కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు సూర్యాపేట వ్యవసాయక్షేత్రంలో పూర్తి - (సచిత్ర మాలిక)


సంతోష్‌బాబు పార్థివదేహాన్ని చితిపైకి చేర్చుతున్న ఆర్మీ అధికారులు, తండ్రి ఉపేందర్‌,



భార్య సంతోషి, కుమారుడు అనిరుధ్‌



విలపిస్తున్న సంతోష్‌ చెల్లెలు శృతి, భార్య సంతోషి



సూర్యాపేట : భారతదేశ సరిహద్దు లద్దఖ్‌ సమీపంలోని గాల్వన్‌ లోయలో సోమవారం చైనా సైనికులతో జరిగిన దాడిలో మృతిచెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌బాబు (37) అంతిమయాత్రకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు.


హిందూ సంప్రదాయ ప్రకారం పార్థివదేహానికి కార్యక్రమాలు పూర్తిచేసిన తర్వాత గురువారం ఉదయం 9.30 గంటలకు సూర్యాపేటలోని ఆయన స్వగృహం విద్యానగర్‌ నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. తండ్రి ఉపేందర్‌ కుమారుడి అంతిమయాత్ర ముందు నడిచారు. ఉపేందర్‌ను అనుసరిస్తూ బంధువులు, పలువురు ప్రముఖులు పాదయాత్రగా కేసారం వరకు తోడు వచ్చారు. సొంత వ్యవసాయ క్షేత్రం వరకు రెండు గంటలపాటు అంతిమయాత్ర సాగింది. సూర్యాపేటతోపాటు ఇరు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది ఈ యాత్రలో పాల్గొని కర్నల్‌కు కన్నీటి వీడ్కోలు పలికారు.


సైనిక లాంఛనాలతో సంతోష్‌బాబు అంతిమ సంస్కారాలను పూర్తిచేశారు. 54వ బెటాలియన్‌ బ్రిగేడియర్‌ అగర్వాల్‌, కర్నల్‌ అభినవ్‌, కర్నల్‌ జాదవ్‌, లఫె్ట్‌నెంట్‌ కర్నల్‌ శ్రీనివాసరావు, లఫె్ట్‌ కర్నల్‌ మథితోపాటు సుమారు 70 మంది సైనికులు అంత్యక్రియలకు హాజరయ్యారు. సలామీ అనంతరం గన్‌ సెల్యూట్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా సంతోష్‌బాబు మృతికి సంతాప సూచికగా మూడుసార్లు గన్‌డౌన్‌ చేశారు. అనంతరం మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత సంతోష్‌బాబు పార్థివదేహానికి తండ్రి ఉపేందర్‌, కుమారుడు అనిరుధ్‌ చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.


ప్రముఖుల హాజరు


ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్‌,ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, చిరుమర్తి లింగయ్య, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, మాజీ ఎమ్మెల్యే పద్మావతి, టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేశ్‌రెడ్డి, ఏపీ భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌, నెహ్రూ యువజనకేంద్రం జాతీయ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు మల్లు లక్ష్మి, జడ్పీ ఛైర్‌పర్సన్‌ దీపిక, పురపాలిక అధ్యక్షురాలు అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా ఉన్నారు.


నివాళి అర్పిస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మావతి దంపతులు


సంతోష్‌బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారం: మంత్రి


అంతిమయాత్రలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల, ఎమ్మెల్యే సైదిరెడ్డి


కర్నల్‌ సంతోష్‌బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారం గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. సంతోష్‌బాబు అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడలికి సంతోష్‌బాబు నామకరణం చేయనున్నట్లు ప్రకటించారు. కర్నల్‌ సంతోష్‌బాబు పిల్లల చదువులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.


