నేడు ప్రపంచ రక్తదాన దినోత్సవం - రక్త దాతలకు ధర్మఘంట శుభాకాంక్షలు


ప్రపంచ రక్త దాతల దినోత్సవం


ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్‌14న నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా ధర్మఘంట రక్తదాతలందరికి అక్షర శుభాకాంక్షలు సమర్పిస్తుంది.


చరిత్ర 


1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్‌ విజేత కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించాయి.


ర‌క్త‌దానం 


రక్త దానం (Blood donation) అనేది ప్రాణ దానంతో సమానం. రోగ నివారణ గమ్యంగా పెట్టుకుని ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు. ప్రపంచంలో చాల మంది రక్తాన్ని దానం చేస్తారు.


రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలుకాదు. అయితే రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. 18 సంవత్సరాలు నుండి 55ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ‘ఓ’ గ్రూప్‌రక్తం కలిగిన వారిని విశ్వదాత అని, ‘ఏబీ’. గ్రూపుల రక్తం కలిగినవారిని విశ్వగ్రహీత అని అంటారు.


రక్తం


నెత్తురు లేదా రక్తము (ఆంగ్లం: Blood) ద్రవరూపంలో ఉన్న శరీర నిర్మాణ ధాతువు లేదా కణజాలం (tissue). జీవి మనుగడకి రక్తం అత్యవసరం; ఈ సందర్భంలో రక్తం బహుముఖ ప్రజ్ఞ, సర్వతోముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తుంది. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హిమటాలజీ' (Hematology) అంటారు. వైద్య పరిభాషలో రక్తానికి సంబంధించిన విషయాలకు సాధారణంగా హీమో లేదా హిమాటో అన్న ఉత్తరపదము ఉంటుంది. ఇది గ్రీకు భాషా పదము హైమా (రక్తం) నుండి వచ్చింది.


రక్తం - భాషా విశేషాలు 


తెలుగు భాషలో రక్తము పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] రక్తము n. అనగా Blood. నెత్తురు. Redness, ఎరుపు. adj. Bloody, red. నెత్తురుగా నుండే, ఎర్రని. రక్తము తీయు to bleed or draw blood. రక్త చందనము అనగా red sandal wood. రక్తమాల్యములు purple or red garments. రక్తవాహిక n. అనగా A blood vessel రక్త నాళములు. రక్తపము n. A blood drinker. A leech. జెలగ. రక్తపుచ్ఛిక . A green lizard with a red tail. నలికండ్ల పాము. రక్తపుడు . A blood-drinker, a vampire, a devil. రాక్షసుడు. The ghosts are described an Odyssey as drinking blood. రక్తపెంజెర or రక్తపింజర n. The boa, or rock snake. సర్పవిశేషము. రక్తమందుచెట్టు a kind of shrub. రక్తాక్షి n. The name of a Telugu year ఒక తెలుగు సంవత్సరము. రక్తిక n. A plant, Abrus precatorius, the seeds of which are used as weights. గురుగింజ లేదా గురివింద. రక్తిమ or రక్తిమము n. Crimson, blood colour. రక్తవర్ణము. రక్తోత్పలము . The red lotus. కెందమ్మి, ఎర్ర తామర పుష్పము.


రక్తపు రంగు (Nethuru)


రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి ఎరుపు రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది రక్తంలో ఉన్న రక్తచందురం అనే ప్రాణ్యం (protein). ఈ రక్తచందురాన్నే ఇంగ్లీషులో హిమోగ్లోబిన్‌ (hemoglobin) అంటారు. 'రక్తం ఆకుపచ్చ రంగులో ఎందుకు ఉండకూడదు, ఎర్రగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి సమాధానం ఉందో లేదో తెలియదు కాని వృక్ష సామ్రాజ్యానికి (plant kingdom) ఆకుపచ్చరంగు ఉన్న పత్రహరితం (chlorophyll) ఒక వ్యాపారచిహ్నంలా (trademark) ఎలా చలామణీ అవుతోందో అదే విధంగా జంతు సామ్రాజ్యంలో (animal kingdom) ఎర్ర రంగు ఉన్న రక్తచందురం చలామణీ అవుతోంది. కనుక 'పత్రహరితం ఆకుపచ్చగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి, 'రక్త చందురం ఎర్రగానే ఎందుకు ఉండాలి?' అన్న ప్రశ్నకి సమాధానాలు ఒక్క చోటే దొరకవచ్చు.


