తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి శాంతకుమారి సమావేశమయ్యారు.రాష్ట్రంలో ఉన్న కరోనా పరిస్థితులు, కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పరీక్షలు, ప్రయివేటు ఆస్పత్రుల అధిక బిల్లులు, ప్రభుత్వ వైద్యం అందుతున్న తీరు, జీహెచ్ఎంసీలో అత్యధిక కేసులు నమోదు వంటి అంశాలపై సీఎస్, హెల్త్ సెక్రెటరీ తో గవర్నర్ చర్చించినట్లు సమాచారం. దీనిపై వారు గవర్నర్ కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి సోమవారమే రాజభవన్ కు రావాలని సీఎస్, ఆరోగ్య శాఖ కార్యదర్శి కి గవర్నర్ తమిళిసై వర్తమానం పంపారు. ఐతే సీఎం కేసీఆర్ తో భేటీ నేపథ్యంలో గవర్నర్ తో సమావేశాన్ని వారు వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం సాయంత్రం రాజభవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. అంతకుముందు ఉదయం ప్రయివేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా టెస్టులు, రోగులకు అందుతున్న చికిత్స, ఫీజుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.