పండ్లు, కూరగాయల శుభ్రతకు సూచనలు


కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఆ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు పలు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ ఎలా.? ఎప్పుడు.? వ్యాప్తి చెందుతుందో ఎవరికీ అంతుచిక్కట్లేదు. ఈ తరుణంలో మనం రోజూ ఉపయోగించే పండ్లు, కూరగాయల ద్వారా కరోనా సోకుతుందని అనుమానాలు కలిగితే వాటిని ఎలా శుభ్రపరుచుకోవాలి.? ఎలా భద్రపరుచుకోవాలి.? అనే విషయాలపై వైద్యులు పలు సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.


పండ్లు, కూరగాయలను కొనేముందు, కొన్న తర్వాత మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.


మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ప్యాకెట్‌లోనే విడిగా ఉంచాలి.


ఆ తర్వాత మనం కొన్న కూరగాయలు, పండ్లను కొంచెం పసుపు, ఉప్పు కలిపిన నీళ్లలో వేసి 20 నిముషాలు ఉంచాలి.


వాటిని శుభ్రమైన తాగునీటితోనే కడగాలి.


తాజా పండ్లు, కూరగాయలపై క్రిమిసంహారక మందులు, లేదా సబ్బు వంటి వాటిని అసలు వాడకూడదు.


వంటకు కావాల్సిన కూరగాయలు, పండ్లను పక్కకు పెట్టి.. మిగిలిన వాటిని వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టాలి.


మాంసం, పండ్లు, కూరగాయలను ఫ్రిడ్జ్ లో వేర్వేరుగా ఉంచాలి.


పండ్లు, కూరగాయలను కట్ చేసేముందు, తర్వాత కత్తిని, కట్టింగ్ బోర్డును సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.


అలాగే FSSAI కూడా ఆహార భద్రత విషయంలో పలు సూచనలు ఇచ్చింది.


ఇంటి బయట గానీ, కారులో, గ్యారేజ్ లో గానీ ఆహారాన్ని నిల్వ చేయడం, ఉంచడం అసలు మంచిది కాదు.


ఆహార పదార్థాలను కడిగిన సింక్ ను వెంటనే శుభ్రం చేయాలి.


ఆహార ప్యాకేజీల విషయంలో, వాటిని ఆల్కహాల్ ఆధారిత ద్రావణం లేదా సబ్బు, శుభ్రమైన నీటితో శుభ్రపరచాలి.