కుటుంబ సభ్యులను ఓదార్చుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌కుమార్‌, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు



నాన్న.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి దేశభక్తి పాఠాలు బోధిస్తూ నా మదినిండా మాతృదేశంపై ప్రేమను నింపారు. అందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే..? దేశంకోసం పనిచేసే గొప్ప అవకాశం అందరికీ రాదుకదా. అందుకే అమ్మతో అంటుండేవాడిని 'పుట్టేటపుడు ఈ భూమి మీదకు ఏమీ పట్టుకుని రాము. తిరిగి వెళ్లేటపుడూ ఏమీ తీసుకెళ్లం. ఈ మధ్యన సాగించిన జీవన ప్రయాణానికి ఓ సార్థకత ఉండాలి' అని. అది నాకు దక్కేలా పెంచినందుకు మీకు ధన్యవాదాలు. అమ్మ.. చనుబాలతోనే నాకు దేశభక్తిని తాగించిందేమో అందుకే, నా నరనరాన దేశభక్తి తొణికిసలాడేది. మీ అందరికీ వేల కి.మీ. దూరంలో.. దేశ సరిహద్దుల్లో నేను విధులు నిర్వహించే సమయంలో అమ్మను గుర్తుచేసుకున్నా.. దేశాన్ని గుర్తుచేసుకున్నా నాకు ఒకేలా అనిపించేంది. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కడుపునే పుడతాను. సైనికుడుగానే భరతమాతకు సేవ చేస్తాను. చిన్నపుడు చదువు పేరుతో.. ఆ తర్వాత ఉద్యోగం పేరుతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ మీతో గడిపింది చాలా తక్కువ సమయం. ఇది నాలో కొంత అసంతృప్తిని మిగిల్చింది. మరో రెండు నెలల్లో హైదరాబాద్‌కు బదిలీపై వస్తే మీతో, చెల్లి కుటుంబంతో, భార్యాపిల్లలతో, బంధువులు, స్నేహితులతో ఎక్కువ సమయం గడపొచ్చు అనుకున్నా. ఇంతలోనే శత్రువు దొంగదెబ్బ రూపంలో మనల్ని దూరం చేశాడు. నేను మీకు దగ్గరగా పదేళ్ల వయసు వరకు పెరిగాను. నా కొడుకు అంతకన్నా చిన్నవయసులో ఉన్నాడు. వాడిలో నన్ను చూసుకోండి. నా కూతురును జాగ్రత్తగా చూసుకోండి. నా సతీమణికి మిగిలిన విషాదం పూడ్చలేనిది. చిన్నప్పుడు నాకు తోడుగా ఉన్నట్లు, ఇప్పుడు ఆమెకు మీతోడు, నీడ అవసరం. అన్నింటికి మించి మీరు ఈ వయసులో గుండె నిబ్బరాన్ని చూపుతున్నందుకు గర్వంగా ఉంది. మీ కడుపున నేను, చెల్లి ఇద్దరమే పేగు తెంచుకుని పుట్టొచ్ఛు ఇప్పుడు చూశారా? యావత్‌ జాతి మన కుటుంబంలా మీ వెనుక నిల్చుంది. నేను ఉద్యోగంలో ఉన్నపుడు ఎక్కడ, ఎలాంటి విధులు నిర్వర్తిస్తున్నదీ, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదీ దేశభద్రత కారణాల రీత్యా మీకు చెప్పేవాడినికాదు. ఇప్పుడు నిజం చెప్పాల్సిన సమయం వచ్చింది. మీ అందరికీ దూరంగా, మీ జ్ఞాపకాల్లో పదిలంగా ఉండే చివరి మజిలీకి వెళుతున్నా.


ఇక సెలవు... మీ


బిక్కుమళ్ల సంతోష్‌బాబు, కల్నల్


 


సంతోష్‌ బాబు కుమారుడు చిన్నవాడు కావడంతో తండ్రి ఉపేందరే తల కొరివి పెట్టారు. కుమారుడిని ఎత్తుకుని కల్నల్‌ భార్య సంతోషి చితి చుట్టూ మామ వెంట తిరగడం అందరి హృదయాలను బరువెక్కించింది. చితిపై నెయ్యి పోస్తూ భర్త చివరి చూపుకోసం ఆమె పడిన తపన కలిచివేసింది. తండ్రి ఇక లేడనే విషయం తెలియక.. ఏం జరుగుతోందో.. ఇంత జనం ఎందుకు వచ్చారో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ ఉన్న పిల్లలను చూసి జనం కన్నీరు పెట్టుకున్నారు. వీర సైనికుడి భార్యగా గొప్ప నిబ్బరం ప్రదర్శించిన సంతోషి, పార్థివ దేహం కాసరబాదకు చేరగానే భోరున విలపించారు.


కదిలించిన దృశ్యాలు