- - జైలు నుండి విడుదలైన పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా పెంచాలని అధికారులకు ఆదేశం
- - శాంతి భద్రతల పరిరక్షణలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం
- - కోవిడ్ పట్ల గ్రామీణ ప్రజలలో అవగాహన కల్పించాలి
నల్లగొండ : జైలు నుండి విడుదలయ్యే నేరస్తులు, ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్ల కదలికలపై నిఘాను మరింత పెంచాలని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ పోలీస్ అధికారులను ఆదేశించారు.
నేడు (గురువారం) జిల్లా పోలీస్ కార్యాలయంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ పోలీస్ అధికారులతో ఆయన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్ల దినసరి కార్యకలాపాలపై సైతం నిఘా ఉంచాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడైనా పోలీస్ అధికారులు అవినీతికి పాల్పడినట్లుగా తన దృష్టికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. అదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొనే అధికారులపై విచారణ చేసి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ల వారీగా నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. డిఎస్పీ స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి విషయాలలో పర్యవేక్షణ చేస్తూ పటిష్టమైన పోలీసింగ్ అమలయ్యేలా చూడాలని చెప్పారు. పిడిఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా గుట్కా, గంజాయి, పేకాట లాంటి అంశాలపై పర్యవేక్షణ చేస్తూ అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ రంగనాధ్ పోలీస్ అధికారులకు సూచించారు. వీటన్నింటితో పాటుగా ప్రతి పోలీస్ అధికారి విధిగా నాణ్యతతో కూడిన నేర విచారణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ డిజిపి ఆదేశాలకు అనుగుణంగా నేర విచారణల్లో ముందుకు సాగాలని ఆయన అధికారులకు సూచించారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ విధి నిర్వహణ చేయాలన్నారు. రానున్న రెండు, మూడు నెలల సమయం మరింత ఇబ్బందికరంగా ఉండే ప్రమాదం ఉన్నదని, అందువల్ల పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని స్థాయిల పోలీస్ అధికారులు గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని, విధిగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలని, ఇందుకోసం స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. కరోనా సోకిన వ్యక్తి పట్ల వివక్ష చూపకుండా మానసిక ధైర్యం నింపే విధంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. కరోనాకు సంబందించిన సమాచారం పోలీసులకు తెలియపరిచేలా ప్రజలలో చైతన్యం తేవాలని ఎస్పీ అధికారులకు తెలిపారు.
సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీమతి నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సిఐలు రవీందర్, సురేష్, ఆదిరెడ్డి, శంకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, గౌరు నాయుడు, సదా నాగరాజు, బాలగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ అనీల్ కుమార్, పరమేష్ తదితరులున్నారు.