రక్తానికి మూలాధారం నీరు 


రక్తంలో దరిదాపు 80% నీరే. రక్తం నెరవేర్చే గురుతర బాధ్యతలన్నిటిని నీరు నిర్వర్తించినంత బాగా మరే ఇతర ద్రవ పదార్ధమూ నిర్వర్తించలేదు. అందుకనే రక్తం తయారీకి నీరు ముఖ్యమయిన ముడి పదార్థం. ఉదాహరణకి మనకి సర్వసాధారణంగా ఎదురయే ద్రవ పదార్ధాలన్నిటిలోకీ నీటి యొక్క విశిష్ట తాపం (specific heat) ఎక్కువ. అంటే నీటిని వేడి చెయ్యటానికి ఎక్కువ సేపు పడుతుంది; చల్లార్చటానికీ ఎక్కువ సేపు పడుతుంది. (కుంపటి వేడెక్కినంత త్వరగా గిన్నెలో నీరు వేడి ఎక్కక పోవటానికి నీటి యొక్క విశిష్ట తాపం ఎక్కువగా ఉండటమే కారణం.) అంటే నీరు నిలకడ మీద వేడెక్కుతుంది, నిలకడ మీద చల్లారుతుంది. కనుక శరీరంలోని జీవన ప్రక్రియల వల్ల పుట్టిన వేడిని రక్తంలోని నీరు పీల్చుకున్నప్పుడు నీరు గభీమని సలసల మరిగిపోదు. అలాగే చెమట పట్టి శరీరం చల్లబడ్డప్పుడు రకం మంచుముక్కలా చల్లబడి పోదు. ఈ రకపు నిదానపు గుణం - ఉదాహరణకి - ఆల్కహాలుకి లేదు, నీటికే ఉంది. అందుకని రక్తానికి నీరు మూలాధారం.


రక్తానికి ప్రాణం రక్తచందురం == సగటున 70 కిలోలు తూగే మగవాడి శరీరంలో సుమారు ఐదున్నర లీటర్ల రక్తం ఉంటే, సగటున 50 కిలోలు తూగే ఆడవారి శరీరంలో మూడున్నర లీటర్ల రక్తం ఉంటుంది. కనుక సగటు మగవాడి శరీరం లోని అయిదున్నర లీటర్ల రక్తంలో సుమారు నాలుగుంపావు లీటర్లు నీళ్ళే. ఈ నీరు 37 డిగ్రీల శరీర ఉష్ణోగ్రత దగ్గర ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత దగ్గర ఉన్న ఒక లీటరు నీటిలో సుమారు 7 మిల్లీగ్రాముల ఆమ్లజని కరుగుతుంది. ఈ 7 ని నాలుగుంపావు చేత గుణిస్తే ఊరమరగా 30 మిల్లీగ్రాములు వస్తుంది. కనుక మనం పీల్చే గాలిలోని ఆమ్లజని సుమారు 30 మిల్లీగ్రాముల ప్రాప్తికి శరీరంలోని రక్తంలో కరుగుతుంది. కాని ఒక సగటు మనిషికి, పరిశ్రమ లేకుండా కదలకుండా కూర్చున్న మనిషికి, బతకటానికి సెకండు ఒక్కంటికి ఆరున్నర మిల్లీగ్రాముల ఆమ్లజని సరఫరా ఉండాలి; లేక పోతే ఆ శాల్తీ బతకదు. ఈ లెక్కని శరీరంలోని రక్తంలోని నీటిలో కరిగి ఉన్న ఆమ్లజని నాలుగున్నర సెకండ్లలో ఖర్చు అయిపోతుంది. కాని మనం ముక్కు మూసుకుని, గాలి పీల్చకుండా నాలుగున్నర సెకండ్ల కంటే ఎక్కువ కాలమే బతకగలం. నీటిలో బుడక పెట్టి ఒక నిమిషం ఉండటం కష్టం కాదు. అనుభవం ఉన్న వాళ్ళు రెండు నిమిషాలు కూడా ఉండగలరు. వీరికి ఆమ్లజని సరఫరా ఎక్కడ నుండి వస్తున్నట్లు? ఈ ప్రశ్నకి సమాధానంగా ప్రయోగం చేసి ఒక విషయం నిర్ధారణ చెయ్యవచ్చు. నిజానికి లీటరు రక్తంలో 285 మిల్లీగ్రాముల ఆమ్లజని కరిగి ఉంటుంది. లీటరు నీటిలో 7 మిల్లీగ్రాములే కరిగి ఉన్నప్పుడు, ఈ మిగతా ఆమ్లజని ఎక్కడ దాగున్నట్లు? ఈ మిగతా ఆమ్లజని రక్తచందురంలో దాగి ఉంటుంది. మరొక విధంగా చెప్పాలంటే, ప్రతి రక్తందురం బణువు తనలో నాలుగు ఆమ్లజని అణువులని ఇముడ్చుకుని ఊపిరితిత్తుల నుండి శరీరం నలుమూలలకీ తీసికెళ్ళ ఉంది.


