రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే ...... వివిధ కథనాలు


నేడు రాఖీ పౌర్ణమి


ఇంటింటా సందడి


భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. అంతటి శక్తి గల సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ రక్షాబంధన సంప్రదాయాన్ని ఏర్పరిచారు. చారిత్రకంగా, ఐతిహాసికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది.



సాధారణ సంప్రదాయం ప్రకారం రక్షాబంధన దినోత్సవం నాడు సోదరులకు తోబుట్టువులు రక్షాబంధనం కడితే విశాల దృక్పథంతో గ్రామ ప్రజలందరి హితాన్ని కోరుతూ పురోహితుడు ప్రజలందరికీ రక్షాబంధనం కట్టడం కూడా గమనించవచ్చు. అంతేకాదు, యుద్ధ సమయాలలో సైనికులు దేశ రక్షణకు ముందుకు నడుస్తున్నప్పుడు, సరిహద్దు ప్రాంతాలలోని యువతులు, వృద్ధులు, బాలికలు సైనికులందరికీ రక్షాబంధనం కట్టి తిలకం దిద్ది, మంగళహారతులతో సాగనంపడం రివాజు.


రక్షాబంధన మంత్రం


యేనబద్ధో బలీరాజా దానవేంద్రోమహాబలః తేనత్వామభి బధ్నామి రక్షమాచల మాచల 'బలాధికుడు, దానశీలుడు అయిన రాక్షసరాజు బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతున్నాను. నీ చేతిని అంటి పెట్టుకుని ఉండే ఈ రక్షాకవచ ప్రభావం వల్ల దేవతలందరూ నీ పక్షాన నిలచి ఏ ప్రమాదమూ జరగకుండా నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను' అని ఈ మంత్రానికి అర్థం.



రక్షాబంధన పండుగ పరమార్థం


ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే- ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలని. ఎంత ఖరీదైన రాఖీ అయినా కట్టుకోవచ్చు కానీ నూలు పోగుది మంచిది.


జంధ్యాల పూర్ణిమ


దైవీశక్తులతో కూడిన శ్రావణ పూర్ణిమనాడు చేసే దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం సత్ఫలితాలనిస్తాయి. దక్షిణ భారతదేశంలో శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు న దులలో, చెరువులలో లేదా కాలువ స్నానం- అదీ కుదరని పక్షంలో ఇంటి వద్దనయినా స్నానం చేసి జీర్ణ (పాత)యజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మ (ముంజవిడుపు) జరిపిస్తారు. యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరు ఈ రోజున జంధ్యం మార్చుకోవడం ఆచారం గనుక దీనిని జంధ్యాల పూర్ణిమగా పేర్కొంటారు.



హయగ్రీవజయంతి: బ్రహ్మవద్దనుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసురుని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చిన రోజిది. ఈ రోజున విద్యార్థులు 'జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే'అనే శ్లోకాన్ని పఠిస్తూ హయగ్రీవ రూపంలోని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయని, జ్ఞానం వికసిస్తుందనీ ప్రతీతి.



 అన్నాచెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతిరూపం రాఖీ.. రక్త సంబంధాలకు తీయని వేడుక.. సోదరుడి మణికట్టుపై సోదరి కట్టే రక్షాదారాలు అనురాగాల మొగ్గలు తొడిగి ఆప్యాయత కుసుమాలు వికసించి వాత్సల్య పరిమళాలు వెదజల్లుతాయి. సౌభ్రాతృత్వం, సామరస్యత వెల్లివిరిసేందుకు ఈ పున్నమి వేడుకను వేదికగా చేసుకునే సంప్రదాయం కొనుసాగుతుంది.


అమ్మలోని మొదటి సగం.. నాన్నలోని చివరి సగం.. కలిపితేనే అన్న.. అమ్మలోని కమ్మదనాన్ని... నాన్నలోని మాధుర్యాన్ని ప్రతి అన్నా తన చెల్లెలికి అందించాలని కోరుకుంటాడు. వేద కాలంలో శ్రావణ పౌర్ణమికి ప్రాధాన్యత ఉండేది.


