వ్యాధినిరోధకశక్తిని బలహీనపరిచే దురలవాట్లు


కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తి అనే అంశం విస్తృతంగా చర్చకు వస్తోంది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే ఏంచేయాలి? ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? జీవనశైలిలో మార్పులు ఎలాంటివి చేసుకోవాలి? అలవాట్లతో ఇలాంటి వైరస్‌ను ఎలా దూరం పెట్టొచ్చు? అనే అంశాలపై ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు. అయితే, వ్యాధి నిరోధక శక్తి అనేది ఒక్కరోజులోనో.. ఒక్క వారంలోనో వచ్చేది కాదు. దానికంటూ కొన్ని నియమాలు ఉన్నాయి.


వాటిని తూచా తప్పకుండా పాటించడం ద్వారా మన శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవచ్చని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు. ఇదే సమయంలో ఎలాంటి తప్పులు చేయడం ద్వారా మనకు మనం రోగ నిరోధక శక్తిని బలహీనపర్చుకొంటున్నామో తెలుసుకొందాం.


మన శరీరంలోకి హానికారక బ్యాక్టీరియా, వైరస్‌, ఇతర సూక్ష్మక్రిములు వచ్చినప్పుడు వాటిపై దాడి చేసి వాటిని బయటకు పంపే వ్యవస్థనే రోగనిరోధక వ్యవస్థ. ఈ వ్యవస్థలో ముఖ్యమైనవి మన శరీరంలో ఉండే 5 లీటర్ల రక్తం. అలాగే పారదర్శకంగా కనిపించే శోషరసం (లింఫ్‌). ఈ రెండు ద్రవాలు యాంటిజెన్లు శరీరంపై దాడి చేసినప్పుడు ఎదురెల్లి నిలబడి వాటి అంతుచూస్తాయి. ఇలాంటి వ్యవస్థను మన అలవాట్లు బలహీనపరుస్తాయి. ఫలితంగా బయటి హానికారక సూక్ష్మిక్రిములు శరీరంపై స్వారీ చేస్తాయి. దాంతో వివిధ వ్యాధులకు మనం గురికావాల్సి వస్తుంది. వ్యాధులకు గురవకుండా ఉండాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం.


ఒత్తిడి:


రోగ నిరోధక శక్తిని బలహీన పరిచే అంశాల్లో ముఖ్యమైనది ఒత్తిడి. దీర్ఘకాలిక ఒత్తిడికి లోనైనవారు జలుబు, ఫ్లూ వంటివి పట్టుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.


నిద్ర:


రెండో అంశం.. సరిపోయేంత నిద్రపోకపోవడం. నిద్రలేమి కారణంగా అనేక వ్యాధులు మనపై దాడి చేస్తుంటాయి. రోజులో కనీసం ఏడు గంటలపాటు నిద్రపోయేలా చూసుకోవడం చాలా అవసరం.


డీ విటమిన్‌ లోపం:


ప్రస్తుత కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నాం. మంచిదే కాని, సూర్మరశ్మి మన శరీరంపై పడకుండా ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి బలహీనపడుతుందని గుర్తుంచుకోవాలి. నిత్యం ఉదయాన్నే ఎండలో నిలుచోవడం అలవాటు చేసుకోవడం ద్వారా విటమిన్‌ డీ పొందవచ్చు.


వ్యాయామం:


నిత్యం కనీసం అర్ధగంటపాటైనా వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని కండరాలు, ఎముకలు గట్టిపడి శరీరం పూర్తిగా కంట్రోల్‌లో ఉంటుంది. నిత్యం వ్యాయామం చేసేవారిలో తెల్లరక్త కణాలు, యాంటీబాడీస్‌ వృద్ధి చెందుతాయని ఓ పరిశోధనలో తేలింది.


ఆహారపుటలవాట్లు:


మన ఉరుకుల పరుగుల జీవితంలో ఆహారానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఏది దొరికితే అది తినేయడం, కనిపించిన డ్రింక్స్‌నల్లా లోపలికి పంపేయడం చేస్తూ అనేక వ్యాధులను కొని తెచ్చుకొంటున్నాం. కృత్రిమ చక్కెరలు, జంక్‌ఫుడ్‌, నూనె వస్తువులు, ఫ్రైడ్‌ ఫుడ్స్‌ తినడం వల్ల శరీరానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా.. నష్టాలే ఎక్కువగా ఉంటాయట.


సిగరెట్లు, మద్యం:


సిగరెట్లు ఊదేయడం, మద్యం తాగడం ఈ రెండు దురలవాట్లు రోగ నిరోధక శక్తిని బలహీనపర్చడమే కాకుండా మన శరీరానికే చెడు చేకూరుస్తాయి.


ఇప్పటి నుంచైనా జీవనశైలిలో మార్పులు చేసుకొని ప్రవర్తిస్తే కరోనాలాంటి మహమ్మారులు ఎన్ని దాడిచేసినా ఎదుర్కొనేందుకు మన శరీరం సిద్ధంగా ఉంటుందని గ్రహించండి.