ఉత్కంఠ పోరులో పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం



 భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అదే చివరి వరకూ ఆ టెన్షన్ కొనసాగితే ఆ కిక్కే వేరు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేని విధంగా సాగిందీ టీ20 ప్రపంచకప్ మ్యాచ్. అయితే చివరి బంతికి విజయం భారత్‌నే వరించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు బౌలర్లు శుభారంభం అందించారు. పాక్ ఓపెనర్లు బాబర్ ఆజమ్ (0), మహమ్మద్ రిజ్వాన్ (4) ఇద్దరినీ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేర్చారు.

అనంతరం వచ్చిన షాన్ మసూద్ (52 నాటౌట్), ఇఫ్తికర్ అహ్మద్ (51) రాణించారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు షాదాబ్ ఖాన్ (5), హైదర్ అలీ (2), మహమ్మద్ నవాజ్ (9), ఆసిఫ్ అలీ (2) ఎవరూ రాణించలేదు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ (8 బంతుల్లో 16), హారిస్ రవూఫ్ (4 బంతుల్లో 6 నాటౌట్) బౌండరీలు బాదారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ చెరో వికెట్ తీసుకున్నారు.

160 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. రోహిత్ (4), రాహుల్ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) వచ్చిన వారు వచ్చినట్లే పెవిలియన్ బాట పట్టారు. ఇలాంటి సమయంలో జట్టు భారాన్ని భుజాలపై వేసుకున్న విరాట్ కోహ్లీ (82 నాటౌట్) అద్భుతంగా పోరాడాడు. హార్దిక్ పాండ్యా (40) అండగా నిలబడటంతో రెచ్చిపోయిన కోహ్లీ.. అవసరమైన రన్‌రేట్ పెరిగిపోయిందని అనిపించిన ప్రతిసారీ బౌండరీలు బాదుతూ వచ్చాడు.

చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం కాగా తొలి బంతికే పాండ్యా అవుటయ్యాడు. ఆ తర్వాత సింగిల్, డబుల్ వచ్చాయి. ఆ మరుసటి బంతికి కోహ్లీ సిక్సర్ బాదగా.. అది నోబాల్. ఫ్రీ హిట్ డెలివరీ వైడ్ అయింది. దీంతో మరో బంతి వేశారు. దీనికి మూడు రన్స్ వచ్చాయి. ఆ తర్వాత రెండు బంతుల్లో రెండు పరుగులు అవసరం అయ్యాయి. ఈ సమయంలో దినేష్ కార్తీక్ స్టంప్ అవుట్ అయ్యాడు.

నవాజ్ వేసిన బంతిని ముందుకొచ్చి బాదేందుకు అతను ప్రయత్నించి విఫలమయ్యాడు. దీంతో బంతి అందుకున్న రిజ్వాన్.. వికెట్లను పడగొట్టాడు. మరుసటి బంతి వైడ్. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో భారత్ విజయం సాధించింది. పాక్ బౌలర్లలో హారిస్ రవూఫ్, మహమ్మద్ నవాజ్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు. నసీమ్ షా ఒక వికెట్ తీసుకున్నాడు.