భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఎప్పటికి వస్తుందో తేల్చి చెప్పేశారు....!


2021లోపు కరోనా వ్యాక్సిన్ సాధ్యం కాదని తేల్చి చెప్పిన ప్రభుత్వ టాప్ సైంటిస్ట్స్ 


న్యూఢిల్లీ: భారత్ లో కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి  కేంద్ర ప్రభుత్వ శాస్ర్త, సాంకేతిక విభాగ శాస్త్రవేత్తలు కీలక విషయాన్ని వెల్లడించారు. 2021 లోపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం సాధ్యం కాదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. శుక్రవారం పార్లమెంటులో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు.


కరోనా వ్యాక్సిన్ రేసులో భారత్ లోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుంటాయని ప్యానెల్ లోని ఎంపీలు అభిప్రాయపడ్డారు.


ప్రపంచంలోని దాదాపు 60 శాతం వ్యాక్సిన్ లు మనదేశంలో తయారైనవేనని చెప్పారు. ఇదిలా ఉంటే.....భారత్ లో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ సోమవారం నుంచి మొదలుకానున్నాయి.


అయితే... సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ గత వారమే క్లినికల్ ట్రయల్స్ విషయంలో స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రపంచంలో మొత్తం 140 కరోనా వ్యాక్సిన్లలో 11 వ్యాక్సిన్లు గత వారం నుంచే క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు తెలిపింది. అయితే...ఇవేవీ ప్రజలకు 2021 లోపు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని తెలిపింది.


పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలోని కొందరు సభ్యులు యోగా గురు రామ్ దేవ్ పతంజలి ఆయుర్వేద కరోనిల్ కిట్ ఎంతవరకూ పనిచేస్తుందని శాస్త్రవేత్తలను అడగ్గా...కరోనిల్ కిట్ గురించి శాస్త్రీయ సమాజం నుంచి ఎలాంటి స్పందన లేదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.