రక్తంలో ఉండే వివిధ పదార్ధాలు


రక్తాన్ని పరీక్ష నాళికలో పోసి నిలడితే కొద్ది సేపటిలో రక్తం మూడు స్తరాలు (layers) గా విడిపోతుంది. ఈ మూడింటిలో ఎక్కవ మందం ఉన్న స్తరం, ఎండుగడ్డి రంగులో, పారదర్శకంగా, పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని తెలుగులో రసి అనిన్నీ ఇంగ్లీషులో ప్లాస్మా (plasma) అనిన్నీ అంటారు. దీని దిగువన, అతి తక్కువ మందంతో తెల్లటి స్తరం ఒకటి కనిపిస్తుంది. ఇవే తెల్ల రక్త కణాలు (white blood cells), లేదా సూక్ష్మంగా తెల్ల కణాలు (white cells or leukocytes). నాళికలో అట్టడుగున దరిదాపు రసి స్తరం ఉన్నంత మందం గానూ ఎర్రటి స్తరం మరొకటి కనిపిస్తుంది. ఇవి ఎర్ర రక్త కణాలు (red blood cells), లేదా సూక్ష్మంగా ఎర్ర కణాలు (red cells or erythrocytes). ఉరమరగా రసి స్తరం 55 శాతం ఉంటే ఎర్ర కణాల స్తరం 45 శాతం.


ఎర్ర రక్త కణాలు (ఎరిత్రోసైట్లు) : ఎర్ర రక్త కణాలలో హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ పదార్థం ఉండడం వలన అవి ఎర్రగా ఉంటాయి. ఇవి గుండ్రంగా, ద్విపుటాకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 450 నుండి 500 కోట్ల ఎర్ర రక్త కణాలుంటాయి. ఈ కణాలు ఎముకల మధ్య ఉన్న మజ్జలో ఉత్పత్తి అవుతాయి. ఇలా ఉత్పత్తి అయ్యే విధానాన్ని ఎరిత్రోపాయిసిస అంటారు. ఎర్ర రక్త కణాలు సుమారు 120 రోజులు జీవిస్తాయి. ఇవి ఆక్సిజన్ రవాణాకు తోడ్పడతాయి. వీటి జీవితకాలం తరువాత ఇవి ప్లీహంలో, కాలేయంలో విచ్ఛిన్నమవుతాయి.


తెల్ల రక్తకణాలు (ల్యూకోసైట్లు) : వీటిలో హిమోగ్లోబిన్ ఉండదు. ఇవి అమీబా వంటి ఆకారంలో ఉంటాయి. ఒక మి.లీ. రక్తంలో 50 నుండి 90 లక్షల రక్త కణాలుంటాయి. ఇవి లింపు కణుపులలోను, ప్లీహంలోను ఉత్పత్తి అవుతాయి. ఇని ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ల్యూకోపాయిసిస్ అంటారు. ఇవి సుమారు 12-13 రోజులు జీవిస్తాయి. వ్యాధులనుండి సంరక్షించడం తెల్ల రక్తకణాల పని. వీటి జీవితకాలం తరువాత తెల్లరక్తకణాలు కాలేయంలోను, లింపు ద్రవంలోను విచ్ఛిన్నమవుతాయి.


