నా నిరీక్షణకు ఫలితం దక్కింది.. అతని వల్లే ఈ స్థాయికి వచ్చా: కెఎస్ భరత్

నా నిరీక్షణకు ఫలితం దక్కింది.. అతని వల్లే ఈ స్థాయికి వచ్చా: కెఎస్ భరత్



అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడంపై టీమిండియా వికెట్ కీపర్, తెలుగు తేజం కెఎస్ భరత్ సంతోషం వ్యక్తం చేశాడు.

తన సుదీర్ఘ నిరీక్షణకు ఫలితం దక్కిందన్నాడు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌లతో అండతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని చెప్పాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌తో కెఎస్ భరత్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. దాంతో మహమ్మద్‌ అజారుద్దీన్, వెంకటపతిరాజు, వీవీఎస్‌ లక్ష్మణ్, ఎమ్మెస్కే ప్రసాద్‌, మహమ్మద్ సిరాజ్‌ తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడిన తెలుగు ప్లేయర్‌గా నిలిచాడు. మ్యాచ్‌కు ముందు వెటరన్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్నాడు.

వారి అండ దండలతోనే..


ఈ సందర్భంగా బీసీసీఐ టీవీతో మాట్లాడిన కేఎస్ భరత్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన కోచ్ కృష్ణ రావు వల్లే ఈ స్థాయికి చేరానని చెప్పాడు. 'నా నిరీక్షణకు ఫలితం దక్కింది. భారత్‌ తరఫున ఆడటం చాలా ఆనందంగా ఉంది. ఇది కేవలం నా కల మాత్రమే కాదు. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. నా కుటుంబ సభ్యులు, నా భార్య, స్నేహితులు, కోచ్‌లు అండగా నిలిచారు. వీరి మద్దతు లేకపోతే మాత్రం ఇంతవరకూ వచ్చి ఉండేవాడిని కాదు. మరీ ముఖ్యంగా కోచ్‌ జే కృష్ణారావు నాలోని ఆటను గమనించి తీర్చిదిద్దారు. బ్యాటింగ్‌, కీపింగ్‌ విభాగాల్లో మెలకువలు నేర్పారు. అయితే, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు జాతీయ జట్టుకు ఎంపిక అవుతానని అనుకోలేదు.

ద్రవిడ్ సర్ మాటలతో...


నాలుగైదేళ్లు మంచి ప్రదర్శన ఇచ్చిన తర్వాత అవకాశం రావడం మాత్రం సంతోషంగా ఉంది. నా జీవితం ఏమీ రాకెట్‌ వేగంతో దూసుకురాలేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరాను. భారత్ - ఏ తరఫున ఆడేటప్పుడు కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌తో పరిచయం నాలో చాలా మార్పులు తెచ్చింది. ద్రవిడ్‌తో మాట్లాడిన ప్రతిసారి నా ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చా. 'నీ ఆటతీరును అలాగే ఆడు. ఎవరి కోసమో ఆడకు. సవాళ్లను స్వీకరిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. నువ్వేం చేయగలవో అదే చేయు.. నీకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకో' అని ద్రవిడ్‌ తరచూ చెప్పేవాడు.

పాజిటివ్ ఇంటెంట్‌తో..


భారత్ ఏ తరఫున ఆడటంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదే నా కెరీర్‌పై పెను ప్రభావం చూపింది. సానుకూల దృక్పథంతో ఆడుతూ వస్తున్నా.'అని భరత్ చెప్పుకొచ్చాడు. అరంగేట్ర మ్యాచ్‌లో భరత్ వికెట్ కీపర్‌గా అదరగొట్టాడు. డేంజరస్ లబుషేన్‌ను చాకచక్యంగా స్టంపౌట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఖవాజా రివ్యూ విషయంలోనూ రోహిత్‌కు సరైన సలహా ఇచ్చాడు.

ఆ ఒక్క సిక్స్‌తో...


2012లో ఆంధ్ర జట్టు తరఫున క్రికెట్‌ కెరీర్‌ను ప్రారంభించిన భరత్‌.. 2015లో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టాడు. ఇప్పటి వరకు 79 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ మ్యాచుల్లో 308 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో 4,289 పరుగులు చేశాడు. వీటిలో 9 శతకాలు, 23 అర్ధశతకాలు ఉన్నాయి. ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్ 2021 సీజన్ ఆడిన కేఎస్ భరత్.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్ భరత్‌ను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ఆర్‌సీబీ వదిలేసినా.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అవకాశాలు అందుకోలేకపోయాడు. అప్ కమింగ్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.