- - పోలీస్ శాఖకు సానిటైజర్లు, మాస్కులు అందించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
- - కరోనా కేసుల నియంత్రణలో పోలీసుల కృషి ఎనలేనిది
- - బ్యాంకులలోనూ అన్ని రకాల జాగ్రత్తలతో వినియోగదారులకు సేవలు
నల్లగొండ : కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పోలీసులు చేస్తున్న అలుపెరుగని కృషి, వారి నిబద్ధత అద్వితీయమని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్లు సుశాంత్ కె బెహ్రా, ఎస్. అంకారావులు కొనియాడారు.
గురువారం పంజాబ్ నేషనల్ బ్యాంక్ హైదరాబాద్ రోడ్డు శాఖ, ప్రకాశం బజార్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ కె. దయాకర్ రావుకు సానిటైజర్లు, మాస్కులు అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ - 19 రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తూ వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ శాఖలోనూ అన్ని స్థాయిల అధికారులు కరోనా బారిన పడినప్పటికీ ప్రజలను కాపాడడం ధ్యేయంగా ప్రజలకు నిరంతరం అవగాహన కల్పిస్తూ విధి నిర్వహణ చేస్తూ వారియర్స్ పదానికి నిజమైన నిర్వచనంగా పని చేస్తున్నారని అభినందించారు. నల్లగొండ జిల్లాలో ఒక్క జులై, ఆగస్టు నెలల్లోనే కేసుల తీవ్రత మరింత పెరగడం ఆందోళన కలిగిస్తున్నదని చెప్పారు. ప్రజలంతా కరోనా బారిన పడకుండా అన్ని రకాల జాగ్రతలు పాటించాలని, విధిగా మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని కోరారు. ముఖ్యంగా బయటికి వచ్చే సమయంలో విధిగా మాస్కు ధరించాలని కోరారు. కరోనాపై ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, శానిటేషన్ సిబ్బందికి ప్రజలంతా సహకరించి కరోనా కట్టడిలో తమవంతు భాగస్వామ్యం కావాలని వారు సూచించారు. పోలీసులు చేస్తున్న కృషికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆధ్వర్యంలో తమ వంతు సహకారం అందించాలనే లక్ష్యంతో సానిటైజర్లు అందించడం జరిగిందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా తమ బ్యాంకులలో వినియోగదారులు, సిబ్బంది రక్షణ లక్ష్యంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంతున్నాయని, ప్రతి నిత్యం తమ బ్యాంకులను సానిటైజ్ చేయడం ద్వారా వినియోగదారులకు ఆరోగ్యవంతమైన సేవలందిస్తున్నామన్నారు.
కార్యక్రమంలో జిల్లా పోలీసు కార్యాలయ సూపరింటెండెంట్ కె. దయాకర్ రావు, రామలింగం, కె. సత్య నారాయణ, వెంకన్న, గౌతమి జూనియర్ కళాశాల డైరెక్టర్ సి.హెచ్. వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.