రక్తంలో రసి చాల ముఖ్యమైనది. పోషణకి కావలసిన విటమినులు, ఖనిజాలు, చక్కెరలు, ప్రాణ్యములు, కొవ్వులు, మొదలయిన వాటి రవాణాకి ఒక రహదారి కల్పిస్తుందీ రసి. ఈ రసిలో - కొన్ని చిల్లర మల్లర సరుకులు మినహా - తేలియాడే పదార్ధాలలో మూడు ముఖ్యమైన ప్రాణ్యాలు ఉంటాయి. వీటిని ఇంగ్లీషులో ఆల్బ్యుమిన్‌ (albumin), గ్లాబ్యులిన్ (globulin), ఫైబ్రినోజెన్‌ (fibrinogen) అని అంటారు. ఆల్బ్యుమిన్‌ని తెలుగులో 'శ్వేతధాతువు' అంటారు. గ్లాబ్యులిన్‌కి ప్రస్తుతానికి తెలుగు పేరు లేదు కాని ఇది మూడు రకాలు: ఆల్ఫా, బీటా, గామా. నీటిని పుట్టించేది ఉదజని (hydrogen), ఆమ్లాన్ని పుట్టించేది ఆమ్లజని (oxygen) అయినట్లే ఫైబర్‌ని పుట్టించేది ఫైబ్రినోజెన్‌. ఫైబర్‌ అంటే నార, పీచు, తాంతవం అని తెలుగు మాటలు ఉన్నాయి. కనుక నార వంటి పదార్ధాన్ని పుట్టించే ఫైబ్రినోజెన్‌ని తెలుగులో 'తాంతవజని' అనొచ్చు. దెబ్బ తగిలి రక్తం స్రవిస్తూన్నప్పుడు, రక్తానికి గాలి సోక గానే ఈ తాంతవజని రక్తం లోంచి బయటకి పుట్టుకొచ్చి, సాలెపట్టులా దెబ్బ చుట్టూ అల్లి పక్కు కట్టేలా చేస్తుంది. మనం ఆహారంతో తినే పిప్పి పదార్ధాలు ఇవి కావు; అవి మరొకటి.


రక్తం చేసే పనులు 


ఎర్ర కణాలలో ఉండే రక్తచందురంతో కణజాలాలకు ప్రాణవాయువును సరఫరా చెయ్యటం.


గ్లూకోజు, ఎమైనో ఆమ్లాలు, ఫాటీ ఆసిడ్ ల వంటి పోషకాలను సరఫరా చెయ్యటం.


కార్బన్ డై ఆక్సైడ్, యూరియా, లాక్టిక్ ఆమ్లంల వంటి వ్యర్థ పదార్థాలను నిర్మూలించటం.


వ్యాధి నిరోధక విధులు, తెల్ల కణాల సరఫరా, ఆంటీబాడీ లతో కొత్త క్రిములను, రోగకారకాలను నిరోధించటం.


దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే అది గడ్డ కట్టేలా చూడటం.


హార్మోన్ల సరఫరాకి వాహకిగా పని చెయ్యటం.


దెబ్బతిన్న కణజాలాల సమాచారాన్ని మెదడుకు చేరవేయటం.


శరీరంలో ఆమ్ల-క్షార తుల్యతని (pH విలువని) నియంత్రించటం.


శరీర ఉష్ణోగ్రతను నియంత్రించటం.


హైడ్రాలిక్ (పంపింగ్) విధులు నిర్వర్తించటం.


రక్తంలో వర్గాలు 


 రక్త వర్గం


ABO రక్త వర్గాలు


1902లో కార్ల్ లేండ్‌స్టయినర్ అనే ఆస్ట్రియా దేశస్తుడు స్థూల దృష్టితో చూడటానికి అందరి రక్తం ఒకేలా ఉన్నా సూక్ష్మ లక్షణాలలో తేడాలు గమనించేడు. కొన్ని ఎర్ర కణాల ఉపరితం మీద చక్కెర పలుకుల వంటి పదార్ధాలు అంటిపెట్టుకుని ఉండటం గమనించేడీయన. మంచి పేరు తట్టక వీటికి A, B రకాలు అని పేర్లు పెట్టేడు. ఈ పరిశోధన సారాంశం ఏమిటంటే కొందరి ఎర్ర కణాల మీద ఎ-రకం చక్కెర పలుకులు ఉంటే, కొందరి ఎర్ర కణాల మీద బి-రకం చక్కెర పలుకులు ఉంటాయి. కొందరి కణాల మీద రెండు రకాల పలుకులూ (ఎబి) ఉంటాయి. కొందరి కణాల మీద ఏ రకం చక్కెర పలుకులూ ఉండవు (ఓ). దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయన రక్తాన్ని నాలుగు వర్గాలుగా విడగొట్టేడు: ఎ, బి, ఎబి, ఓ. ఇలా రక్తాన్ని వర్గాలుగా విడగొట్టవలసిన అవసరం ఏమిటంటే ఒక వర్గపు రక్తం మరొక వర్గపు రక్తంతో కలిస్తే ఆ రక్తం పాలు విరిగినట్లు విరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం అర్ధం చేసుకోకుండా రక్త దానం చేస్తే - అంటే ఒక వ్యక్తి రక్తం మరొకరికి ఎక్కిస్తే - ప్రమాదం.