వేదవిద్యను నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థులకు ఈ రోజున యజ్ఞోపవితం చేసేవారు. మిగిలిన విద్యలు నేర్చుకునే వారి మణికట్టుకు దారం కట్టేవారు. అన్నాచెల్లెల అనుబంధానికి గతంలో ప్రాముఖ్యం ఉండేది. గ్రామాల్లో ఏరువాక సాగిన తరువాత అన్న తన చెల్లెలి ఇంటికి వెళ్లి తొలుత బావకు, చెల్లికి వ్యవసాయ పనుల్లో సాయంగా ఉండేవాడు. అరక తోలడం నుంచి ఎరువులు వేయడం, కలుపులు తీయించడం అన్నీ దగ్గరుండే చేయించేవాడు. తన పనులు కన్నా తన చెల్లెలి పనులు అత్యంత శ్రద్ధతో చేసేవాడు. అందుకే బామ్మర్ది బావ బ్రతుకు కోరుతాడనే సామెత వచ్చింది.


వైఖాసన మహర్షి పుట్టిన రోజు నేడు


సకల వైష్ణవ ఆలయాల్లో అర్చనా విధానాన్ని తెలియజెప్పిన వైఖాసన మహర్షి జన్మించింది ఈ రోజునే. వైఖాసన సూత్రమనే ప్రకరణాన్ని రచించిన ఆ మహనీయుడు నేటికీ ఆయన వంశీకులైన వైఖాసనులచే శ్రావణ పూర్ణిమ రోజున ప్రత్యేక పూజలు అందుకుంటారు. సకల విద్యలకు అదిపతులైన హయగ్రీవుడు అవతరించింది శ్రావణపూర్ణిమ రోజునే. పలు దేవాలయాల్లో నేటి నుంచి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి.



అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతిరూపం


ప్రతి ఇంట్లో ఈ పండుగను జరుపుకుంటారు. ఎక్కడ ఉన్నా ఈ శ్రావణ పౌర్ణమికి అన్నాతమ్ముళ్లకు రాఖీలు కట్టాలని అక్కా చెల్లెల్లు ఆశపడుతుంటారు. తన సోదరితో రాఖీలు కట్టించుకోవాలని, తనకు అండగా ఉంటానని హామీ ఇవ్వడానికి సోదరులు ఆరాట పడుతుంటారు. సోదరుడి నుదిటిన తిలకం దిద్ది ముంజేతి మణికట్టుపై రక్షాబంధనాలు కట్టి వారిచ్చే కానుకలు స్వీకరిస్తారు. పరస్పరం మిఠాయిలతో నోరు తీపి చేసుకుంటారు.


రాఖీ , రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. కొంతకాలం క్రితం వరకూ ఉత్తర, పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు. ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు. అన్నకుగాని తమ్మునికిగాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. అది చాలా ఉత్సాహంతో జరుపుకుంటూరు.


ఈ రోజు(3 ఆగస్ట్ 2020) దేశం మొత్తం రక్షబంధన్ పండుగను శాస్త్రోక్తంగా, సంప్రదాయంగా జరుపుకుంటుంది. రక్షాబంధన్ హిందువుల ప్రధాన పండుగ, దీనిని శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సోదరుడుని సోదరి ఆప్యాయంగా దారంతో బంధించే పండుగ ఇది.


ఈ పండుగ సోదర సోదరిమణుల అచంచలమైన ప్రేమకు చిహ్నం. ఈ రోజున, సోదరీమణులు సోదరుడి మణికట్టు మీద రాఖీని కట్టి, సుదీర్ఘ జీవితాన్ని కోరుకుంటారు. సోదరులు తమ సోదరీమణులను రక్షించుకుంటామని వాగ్దానం చేస్తారు. సోదరీమణులకు బహుమతులు ఇస్తారు.


రాఖీ శుభ సమయం ఎప్పుడు ?


రక్షాంధన్ పవిత్ర సమయానికి రాఖీని కట్టాలి. ఈ పండుగలో పంచాంగం ప్రకారం, అనేక శుభ యోగాలు జరుగుతున్నాయి.


