- - మండపాల నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులను కోరిన రూరల్ పోలీసులు
- - దేవాలయాలలో రెండు ఫీట్ల ఎత్తులో మాత్రమే విగ్రహాలను ఏర్పాటు చేయాలి
- - బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు
నల్లగొండ : కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు మరింత బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులతో సహకరించాలని నల్లగొండ టూ టౌన్ ఇంచార్జ్ సిఐ సురేష్ బాబు కోరారు.
గణేష్ నవరాత్రులు, మోహర్రం పండుగల నేపధ్యంలో గురువారం మండల పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సురేష్ బాబు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాలు, రోడ్లపై విగ్రహాలను ఎట్టి పరిస్థితులలో అనుమతించబోమని స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనల నేపధ్యంలోనే గణేష్ నవరాత్రులపై ఆంక్షలు విధించడం జరిగిందని తెలిపారు. ఇదే సమయంలో మోహర్రం సందర్బంగా ఊరేగింపు సైతం ఈ ఏడాది అనుమతి లేదని చెప్పారు. నల్లగొండ జిల్లాలో జులై, ఆగస్టు నెలల్లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, శుభకార్యాలు, పండుగలు, బోనాల లాంటి ఉత్సవాల క్రమంలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుందని చెప్పారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మండపాల ఏర్పాటును అనుమతించడం లేదని, ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో అవగాహన కల్పించడంతో పాటు తమతో సహకరించాలని సురేష్ బాబు సూచించారు.
రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం దేవాలయాలు, ప్రహారీ గోడలు ఉన్న ప్రాంతలలోనే విగ్రహాల ఏర్పాటుకు అనుమతించడం జరిగిందని, అది కూడా కేవలం రెండు ఫీట్ల ఎత్తులో మాత్రమే విగ్రహాల ఏర్పాటు చేయాలని సూచించారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర, డి.జె.లు ఏర్పాటు చేయడానికి అనుమతి లేదని వీటిని ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే శాంతి సంఘం సభ్యులు, ఉత్సవ కమిటీలకు, విగ్రహాల తయారీదారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
అనంతరం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమావేశంలో పాల్గొన్న వారికి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. సమావేశంలో అనంత రెడ్డి, మిట్టపల్లి సురేష్ గుప్త, ప్రద్యుమ్నా రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.