ఒక వర్గం వారు అదే వర్గానికి చెందిన ఇతరులకి రక్తం దానం చెయ్యవచ్చు.


ఓ (O) వర్గపు వారి రక్తం ఎవ్వరికైనా ఎక్కించవచ్చు. కనుక ఓ రక్తం ఉన్న వారు సార్వజనిక దాతలు (universal donors).


ఎ (A) వర్గం వారి రక్తాన్ని ఎ వర్గం వారికిగాని ఎబి వర్గం వారికి కాని దానం చెయ్య గలరు.


బి (B) వర్గం వారి రక్తాన్ని బి వర్గం వారికిగాని ఎబి వర్గం వారికి కాని దానం చెయ్య గలరు.


ఎబి (AB) వర్గం వారు తమ రక్తాన్ని తమ వర్గం వారికి తప్ప ఇతర వర్గాల వారికి ఎవ్వరికీ దానం చెయ్య కూడదు, కాని ఎవ్వరిచ్చినా పుచ్చుకోవచ్చు. వీరు సార్వజనిక గ్రహీతలు (universal receivers).


ఒక వ్యక్తి ఏ వర్గపు రక్తంతో పుట్టేదీ నిర్ణయించే జన్యువు (gene) ఆ వ్యక్తి యొక్క 9వ వారసవాహిక (chromosome) లో ఉంటుంది.


Rh కారణాంశాలు


కార్ల్ లేండ్‌స్టయినర్, లెవీస్, తదితరులు 1940లో రక్తంలో మరొక వర్గాన్ని కనుక్కున్నారు. దీనిని మొదట రీసస్ కోతులలోను తరువాత మానవులలోను కనుక్కోవడం జరిగింది కనుక రీసస్‌ కోతుల గౌరవార్ధం దీనికి Rh-కారణాంశం (Rh-factor) అని పేరు పెట్టేరు. ఈ కారణాంశం కలిగిఉన్న వారిని 'Rh+' అని లేని వారిని 'Rh-' అని అంటారు. మానవులలో ఎక్కువ శాతం మంది 'Rh+' వారున్నారు. ఇప్పుడు 'Rh+' జాతి మగాడు 'Rh-' జాతి ఆడదానిని పెళ్ళి చేసుకుంటే వారికి పుట్టబోయే సంతానం 'Rh+' అయినా కావచ్చు, 'Rh-' అయినా కావచ్చు. ఈ గర్భస్థ శిశువు 'Rh+' అయిన పక్షంలో తల్లి రక్తం ఒక వర్గం, పిల్ల రక్తం మరొక వర్గం అవుతుంది. పిల్ల రక్తంలోని 'Rh+' కారణాంశాలు తల్లి రక్తంలో ప్రవేశించగానే వాటిని పరాయి కణాలుగా గుర్తించి తల్లి శరీరం యుద్ధానికి సన్నద్ధమవుతుంది. ఈ యుద్ధం వల్ల మొదటి కాన్పులో తల్లికి, పిల్లకి కూడా ఏమీ ప్రమాదం ఉండదు. కాని రెండవ కాన్పులో తల్లి గర్భంలో మళ్ళా ఉన్న శిశువు, మళ్ళా 'Rh+' అయిన పక్షంలో ఆ పిల్ల బతకదు. అందుకని పెళ్ళికి ముందే ఆడ, మగ రక్త పరీక్ష చేయించుకుని జన్యుపరంగా ఎవరెవరి వైఖరి (genetic profile) ఎలా ఉందో తెలుసుకోవటం ఉభయత్రా శ్రేయస్కరం.