రాఖీ శుభ సమయం ఉదయం 9 నుండి 10:22 వరకు మరియు మధ్యాహ్నం 1:40 నుండి 6:37 వరకు. పవిత్ర సమయంలో రాఖీని కట్టడం శుభ ఫలితాలను ఇస్తుందని, శుభప్రదమని నమ్ముతారు.


ఈ రోజున రెండు ప్రత్యేక యాదృచ్చిక సంఘటనలు చోటుచేసుకున్నట్లుగా జ్యోతిష్కులు చెబుతున్నారు. రక్షా బంధన్ 29ఏళ్ల తర్వాత సర్వార్థ సిద్ధి మరియు ఆయుష్మాన్ దీర్ఘాయువుల శుభ కలయికగా వస్తుంది. రెండవది, 558 సంవత్సరాల తరువాత, ఆగస్టు 3 న, సావన్ నెల పౌర్ణమి నాడు, గురు, శని, రాహు మరియు కేతువుల కదలికలు తిరోగమనం సమయంలో వస్తుంది. జ్యోతిష్కుల అభిప్రాయం ప్రకారం, ఈ మహాసయోగం మేషం, వృషభం, కన్య, ధనుస్సు మరియు మకరం రాశులవారికి చాలా పవిత్రంగా ఉంటుంది.


రక్షాబంధన్ ఎలా ప్రారంభమైందంటే...


పూర్వం దేవతలకు , రాక్షసుల కు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై , తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతిలో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు. శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.. నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి.


రాఖీపౌర్ణమి చరిత్ర లేదా ద్రౌపది - శ్రీకృష్ణుని బంధం...


ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది , శ్రీకృష్ణుడికి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. అందుకు ప్రతిగా దుశ్శాసనుడి దురాగతం నుండి ఆమెను కాపాడుతాడు.


శ్రీ మహావిష్ణువు - బలిచక్రవర్తి....


శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి , తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత ఏర్పడింది. (ప్రాచీన గాథ *" యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వా మభిబధ్నామి రక్షే మా చల మా చల"* భావం - ఓ రక్షాబంధమా ! మహాబలవంతుడూ , రాక్షసరాజు అయిన బలిచక్రవర్తిని బంధించినావు. కాబట్టే నేను నిన్ను ధరస్తున్నాను.)


అలెగ్జాండర్‌ భార్య - పురుషోత్తముడి కథ...


చరిత్రపుటల్లో అలెగ్జాండర్‌ భార్య 'రోక్సానా' తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్‌ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి ఆఫ్ఘనిస్తాన్ )కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను , ముఖ్యంగా జీలం , చినాబ్‌ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్‌ ఆలోచన. అలెగ్జాండర్‌ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్‌ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన భర్త అయిన అలెగ్జాండర్‌ను చంపవద్దని రోక్సానా పురుషోత్తముడిని కోరుతుంది. దీంతో పురుషోత్తముడు యుద్ధం గెలిచినా అలెగ్జాండర్‌ను చంపకుండా విడిచిపెడతాడు.


హయగ్రీవావతారం చరిత్ర....


శ్రీ మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో మాత్రమే తనకు మరణం వచ్చేలా అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు. శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ వస్తుందన్నది వారి ఆలోచన. అయితే ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు మెడకు తగిలి ఆ దెబ్బకు విష్ణువు తల ఎటో ఎగిరి వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి లేచాడు. ఆ లేచిన రోజే శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను , శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది. అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి కూడా జరపడం కనిపిస్తుంది.


"జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్


ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే"


హయగ్రీవ స్వామి అంటే చదువుల దేవుడు. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. భారతీయులంతా ఈ రోజు రాఖీ పండగను సోదరులతో ఘనంగా జరుపుకొంటారు. కానీ రాఖీ రోజున మరో ప్రత్యేకత కూడా మనకు ఉంది. అదే హయగ్రీవ జయంతి. ఆ హయగ్రీవ జయంతి ప్రత్యేకత ఏమిటో, ఆ రోజున ఏం చేస్తే ఆ స్వామివారి అనుగ్రహం లభిస్తుందో తెలుసుకుందాం.


