ఆగష్టు 15 వేడుకలపై హైకోర్టు మార్గదర్శకాలు జారీ


హైదరాబాద్ : న్యాయ స్థానాల్లో ఆగష్టు 15 వేడుకలపై మార్గదర్శకాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, ప్రభుత్వ ఉద్యోగులు, వైద్యులు, పోలీసులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. రోజు రోజుకీ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంటోంది. దీంతో స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనే వారికి 50 మందికి మించరాదని స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. అలాగే 20 నిమిషాల్లో వేడుకను పూర్తి చేయాలని వెల్లడించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించవద్దని హైకోర్టు పేర్కొంది. న్యాయ స్థానాల్లో నిర్వహించే ఆగష్టు 15 వేడుకల్లో ఖచ్చితంగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజ్ రాసుకోవాలని ఇతర కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించింది టీఎస్ హైకోర్టు.