కృత్రిమ రక్తం 


ఎడిన్‌బరో, బ్రిస్టల్‌ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎముకమజ్జ నుంచి గ్రహించిన మూలకణాల నుంచి ఎర్ర రక్తకణాలను సృష్టించారు.దీంతో గుండెమార్పిడి, బైపాస్‌, క్యాన్సర్‌ బాధితులకు ఆపరేషన్‌ చేసే సమయంలో తగినంత రక్తం అందుబాటులో ఉండటం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడే వీలుంది. మూలకణాల నుంచి సృష్టించిన ఈ కృత్రిమరక్తంతో ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల బెడద ఉండదు. పైగా దీన్ని దాదాపు అన్ని రక్తం గ్రూపుల వారికి ఎక్కించొచ్చు కూడా. తొలిదశలోని పిండం నుంచి సేకరించిన మూలకణాలతో ఎర్రకణాలను పెద్దసంఖ్యలో సృష్టిస్తే అప్పుడది నిజం రక్తంలాగానే ఉంటుంది..ఒక్క పిండం నుంచే లక్షలాది మందికి సరిపడిన ఎర్రకణాలను సృష్టించొచ్చు. 


రక్త ప్రవాహం 


శరీరంలో ఏభాగానికైనా గాయమైనప్పుడు రక్తం వస్తుంది. అయితే కొంచెం సేపటికే రక్తం గడ్డకట్టి, రక్తం స్రవించడం ఆగిపోతుంది. రక్తంలో ద్రవపదార్థంలాంటి ప్లాస్మా కాకుండా ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్‌లేట్స్ అనే మూడు రకాల కణాలు కూడా ఉంటాయి. రక్తం గడ్డకట్టడానికి ఈ ప్లేట్‌లెట్సే కారణం. గాయం తగిలినప్పుడు ప్లేట్‌లెట్స్ గాయం చుట్టూ చేరి రక్తంలోని ప్లాస్మానుంచి త్రాంబో ప్లాస్టిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తాయి. ఈ పదార్థం రక్తంలోని కాల్షియం. ప్రోత్రాండిన్‌లతో కలుస్తుంది. ఇవి ఫ్రైబ్రొనోజిన్ అని రక్తంలో ఉండే ఒక ప్రోటీన్‌తో ప్రతిక్రియ జరుపుతాయి. దాంతో ఫైబ్రెన్ దారాలు ఒక దానితో ఒకటి పెనవేసుకునిపోయి రక్తాన్ని బయటకుపోనివ్వకుండా ఒక విధమైన అడ్డుకట్టలాగ నిలుస్తాయి.


దాంతో ఫ్రైబ్రెన్ దారాలు గట్టిగా అతుక్కుపోతాయి. ఈ కణాల పై పొర చనిపోతుంది. దెబ్బతిన్న కణాల స్థానంలో కొత్త కణాలు వచ్చాక పైన ఏర్పడిన పొర ఊడిపోతుంది. ప్లేట్‌లెట్స్ నుండి సిరోటినిన్ అనే హర్మోను ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తాన్ని సంకోచింపజేస్తుంది. దాంతో రక్తప్రవాహం ఆగిపోతుంది.


వ్యాధులు 


రక్తహీనత (Anemia)


హీమోలైసిస్ (Hemolytic anemia)


ఎప్లాస్టిక్ ఎనీమియా (Aplastic anemia)


రక్తస్రావం (Hemorrhage)


హీమోఫీలియా (Hemophilia)


ల్యుకీమీయా (Leukemia)


లింఫాయిడ్ ల్యుకీమియా (Lymphoid leukemia)


మైలాయిడ్ ల్యుకీమియా (Myeloid leukemia)


త్రాంబోసైథీమియా (Thrombocythemia)


ఎసిడోసిస్ (Acidosis), ఆల్కలోసిస్ (Alkalosis)


సెప్టిసీమియా (Septicemia), టాక్సీమియా (Toxemia)


రక్తనిధి


రక్తనిధి అనగా రక్తం లేదా రక్త భాగాల యొక్క నిధి, రక్త దానం లేదా సేకరణల యొక్క ఫలితంగా సమకూర్చబడి, తరువాత రక్తమార్పిడిలో ఉపయోగించేందు కొరకు నిల్వ చేయబడి సంరక్షించబడింది. "రక్త నిధి" పదం సాధారణంగా ఆసుపత్రిలో ఒక విభాగాన్ని సూచిస్తుంది, ఇక్కడే రక్త ఉత్పత్తి యొక్క నిల్వ సంభవం, ఇక్కడ సరైన పరీక్ష చేస్తారు (రక్తమార్పిడికి సంబంధించిన ప్రతికూల సంఘటనల ప్రమాదాన్ని తగ్గించేందుకు). అయితే, ఇది కొన్నిసార్లు ఒక సేకరణ కేంద్రాన్ని సూచిస్తుంది, నిజానికి కొన్ని ఆస్పత్రులు రక్త సేకరణ నిర్వహించేందుకే.