హయగ్రీవుడు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమయే 'హయగ్రీవ జయంతి'. హయగ్రీవుడనగానే సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు 'హయగ్రీవుని'గా అవతరించాడు. హయగ్రీవుడు అంటే గుర్రపు తల ఉన్నవాడు అని అర్థం. ఒకసారి మధుకైటభులు అనే రాక్షసులు వేదాలను దొంగిలించారట. అప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ధరించి, ఆ మధుకైటభులను వధించి... వేదాలను రక్షించాడు. వేదాలు జ్ఞానానికీ, వివేకానికీ చిహ్నాలు. ఆ వేదాలనే రక్షించాడు కాబట్టి హయగ్రీవుడు జ్ఞాన ప్రదాతగా భావిస్తారు.


హయగ్రీవునకు ఆ ఆకారం ఉండటానికి వెనుక కూడా ఓ గాథ వినిపిస్తుంది. వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయి. ఆ అవతారాలలో 'హయగ్రీవావతారం' విశిష్టమైనది. 'హయం' అనగా గుఱ్ఱం, 'గ్రీవం' అనగా కంఠం. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం.


రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణ పూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా పూజించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూ వివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతోపాటు సకల దేవతలు సంపూర్ణ శుభాశీస్సులు కూడా సంప్రాప్తమవుతాయి. ఈ క్రింది స్తోత్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయి.


"జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్


ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే"


పురాణ ఇతిహాసం :- పూర్వం గుర్రపుతల ఉన్న ఓ రాక్షసుడు ఉండేవాడు. తనలాగే గుర్రపు తల ఉన్న వ్యక్తి చేతిలోనే తనకు మరణం ఉండాలన్న వరం ఆ రాక్షసునికి ఉంది. దాంతో అతన్ని సంహరించేందుకు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారాన్ని ఎత్తినట్లు తెలుస్తుంది. ఆ హయగ్రీవుని ఆరాధించడం వలన జ్ఞానము, విజయం లభిస్తాయన్నది పెద్దల మాట.


హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ ఆయనలో సకల దేవతలూ కొలువై ఉన్నారని పురాణాలు పేర్కొంటున్నాయి. సూర్య, చంద్రులు కళ్లుగా, దేవతలు ఎముకలుగా, అష్టవసువులు పాదాలుగా, అగ్ని నాలుకగా, సత్యం వాక్కుగా, బ్రహ్మ హృదయంగా... ఇలా ఆయనలోని అణువణువూ దేవతామయమని అంటారు. మరి అలాంటి హయగ్రీవుని ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించిన ఫలితం దక్కుతుంది కదా!


హయగ్రీవుని ఆరాధన ఇంత విశిష్టమైనది కనుకే కొందరు ప్రత్యేకించి హయగ్రీవుని ఉపాసిస్తారు. అత్యంత నిష్టతో కూడుకున్న హయగ్రీవ ఉపాసన అందరికీ సాధ్యం కాదు కాబట్టి... కనీసం హయగ్రీవ జయంతి రోజున అయినా ఆయనను ఆరాధించాలి. హయగ్రీవుడు లేదా విష్ణుమూర్తి ఉన్న పటాన్ని పూజగదిలో పెట్టుకుని హయగ్రీవ స్తోత్రాన్ని కానీ, హయగ్రీవ అష్టోత్తర శతనామావళిని పఠించాలి.


