2023 వరల్డ్‌కప్.. టీమిండియాకు వాళ్లే అసలైన ఆయుధాలా?
2023 వన్డే ప్రపంచ కప్ దగ్గర పడుతుండడంతో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకి వస్తున్నాయి. ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇస్తోన్న సంగతి అందరికీ తెలిసినదే.
దాంతోనే ఈసారి టీమ్ ఇండియాపై భారీ అంచనాలు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అంతకు మునుపు 2011 ప్రపంచకప్‌లో భారత జట్టు టైటిల్‌ను గెలుచుకున్న సంగతి విదితమే. ఇక ఈ ఏడాది జరగనున్న ప్రపంచకప్‌కు సంబంధించి టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ భారత జట్టుకు సంబంధించి 4 మంది స్పిన్నర్లను ఎంపిక చేశాడు.
అయితే తన జాబితా నుండి అనుభవజ్ఞుడన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను మాత్రం దూరంగా ఉంచాడు. వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని గంభీర్ అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్‌లను జట్టులోకి తీసుకున్నాడు. జట్టులోని అనుభవజ్ఞులైన స్పిన్నర్లలో చాహల్ ఒకడైనప్పటికీ అతగాడిని తీసుకోకపోవడం గమనార్హం. అలాగే ఈ జాబితాలో చేరిన వాషింగ్టన్ సుందర్ జట్టులో రెగ్యులర్‌గా భాగం కావడం లేదు. ఇది కాకుండా కుల్దీప్ యాదవ్ కూడా జట్టు కోసం నిరంతరం మ్యాచ్‌లు ఆడటం లేదు. మరోవైపు రవి బిష్ణోయ్ యువ స్పిన్నర్, ఇప్పటివరకు జట్టు తరపున ఒకే ఒక వన్డే మాత్రమే ఆడాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుల్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి అందరి మన్ననలు పొందాడు. దీని తర్వాత శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్‌కు అవకాశం దొరికినప్పుడల్లా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. అలాగే అక్షర్ పటేల్ బౌలింగ్, బ్యాటింగ్‌లో కూడా బాగా రాణిస్తున్నాడు. శ్రీలంకతో జరిగిన t20 సిరీస్‌లో అక్షర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆ సిరీస్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినందుకు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా కూడా ఎంపికయ్యాడు. కాబట్టి మొత్తంగా ఈ స్పిన్నర్లు 2023 వరల్డ్‌కప్‌కు వరంలా మారబోతున్నారు.