సేకరణ, ప్రక్రియ 


యు.ఎస్.లో ప్రతి రక్త ఉత్పత్తి యొక్క సేకరణ, ప్రక్రియ కోసం నిర్దిష్ట ప్రమాణాలు సిద్ధం చేయబడ్డాయి. "పూర్తి రక్తం" (Whole blood - WB) అనగా ఒక వివరించబడిన ఉత్పత్తి కొరకు సరైన పేరు, ఒక ఆమోదించబడిన సంరక్షక జోడికతో ప్రత్యేకంగా వేరుచేయబడని సిరల రక్తం. రక్తమార్పిడి కోసం అత్యధిక రక్తం "పూర్తి రక్తం" వలె సేకరించబడుతుంది. సారూప్య దానాలు కొన్నిసార్లు మరిన్ని మార్పులు లేకుండానే మార్పిడి చేయబడతాయి, అయితే పూర్తి రక్తం సాధారణంగా దాని భాగాలలోకి వేరు (కేంద్ర పరాన్ముఖీకరణము ద్వారా) చేయబడుతుంది, పరిష్కారంలో సాధారణంగా ఉపయోగించే ఉత్పత్తి ఎర్ర రక్త కణాలు (RBC) తో ఉండేది. "పూర్తి రక్తం" (Whole blood - WB), ఎర్ర రక్త కణాల (RBC) యొక్క యూనిట్లు రెండూ 33.8 నుంచి 42.8 °F (1.0 నుంచి 6.0 °C) వద్ద ఫ్రిజ్లో వుంచాలి, గరిష్ఠంగా అనుమతించిన నిల్వ కాలాలు (షెల్ఫ్ జీవితం) వరుసగా 35, 42 రోజులు. గ్లిసరాల్ తో బఫర్ చేసికూడా RBC యూనిట్లు ఘనీభవించేలా చేయవచ్చు, కానీ ఇది ఒక ఖరీదైన, సమయమెచ్చించవలసిన ప్రక్రియ, అరుదుగా చేస్తారు. ఘనీభవించిన ఎర్ర కణాల గడువు పది సంవత్సరాల పైనే, −85 °F (−65 °C) వద్ద నిల్వ చేయాలి.


రక్త వర్గం


1900 సంవత్సరం లో కారల్ ల్యాండ్ స్టీనర్ అను శాస్త్రవేత రక్త వర్గాలను కనుగొన్నాడు. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహిత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు.రక్త వర్గాలపైన అధికంగా పరిశోధన చేసిన లాండ్ స్టీనర్ ని "ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ గా పిలుస్తారు.ఇతని జన్మదినమైన జూన్ 14 ను ప్రపంచ రక్తదాన దినోత్సవంగా జరుపుకుంటారు.


మానవుల్లో 4 రక్త వర్గాలు


రక్త వర్గం : ఎ


రక్త వర్గం : బి


రక్త వర్గం : ఎబి


రక్త వర్గం : ఓ


రక్తం లో వర్గాలు రక్త దాతలు



విశ్వధాతలు (O గ్రూప్)


రక్తవర్గంగల వ్యక్తుల్లో వారి రక్తకణాలమీద ప్రతిజనకాలు (Antigens) ఉండవు. అందుచేత గ్రహీతలలో రక్తకణాల గుచ్చకరణం ఏర్పడదు. అందుచేత 'O' గ్రూప్ రక్తం గల వ్యక్తి ఏ గ్రూప్ వానికైనా రక్తాన్ని దానం చేయవచ్చు. అందువల్ల 'O' గ్రూప్ గల వారిని విశ్వధాతలు అంటారు.


విశ్వ గ్రహీతలు (AB గ్రూప్) 


AB రక్త వర్గంగల వ్యక్తుల ప్లాస్మాలో ప్రతిరక్షకాలు (ఏంటీబాడీస్) ఉండవు. అందుచేత వీరి రక్తం, ఇతరవర్గాల రక్తంతో చర్య జరపదు.కాబట్టి AB రక్త వర్గంగల వ్యక్తులు ఇతర వర్గాల (A,B,AB,O) రక్తాన్ని గ్రహించవచ్చు. అందువల్ల వీరిని విశ్వగ్రహీతలు పిలిస్తారు.