హయగ్రీవ స్వామి ఆలయాలు:- హయగ్రీవ స్వామి ఆలయాలు భారతదేశమంతటా అనేక ప్రదేశాలలో ఉన్నాయి. హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న యాదాద్రిలోని లక్ష్మి నరసింహస్వామి వారి ఆలయంనకు అతి సమీపంలో వంగపల్లి అనే గ్రామం దగ్గర శ్రీ లక్ష్మి హయగ్రీవ ఆలయం ఉన్నది. ఈ ఆలయంలో ప్రతి నెల శ్రవణా నక్షత్రం రోజు విద్యకొరకు పిల్లలకు తేనెతో నాలికపై భీజాక్షరాలు వేస్తారు. ఆ రోజు విశేష పూజలు జరుగుతాయి. ఈ భీజాక్షరాలు ఎవరైనా వేసుకోవచ్చును కానీ మగవారైతే పంచ కట్టుకోవాలి, ఆడవారు చీర కట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది.


పూజ వస్తువులు :- హయగ్రీవునికి తెలుపురంగు పూలు, యాలుకలతో చేసిన మాల, గుగ్గిళ్ల నైవేద్యం చాలా ఇష్టమని చెబుతారు. ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే కాబ్టటి, వాటిని ఆయనకు అర్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.


అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి సన్నిదిలో సత్యనారాయణ వ్రత కథ చెప్పే పండితులు ఈ క్రింది మంత్రాన్ని చదివి కథ మెదలు పెడతారు.


హయగ్రీవ స్తోత్రము:-


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం |


నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 ||


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |


తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| 2 ||


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |


వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 ||


ఫలశ్రుతి :


శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |


వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4 ||


హయగ్రీవుడు జ్ఞానప్రదాత. అందుకనే చాలామంది హయగ్రీవ జయంతిని శుభప్రదంగా భావించి, ఆ రోజున అక్షరాభ్యాసం కూడా చేసుకుంటారు. ఈ రోజు ఆయనను ఆరాధించినవారికి సకల విద్యలు అబ్బుతాయని, అన్ని ఆటంకాలు తొలగిపోతాయనీ చెబుతారు. ఇక హయగ్రీవుడు లక్ష్మీపతి కాబట్టి, ఆయన ఆరాధన వలన సిరిసంపదలకు కూడా లోటు లేకుండా ఉంటుంది. చదువుకునే విద్యార్ధులు ప్రత్యేకించి ఈ హయగ్రీవ జయంతి రోజున ఆయనను ఆరాధించి మీ మనోభీష్టాలన్నింటినీ నెరవేర్చుకోండి.


మాసాలన్నింటిలో శ్రావణమాసం ప్రత్యేకతను ... ప్రాధాన్యతను కలిగివుంది. శ్రావణమాసం శుభాన్ని సూచిస్తుందనీ ... శుభకార్యాలకు ద్వారాలు తెరుస్తూ ఆనందాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శ్రవణా నక్షత్రంతో పౌర్ణమి చంద్రుడు కూడిన మాసమే 'శ్రావణ మాసం'గా భావించబడుతోంది. శ్రావణ మాసంలో సోమవారం, మంగళవారం, శుక్రవారం, శనివారం, పౌర్ణమి విశిష్టమైనవిగా చెబుతుంటారు. పరమ శివుడు సముద్రమధనంలో వెలువడిన హాలాహలాన్ని శ్రావణమాసంలోనే సేవించి నీలకంఠుడైనాడని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం పరమ శివుని పూజిస్తే అనుకున్న కార్యాలు చేకూరుతాయి. పార్వతి దేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.శ్రావణ సోమవారం రోజున చేసిన శివారాధన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మహర్షులు చెప్పారు.


ఈ రోజున సాక్షాత్తు విష్ణుమూర్తి కూడా శివరాధాన చేస్తాడట. అందువలన ఈ రోజున పరమశివుడిని భక్తితో అభిషేకించిన వారిని ఆయనతో పాటు విష్ణువు కూడా అనుగ్రహిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా శివాలయాల్లో జరిగే అభిషేకాలు, పూజలు చేయించేవారికి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ఇక అమ్మవారిని మంగళ గౌరీ అంటారు కనుక మంగళవారం రోజున అమ్మవారిని పూజిస్తూ 'శ్రావణ మంగళవారం' నోము నోచుకుంటారు. తమ సౌభాగ్యాన్ని కాపాడమంటూ వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోము నోచుకుంటారు. మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయిస్తే సకలసంపదలు చేకూరుతాయి.


