ఇవాళ భారత్ శక్తి సామర్ధ్యాలు అజేయం: మోదీ


లద్దాఖ్: సరిహద్దుల్లో మీరు ఉండబట్టే దేశం మొత్తం నిశ్చితంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ జవాన్లనుద్దేశించి  అన్నారు. ప్రపంచం మొత్తానికి భారత్ శక్తి సామర్ధ్యాలు నిరూపించామని కొనియాడారు. లద్దాఖ్ లో మోదీ ఈరోజు ఆకస్మికంగా పర్యటించారు. అక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం సైనికులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గల్వాన్ ఘటనలో అమరులైన సైనికులకు మోదీ మరోసారి నివాళులర్పించారు. 


'అమారులైన సైనిక వీరులకు మరోసారి నివాళులర్పిస్తున్నాను. ఇవాళ దేశ ప్రజలందరి ఆశీస్సులు మీతో ఉన్నాయి. మీ శౌర్య పరాక్రమాల గురించి దేశంలో ఇంటింటా మాట్లాడుకుంటున్నారు. ఈ భూమి 130 కోట్ల మంది భారతీయులకు ప్రతీక.


విచ్ఛిన్న శక్తుల కుట్రలను లద్దాఖ్ స్థానిక ప్రజలు తిప్పికొట్టారు. 14 కార్ప్స్ సైనికుల పరాక్రమం గురించి దేశం నలుమూలలా మాట్లాడుకున్నారు. మీ సాహస గాథలు దేశంలోని ప్రతి ఇంటిని చేరాయి. శత్రువులకు మీ పరాక్రమ జ్వాల ఏంటో చూపించారు' అని ప్రధాని సైనికుల ధైర్య సాహసాల్ని కొనియాడారు.


'ఈ భూమి వీర భూమి. వీరులను కన్న భూమి. మన సంకల్పం హిమాలయాల కన్నా ఎత్తయినది. వేల సంవత్సరాల నుంచి ఎన్నో దాడులను మనం తిప్పికొట్టం. ఇవాళ భారత్ శక్తి సామర్ధ్యాలు అజేయం. జల, వాయు, పదాతి, అంతరిక్షం విభాగాల్లో మన శక్తి సమున్నతం. వీరత్వం ద్వారానే శాంతి లభిస్తుంది. బలహీనులు ఎప్పటికి శాంతిని సాదించలేరు. అనేక సంక్లిష్ట, సంక్షోభ సమయాల్లో  ప్రపంచం వెంట భారత్ నడిచింది. ప్రపంచ యుద్ధాల్లోనైనా, ప్రపంచంలో శాంతి నెలకొల్పడంలోనైనా అంతర్జాతీయ సమాజం భారతీయల ధైర్యసాహసాల్ని చూసింది. మనం వేణువు ఊదే కృష్ణుడిని పూజిస్తాం. అలాగే సుదర్శన చక్రంతో పోరాడే కృష్ణుడిని ఆరాధిస్తాం. సామ్రాజ్యవాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి పథాన సాగాల్సిన సమయం. ఇంతకాలం విస్తరణకాంక్షతో సాగిన శక్తులు తోకముడవడమో లేక ఓటమో చవిచూశాయి. దీనికి చరిత్రే సాక్షం' అని మోదీ వివరించారు.