ప్రభుత్వం విడుదల చేసిన ఎల్.ఆర్.ఎస్ జీవో నెంబర్ 131ని రద్దు చేయాలని ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివ కుమార్ డిమాండ్ చేేశారు. బుధవారం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం అంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన లేఅవుట్ రెగ్యులరైజేషన్ రూల్స్ సామాన్య ప్రజలకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమబద్ధీకరణ చేసుకోకుంటే రిజిస్ట్రేషన్లు చేయబోమని, నల్లా, డ్రైనేజీ కనెక్షన్లు, రోడ్స్ తదితర సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారని అన్నారు.తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన 131 జీవోతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇళ్ళు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికే రిజిస్టర్ అయిన భవనాలు, స్థలాల అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా ఆగిపోయాయని అన్నారు. కరోనా తాకిడి, లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆదాయం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఎల్ఆర్ఎస్ పేరుతో ప్రజలపై విపరీతమైన భారం మోపడం శోచనీయమన్నారు. ప్రభుత్వం వెంటనే 131 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనధికారికంగా ఏర్పడుతున్న కొత్త లేఅవుట్లు, కొత్త ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా నిరాకరించాలి తప్ప ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన వాటిని అడ్డుకోవడం అభివృద్ధి నిరోధక అవుతుందని ధ్వజమెత్తారు. పాత లేఅవుట్లు, ప్లాట్ లపై ఎల్లారెస్ (LRS) పేరుతో వేలు, లక్షల రూపాయల్లో పెనాల్టీలు విధించడంతో ప్రజలపై పెను భారం పడుతుందని, ఇది భరించే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.
ఇప్పటికే రిజిస్టర్ అయిన భవనాలు, ఫ్లాట్ల అమ్మకాలు, కొనుగోలు చేసుకునేలా రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని డిమాండ్ చేశారు. బలవంతంగా ఎల్లారెస్ (LRS) ను ప్రజలపై రుద్దే చర్యలను వెంటనే నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 131కి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం జీవో నెంబర్ 131 రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టి, ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం - నల్లగొండ ఉమ్మడి జిల్లాల సమన్వయ కర్త కుడుతల నాగరాజు, స్టీరింగ్ కమిటీ ఇంచార్జి కత్తుల సందీప్, పట్టణ అధ్యక్షులు గౌతమ్ వంశీ, జిల్లా నాయకులు శ్రీకాంత్, మహేష్, హరికాంత్, శివానంద్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.