గల్వాన్ ఘటనపై కొనసాగిన విమర్శలు
దిల్లీ: గల్వాన్ వ్యాలీలోని భారత్ భూభాగంలోకి చైనా దళాల చొరబాటు, సైనికులపై దాడి ఘటనపై రాహుల్ గాంధీ శుక్రవారం సైతం ప్రభుత్యంపై విమర్శలు కొనసాగించారు. భారత్ భూభాగంలోకి చైనా దళాలు ప్రవేశించకపోతే ఘర్షణలు ఎలా జరిగాయని 20 మంది సైనికులతో సహా ఓ కమాండింగ్ అధికారి ఎలా మరణించారని ప్రశ్నించారు. ఘటనపై ఇప్పటికైనా నిజాలు చెప్పాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జూన్ 15న భారత్, చైనా దళాల మధ్య హింసాత్మక ఘటన జరిగినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు.
తాజాగా శుక్రవారం రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ఒక అంగుళం భారతీయ భూమిని కూడా ఎవరు ఆక్రమించలేదని కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ సరిహద్దుల్లోకి ఎవరు ప్రవేశించలేదని చెప్పారు. కానీ భారత భూమిని చైనా మూడు ప్రాంతాల్లో ఆక్రమించిందని లద్దాఖ్ నివాసితులు, సైన్యం రిటైర్డ్ జనరల్స్ పేర్కొంటున్నారు. ఉపగ్రహ చిత్రాలు అలాగే చూపించాయి అని రాహుల్ గాంధీ ఓ ప్రసంగంలో పేర్కొన్నారు. 'మా భూభాగంలోకి ఎవరు ప్రవేశించలేదు. భారత భూభాగాన్ని ఎవరు ఆక్రమించలేదు' అని అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకుడు ప్రస్తావించారు. 'ప్రధానమంత్రి గారు.... మీరు నిజాలు మాట్లాడాలి. దేశానికి వాస్తవాలు చెప్పాలి. భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని మీరంటే అది వారికి లాభం చేకూర్చినట్లు అవుతుంది. మనం కలిసి పోరాటం చేసి వారిని తరిమేయాలి. అవును..... చైనా మన భూమిని స్వాధీనం చేసుకుందని, మేము చర్య తీసుకోబోతున్నామని భయపడకుండా మీరు నిజం మాట్లాడాల్సిన అవసరం ఉంది' అని ఆయన అన్నారు.