తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న తరుణంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించాలని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రాజ్ భవన్ కు రావాలని చీఫ్ సెక్రటరీకి, హెల్త్ సెక్రటరీకి రాజ్ భవన్ నుండి సమాచారం పంపించారు. అయితే తాము ఈరోజు రాలేమని అధికారులు తిరిగి జవాబు పంపించారు.
ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల ఈరోజు సమావేశానికి రాలేమని నేడు గవర్నర్ పిలుపును నిరాకరించారు తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ, హెల్త్ సెక్రెటరీలు. ఇక వారు రాలేమని చెప్పడంతో మంగళవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించాలని గవర్నర్ తమిళి సై భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్న గవర్నర్ తమిళి సై, కరోనా నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె అధికారులతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితిని, తీసుకుంటున్న చర్యలను, పరీక్షల విధానాన్ని, బాధితులకు ఆస్పత్రిలో అందిస్తున్న వసతులను గురించి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
రాష్ట్రంలో చూస్తే మొత్తం కేసుల సంఖ్య 23,902 కు చేరింది. నిన్న మాత్రం కాస్త కేసుల సంఖ్య తగ్గి 1590 కేసులే వచ్చాయి. అత్యధికంగా గ్రేటర్ లో 1277 మంది కరోనా వైరస్ పడ్డారు. మేడ్చల్ లో 125, రంగారెడ్డిలో 82, సూర్యాపేటలో 23, నల్గొండ లో 14, మహబూబ్ నగర్, సంగారెడ్డి జిల్లాలో 19 కేసుల చొప్పున నమోదు అయ్యాయి. దేశంలో కేసుల సంఖ్యలో తెలంగాణ ఆరో స్థానానికి చేరింది. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ కంట్రోల్ కోసం తమిళిసై సమీక్ష నిర్వహించనున్నారు.