రక్త దాతలు 


ఆరోగ్యవంతులైన వ్యక్తులు 16- 50 సంవత్సరాల మధ్య వయసున్న(స్త్రీ, పురుషులిద్దరూ) రక్తదానం చేయవచ్చు.ఒక వ్యక్తి నుండి రక్తాన్ని ధమని నుండి తీసి మరో వ్యక్తికి సిరకు ద్వారా రక్తాన్ని ఎక్కిస్తారు.రక్తదానం చేసేటప్పుడు దాతకు అంటువ్యాధులు ఉండకూడదు. వారికి హెపటైటిస్‌, ల్యుకేమియా, ఎయిడ్స్‌ మొదలైన వ్యాధులు ఉండకూడదు. ఒక వ్యక్తి 3 నెలల నుంచి 4 నెలలకోసారి రక్తదానం చేయావచ్చు.


రక్తదానం అపోహలు-వాస్తవాలు 


రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత సంభవించదు.ఎప్పటిలా ఆరోగ్యంగా ఉంటారు.


శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరు ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత యధావిధిగా అన్నిరకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు.


రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది కానీ రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్నపాటి నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన నొప్పి ఉండదు.


రక్తదానం వల్ల ఎయిడ్స్‌ సంక్రమించవచ్చు అని ఒక అపోహ ఉంది. వాస్తవానికి రక్తదానం పూర్తి శాస్ర్తీయమైన, సురక్షితమైన పద్దతులలో ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశంలేని విధంగా జరుగుతుంది.


 * ఐరన్ లోపమే ప్రధానంగా రక్తహీనతకు కారణం, ఫోలిక్ యాసిడ్ పాత్ర కూడా ఉంది


 *  ఆహారం, జీవన విధానంలో మార్పులతో రక్త హీనత సమస్యకు చెక్ 


శరీర వ్యవస్థకు జీవమైన ఆక్సీజన్ అందాలంటే అందుకు రక్తం అవసరం. అన్ని అవయవాలకు ఆయువు అయిన రక్తం ప్రాణాలను కాపాడుతుంది. ఆపదలో ఉన్న వారికి చేసే రక్తదానం ప్రణాల్ని నిలబెడుతుంది. అయితే, అవసరంలో ఉన్న వారికి రక్తం దానం చేయాలంటే అందుకు మీలో రక్త హీనత ఉండకూడదు. రక్తహీనత ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కొన్ని జీవనపరమైన మార్పులతో రక్తం సమృద్ధిగా ఉండే విధంగా చూసుకోవచ్చు.


ఐరన్ లోపం సాధారణంగా ఎక్కువమందిలో రక్త హీనతకు కారణమవుతోంది. ఆకుపచ్చని కూరగాయలు, బీట్ రూట్, చికెన్ లివర్, గుడ్డు, యాపిల్, దానిమ్మ, ఆప్రికాట్, పుచ్చకాయ, గుమ్మడి విత్తులు, ఖర్జూరాలు, బాదం, బెల్లం తదితర పదార్థాల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.


ఇక ఐరన్ తో పాటు విటమిన్ సి తీసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఐరన్ ను మన శరీరం మెరుగ్గా గ్రహించేందుకు విటమిన్ సి ఉపయోగపడుతుంది. విటమిన్ సి కోసం నిమ్మ, కమలా, బత్తాకాయలు, స్ట్రాబెర్రీ, బొప్పాయి, ద్రాక్ష, టమాటాలను తీసుకోవచ్చు.


ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ బి గ్రూపులోనిది. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడుతుంది. ఆకుపచ్చని కూరగాయలు, అరటి పండు, చికెన్ లివర్, బీట్ రూట్, గోధుమల్లో ఫోలిక్ యాసిడ్ తగినంత లభిస్తుంది.


ఇక కొన్ని ఆహార పదార్థాలు శరీరాన్ని ఐరన్ గ్రహించనీయకుండా అడ్డుపడుతుంటాయి. వాటికి దూరంగా ఉండాలి. కాఫీ, టీ, ఫిజీ డ్రింక్స్, వైన్, బీర్ కు దూరంగా ఉండాలి.


శారీరక వ్యాయామం మోస్తరు స్థాయిలో చేయడం వల్ల మన శరీరం మరింత హెమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే వ్యాయామం సమయంలో అధిక ఆక్సీజన్ అవసరం అవుతుంది. ఆ డిమాండ్ ను తీర్చేందుకు హెమోగ్లోబిన్ మరింత ఉత్పత్తి అవుతుంది.