవరోధాలు వచ్చినా వెనక్కు తగ్గని ధీశాలిగా కేసీఆర్ కనిపిస్తారు. విద్యార్థి దశ నుండే కేసీఆర్ కు రాజకీయ రంగంలోకి వెళ్లాలని ఆసక్తి ఉండేది. తొలినాళ్లలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయిన కేసీఆర్ పడి లేచిన కెరటంలా ముందుకు సాగారు. అప్పటి కాంగ్రెస్ నాయకుడైన అనంతుల మదన్మోహన్ రాజకీయ గురువుగా, కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన కేసీఆర్ 70 దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగారు. 1982లో ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో ఆయనపై అభిమానంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు. 1983లో తన రాజకీయ గురువు అయిన పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చిన ఆయన 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

1985 నుండి రాజకీయాలలో వెనక్కు చూడని కేసీఆర్


తొలినాళ్లలో ఓటమి చవిచూసిన కేసీఆర్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. 1985లో తొలిసారి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఆ తరువాత వరుసగా 1989, 1994, 1999, 2001( ఉప ఎన్నిక)లో ఆయన విజయం సాధించారు. అనేక కీలక పదవులను కూడా నిర్వహించారు తెలుగుదేశం ప్రభుత్వంలో క్యాబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవిని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా కూడా ఆయన కొనసాగారు. 1999లో నాడు టిడిపి అధినేత చంద్రబాబు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా చంద్రబాబు తన మంత్రివర్గంలో కేసీఆర్ కు స్థానం కల్పించకపోవడంతో అసంతృప్తి చెందిన కేసీఆర్ ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21వ తేదీన తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు.

2001లో టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఏర్పాటు


2001 సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోసం కేసీఆర్ పార్టీ పెట్టిన తొలినాళ్లల్లో ప్రతి ఒక్కరు ఆయనను చూసి నవ్వుకున్నారు. అవహేళనగా మాట్లాడారు. అయినప్పటికీ దృఢ సంకల్పంతో ముందుకు సాగిన కేసీఆర్ తొలి దశ తెలంగాణ ఉద్యమాన్ని, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త అయిన జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలను చూసి ప్రభావితమై ప్రత్యేక తెలంగాణ సాధన దిశగా అడుగులు వేశారు. తెలంగాణ రాష్ట్ర పరిస్థితిని అధ్యయనం చేసి నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు.

తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష .. తెలంగాణా కల సాకారం చేసిన పోరాట యోధుడు


టిఆర్ఎస్ పార్టీని స్థాపించిన 20 రోజులకే 2001 మే 17వ తేదీన తెలంగాణ సింహగర్జన పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాజకీయ పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని ప్రకటించారు. అప్పటి నుండి దశల వారీగా ఉద్యమ వడిని గమనిస్తూ ప్రజల సెంటిమెంట్ కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగారు. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడేలా చేశారు. పదకొండు రోజుల సుదీర్ఘ దీక్షతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి తెలంగాణా రాష్ట్ర కలను సాకారం చేశారు. ఆపై ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంలో సీఎంగా రెండు దఫాలుగా కొనసాగుతున్నారు. తెలంగాణా అభివృద్ధి మోడల్ తో దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. దేశ్ కీ నేత గా ఎదిగి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బీఆర్ఎస్ తో ప్రయాణం మొదలెట్టారు.