రాహుల్ చెప్పిన 3 ప్రభుత్వ వైఫల్యాలివే!


వైఫల్యాలపై హార్వెర్డ్ బిజినెస్ స్కూల్ కు ఇవే కేస్ స్టడీలంటూ ఎద్దేవా


దిల్లీ: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం పై మరోసారి విరుచుకుపడ్డారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలును విఫల ప్రయోగాలుగా అభివర్ణించిన ఆయన తాజాగా కోవిడ్-19 నియంత్రణలోనూ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భవిష్యత్తులో వైఫల్యాలపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చేపట్టబోయే అధ్యయనాల్లో ఇవి ఉండనున్నాయంటూ ఎద్దేవా చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసుల క్రమాన్ని గ్రాఫ్ రూపంలో చూపుతూ...ప్రపంచంలో మూడో స్థానానికి చేరిన విషయాన్ని తెలియజేస్తున్న ఓ వీడియోను ట్విట్టర్ లో ఉంచారు.


కరోనా కట్టడి పై గతంలో మోదీ మాట్లాడిన వ్యాఖ్యలు తెరవెనుక నడుస్తుండగా....కేసుల సంఖ్యకు సంబంధించిన గ్రాఫ్ పెరుగుతున్న క్రమాన్ని ఆ వీడియోలో గమనించవచ్చు.


కరోనా వైరస్ నియంత్రణ విషయంలో మోదీ ప్రభుత్వం పై తొలి నుంచి కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ వివిధ రంగాలకు చెందిన మేధావులతో చర్చలు జరిపారు. మోదీ ప్రభుత్వం అధికారాన్ని కేంద్రీకృతం చేయడం వల్లే వైరస్ ను సమర్ధంగా కట్టడి చేయలేకపోయామని ఆరోపించారు. లాక్ డౌన్ సమయంలో వలస కూలీల సమస్యలను రాహుల్ ప్రధానంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే.


సోమవారం నాటికి ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ మూడో స్థానానికి చేరింది. నిన్న ఒక్కరోజే భారత్ లో 24,248 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 6,97,413 కి చేరింది. కొత్తగా 425 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 19,693 గా నమోదైంది.