సరిహద్దుల భద్రతకు ఇజ్రాయెల్ డ్రోన్లు


దిల్లీ: సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్టంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. నిరంతర నిఘా పెట్టేందుకు, దాడి చేసేందుకు ఆయుధ సామగ్రిని పెంచుకుంటుంది. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి హిరాన్ నిఘా డ్రోన్లు, స్పైక్ యాంటీ ట్యాంక్ ఆధారిత క్షిపణులను దిగుమతి చేసుకోనుంది.


వైమానిక, నౌకాదళం, సైన్యం నిఘా, లక్ష్యాల కోసం ఇప్పటికే హిరాన్ మానవరహిత విహంగాలను ఉపయోగిస్తున్నాయి. 'వాయుసేన నిఘా అవసరాలు తీర్చేందుకు మరిన్ని హిరాన్ యూఏవీలు కావాలి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసాం' అని ప్రభుత్వ వర్గాలు మీడియాకు తెలిపాయి. హిరాన్ డ్రోన్లు ఏకధాటిగా రెండు రోజుల పాటు 10 కిలోమీటర్ల ఎత్తులో ఎగరగలవు.


ప్రాజెక్ట్ చీతాలో భాగంగా వాయుసేనకు సాయుధ యూఏవీలను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. బాలాకోడ్ దాడుల నేపథ్యంలో పదాతి దళం స్పైక్ యాంటీ ట్యాంకు క్షిపణులను గతేడాది భారత్ దిగుమతి చేసుకుంది. అప్పుడు 12 లాంచర్లు, 200 స్పైక్ క్షిపణులు కొనుగోలు చేసింది. ప్రస్తుతం శత్రువులను ఎదుర్కొనేందుకు మరికొన్ని కొనుగోలు చేయనున్నారు. డీఆర్ డీవో సైతం అవసరాలు తీర్చేందుకు మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్ఫైల్స్ ( ఎంపీ ఏటీజీఎం ) ను సిద్ధం చేస్తోంది.