శ్రావణ పూర్ణిమను జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేసి , జప , అర్చనాదులను నిర్వహిస్తుంటారు. యజ్ఞోపవీతము అనే పదము 'యజ్ఞము' 'ఉపవీతము' అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే 'యాగము' 'ఉపవీతము' అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్థము.


యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాననే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు.


శ్రావణ పౌర్ణమి నాడు ఉపాకర్మ ప్రత్యేకమైన విధి. ఇది వేదాధ్యయానికి సంబంధించినది. ప్రాచీన సంస్కృత నిఘంటువైన 'అమరకోశాన్ని' రచించిన అమరసింహుడు 'సంస్కార పూర్వం గ్రహణం స్వాదుపాకరణం శ్రుతేః' అన్నాడు. సంస్కారం అంటే ఉపనయనం, వేదాన్ని అధ్యయనం చేయడం 'ఉపాకరణం'. సంస్కారపూర్వకంగా వేదాధ్యయనం చేయడమే ఉపాకర్మ. మహర్షులు మనకు విధించిన పదహారు సంస్కారాలలో ఉపనయనం ఒకటి. సంస్కారాలన్నింటిలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. ఉపనయనం ద్వారా గురువు తన శిష్యునికి ప్రతిభా పాటవాలను, జ్ఞానాన్ని ఉపదేశించి ఉపదేశిస్తాడు. ఉపనయన సంస్కారం పొందినవారిని 'ద్విజుల' అని అంటారు.


ఉపనయన సందర్భంలోనే యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. ఎడమ భుజంపైనుండి ధరిస్తారు కాబట్టి దీనిని ఉపవీతమంటారని అమరకోశం చెబుతుంది. ఉపనయనం చేసుకుని జంధ్యాన్ని వేసుకున్న వ్యక్తి త్రికాల సంధ్యావందనం చేయుటకు, గాయత్రీ పూజ చేయుటకు, ఇతర పూజలు చేయుచుటకు అర్హుడవుతాడు. యజ్ఞోపవీత ధారణకు అర్హులైనవారందరూ ఈ రోజు పాత జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) ధరించవలెను. 'సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్ తత్సూత్రముపవీతత్వాత్ బ్రహ్మసూత్రమితి సృతమ్' బ్రహ్మతత్వాన్ని సూచించడానికి, వేద తత్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని ( యజ్ఞోపవీతాన్ని ) ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. అదే ఉపవీతము అంటే రక్షణ వస్త్రం.


యజ్ఞోపవీతాన్ని శిఖనూ తప్పని సరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి. అందుకే ద్విజులు అంటే రెండు జన్మలు కలిగినవారు అని, ఒకటి అమ్మ కడుపు నుంచి పుట్టడం జన్మ అయితే, ఈ గాయత్రి దేవిని ఉపాసించి యజ్ఞోపవీతం ధరిండం ఆ తల్లి అనుగ్రహం పొందడం రెండవ జన్మ అన్నమాట. ఋగ్వేదులైనవారు శ్రావణమాసంలో ఏ రోజు శ్రవణా నక్షత్రం ఉంటుందో ఆ రోజే ఆచరించాలి. యజుర్వేదులకు పౌర్ణమి ప్రధానం. వారు పౌర్ణమినాడు దీన్ని ఆచరిస్తారు. సామవేదులు మాత్రం హస్తా నక్షత్రము రోజున ఆచరించవలసి వుంటుంది. ఇలా ఆయా వేదాలు వారు వారికి నియమించిన తిథి నక్షత్రాలను బట్టి ఉపాకర్మను ఆచరిస్తారు.


ఆదిదేవుడు , సర్వమంగళా ( పార్వతీ )పతి, సర్వమంగళ కారకుడైన శివుడు కూడా మంగళం కలిగేందుకు ఉపవీతాన్ని ధరిస్తాడని యజుర్వేదంలోని 'నమో హరి కేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః' అనే మంత్రం మనకు చెబుతోంది. యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది. అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని, యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపు పోగులతో నిర్మించాలని, ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం. మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులవో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలూ ఉంటారు.


