లాక్ డౌన్ సడలింపుల్లో బాగంగా అంతర్ రాష్ట్ర రాకపోకలకు అవకాశం కల్పించిన కేంద్రం తాజాగా అంతర్జాతీయ విమానాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సమాచారం. జూలై నుంచి విదేశాలకు విమాన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉందని విమానయాన మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని కాస్తా సాధారణ పరిస్థితులు రాగానే వెంటనే అంతర్జాతీయ విమానాల రాకపోకలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నారు. కాగా రెండు నెలల పాటు దేశవ్యాప్త లాక్ డౌన్ తో నిలిచిపోయిన దేశీయ విమాన సర్వీసులను మే 25 నుంచి పునరుద్ధరించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 15 రోజుల వ్యవధిలో అత్యధిక కేసులతో ప్రస్తుతానికి దేశం 2 లక్షల మార్కును దాటేసింది. ఇటువంటి తరుణంలో ఇప్పుడు అంతర్జాతీయ విమానాలను అనుమతించటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.