మునుగోడు ప్రజలే నిర్ణయించుకోవాలి

 


మునుగోడు ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారా అని రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నదని మామా (మాల, మాదిగల) సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు డా,మేడే శాంతి కుమార్ మామా అన్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓ వ్యక్తి స్వలాభం, కాంట్రాక్టుల కోసం రాజీనామా చేస్తే వచ్చిన ఉప ఎన్నిక ఇది. గతంలో మతతత్వ బీజేపీ మోసపూరిత మాయమాటలు నమ్మి దుబ్బాక, హూజురాబాద్‌ ప్రజలు మోసపోయారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పక్షపాతం లేకుండా పరిపాలన సాగిస్తున్నది. విపక్షాల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల్లోనూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది. ఈ నేపథ్యంలో ప్రజల మేలు కోరేవారు ఎవరో మునుగోడు ఓటర్లే నిర్ణయించుకోవాలని సూచించారు.

టీఆర్‌ఎస్‌ సుపరిపాలనలో గత ఎనిమిదేండ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా నిలిచింది. దేశ జీడీపీ వృద్ధి రేటుతో పోలిస్తే రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు ఎక్కువ. తలసరి ఆదాయంలో, విద్యుత్‌ వినియోగంలో దేశంలో మనమే టాప్‌. పచ్చదనం, పరిశుభ్రత, హరిత హారం, అడువుల పెంపకం… ఇలా చాలా అంశాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం దాదాపు 68 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇస్తున్నది. మునుగోడు నియోజకవర్గంలో 75 వేల మంది రైతులకు ఈ సాయం అందింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు నెల నెలా సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో దాదాపు 35 వేల మందికి ఈ పింఛన్లు అందుతున్నాయి. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ లాంటి పథకాలతో పేదలు ఎంతో లబ్ధి పొందుతున్నారు. ఇంటర్‌, డిగ్రీ గురుకుల కళాశాలల స్థాపన, బస్తీ దవాఖానాల ఏర్పాటు, హైదరాబాద్‌లో మూడు టిమ్స్‌ ఆసుపతులు ఏర్పాటు, వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు శంకుస్థాపన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ చిత్త శుద్ధికి నిదర్శనం. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నది. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఉచిత చేప పిల్లల పంపిణీ, గొర్రెల పంపిణీ, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దళిత బంధు లాంటి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలు చేపట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందిస్తున్నాయి. ఈ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పడానికి కేంద్రం ఇస్తున్న అవార్డులే ప్రత్యక్ష ఉదాహరణలు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు పొందుతున్నదనేది కాదనలేని సత్యమని వర్ణించారు

ఫ్లోరైడ్‌ రక్కసిని తరిమికొట్టి..

పక్కనే కృష్ణా నది ఉన్నా.. ఉమ్మడి పాలనలో ఏండ్ల తరబడి నల్గొండ జిల్లా వాసులకు గరళం లాంటి నీళ్లే దిక్కయ్యాయి. తెలంగాణ సాధనలో భాగంగా నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్‌.. ఫ్లోరైడ్‌ బాధితులను చూసి కంట తడి పెట్టుకున్నారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత మిషన్‌ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టి ఇంటింటికీ గోదావరి, కృష్ణా నీళ్లను ఇస్తూ ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమికొట్టారు. సురక్షిత తాగు నీరందిస్తున్న కేసీఆర్‌ను ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు ఎప్పటికీ గుండెల్లో దాచుకుంటారు. ఈ విషయం మునుగోడు ప్రజలకు తెలియనిది కాదు. అయితే దీనిపైనా బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తున్నదని ఆరోపించారు.

బీజేపీ చేసిన అన్యాయాలను మర్చిపోదామా?


బీజేపీ తెలంగాణకు మేలు చేయడం అంటుంచితే, అనేక విషయాల్లో రాష్ర్టానికి అన్యాయం చేసింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నది. రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపిస్తున్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కింది. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, నిజామాబాద్‌ పసుపు బోర్డు, హైదరాబాద్‌ ఐటీఐఆర్‌ ఊసే లేదు. ఐఐటీలు, ఐఐఎంలు లాంటి ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయాల్లో రాష్ర్టానికి ఒక్కటి కూడా ఇయ్యలేదు. రాష్ర్టానికి ఏమీ ఇవ్వని కమలం పార్టీని తెలంగాణలో బలపరచాలా, వద్దా అనేది మునుగోడు ప్రజలే నిర్ణయించుకోవాలి. టీఆర్‌ఎస్‌ పార్టీది ఓ ప్రాంత అస్తిత్వం కోసం ఉద్యమం చేసిన చరిత్ర అయితే.. బీజేపీది ఓట్ల కోసం మత ఘర్షణలకు ఆజ్యం పోసే చరిత్ర. టీఆర్‌ఎస్‌ది అభివృద్ధి కోసం తొక్కులాట అయితే.. బీజేపీది ఓట్లు, సీట్ల కోసం కొట్లాట. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వెళ్లిన రాజగోపాల్‌ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు లబ్ధి పొందారన్నది వాస్తవమా, కాదా? ఈ విషయా న్ని మునుగోడు ఓటర్లు నేరుగా ఆయన్నే అడగాలి. గుజరాత్‌కు గులాంగిరీ చేసేవాళ్లు తెలంగాణ ప్రజల బతుకుల్ని ఉద్ధరించేటోళ్లు కాదన్న విషయాన్ని మునుగోడు ప్రజలు మరువకూడదన్నారు.

ఈ నేపథ్యలో రాష్ర్టానికి ఏమీ ఇవ్వని కమలం (బీజేపీ)  పార్టీని తెలంగాణలో బలపరచాలా, వద్దా అనేది మునుగోడు ప్రజలే నిర్ణయించుకోవాలని కోరారు.