యజ్ఞోపవీతం తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని వశిష్ఠస్మృతి ప్రమాణంగా తెలియజేసింది. నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే తొంభై ఆరు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం. బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్ని, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను, ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. బాలురకు ఒంటి ముడి వున్న అంటే మూడు పోగుల జంధ్యాన్ని ధరింపజేస్తారు. ఈ మూడు పోగులు బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు.


బ్రహ్మచారులు శ్రావణ పౌర్ణమినాడు నూతన యజ్ఞోపవీతాలు ధరించి వేదాధ్యయనం ప్రారంభిస్తారు. పూర్వం వేదాధ్యయనాన్ని ప్రారంభ దినంగా శ్రావణ పూర్ణిమను పరిగణించేవారు. వేద విద్యార్థులు, అధ్యాపకులు, గృహస్థులు నిత్య కర్మలు ముగించుకుని గాయత్రీ జపాలు చేస్తారు. ఈ రోజున తప్పనిసరిగా నూతన యజ్ఞోపవీతాలను ధరించాలి. జంధ్యాల పౌర్ణమిగా శ్రావణ పూర్ణిమ అలా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున మంత్రదష్టలైన సప్తఋషులను పూజించాలి. జంధ్యంలోని బ్రహ్మముడులను అరచేతిలో ఉంచుకుని గాయత్రీ జపం చేస్తే సకల శుభాలు చేకూరుతాయి. ఉపాకర్మలోని విశేషం ఇది.


ఇంతటి మహిమాన్వితమైన యజ్ఞోపవీతాన్ని మొట్టమొదటగా బ్రహ్మ తయారుచేశాడంటారు. అలా బ్రహ్మ తయారు చేసిన జంధ్యాన్ని శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టాడని, లయకారుకుడు సకల శుభకరుడైన రుద్రుడు ముడివేశాడని అంటారు. ఆ తర్వాత సకల సౌభాగ్యదాయిని, సకల జ్ఞానరాశి అయిన సావిత్రీదేవి అభిమంత్రించింది. దానివల్లనే ఈ యజ్ఞోపవీతానికి అంతటి పవిత్రత చేకూరింది.


యజ్ఞోపవీతాన్ని ధరించడానికి ముందు ఆచమనం, సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత యజ్ఞోపవీతాన్ని పూజించాలి. ఆ తర్వాత రెండు చేతుల యొక్క బొటనవ్రేళ్లతోనూ, యజ్ఞోపవీతాన్ని చేసుకుని 'యజ్ఞోపవీతం పరమం పవిత్రం' అనే శ్లోకాన్ని పఠించి, మొదటి కుడిచేయి ఉంచి ముడి ముందుగా వచ్చునట్లుగా ధరించాలి.


నూతన యజ్ఞోపవీతాన్ని ధరించిన తర్వాత పాత యజ్ఞోపవీతాన్ని క్రిందకు వదలాలి మొదట కుడికాలు తీసి చివరగా ఎడమ కాలు నుండి తీసి వేయాలి. అశౌచాలవలన, ఆప్తుల జనన, మరణ సమయంలో, గ్రహణం పట్టి వదిలిన తర్వాత ఇతర అమంగళాలు కల్గిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. ఉపాకర్మ సందేశం ఉపాకర్మ సామూహికంగా ఆచరించే కర్మ. అన్ని రోజులలో ఎవరి కార్యక్రమాలలో హడావుడిగా వుంటారు. ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అందరూ ఒకచోట చేరి సామూహికంగా పూజాదులు నిర్వహించడంవల్ల సమిష్టితత్వం పెరుగుతుంది. నదీతీరాలలో ఆచరించే స్నానాదులవల్ల నదులను శుభ్రంగా ఉంచుకోవాలనే ఆలోచన పెంపొందుతుంది. శారీరక , మానసిక పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమ్ దివ్యౌషధమని పెద్దలు చెబుతారు.