సాయుధ దళాలకు అత్యవసర నిధులు


అమీతుమీకి సిద్ధం!


న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వివాదం తీవ్రతరమైన నేపధ్యంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా దీటుగా స్పందించేందుకు రక్షణ దళాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ అవసరాల కోసం ప్రత్యేక నిధిని ప్రకటించింది. 500 కోట్ల రూపాయలలోపు ఎలాంటి ఆయుధ సంపత్తిని సమకూర్చుకునేందుకు రక్షణ దళాలకు ఆర్థిక అధికారాలను కట్టబెట్టింది. అత్యవసర విధానాల కింద ఆయుధ సామాగ్రి కొనుగోలు కోసం త్రివిధ దళాలకు ఆర్థిక స్వేచ్చను ప్రభుత్వం సమకూర్చిందని, దీనికింద 500 కోట్ల రూపాయల లోపు ఎలాంటి నూతన ఆయుధాల కొనుగోలునైనా వారు స్వయంగా చేపట్టవచ్చని ఆదివారం అధికార వర్గాలు వెల్లడించాయి.


యుద్దానికి అవసరమైన ఆయుధ సామాగ్రి తమ ఇన్వేమ్టరీలో   లేనిపక్షంలో ఈ పాజెక్టు కింద రక్షణ బలగాలు సైనిక వ్యవహారాల విభాగంతో సంప్రదింపుల ద్వారా ఆయా ఆయుధాలను నేరుగా కొనుగోలు చేయవచ్చని తెలిపాయి. త్రివిధ దళాలు ఇప్పటికే తమకు అవసరమైన ఆయుధాలు, పరికరాల జాబితాను రూపొందించి వాటిని అతితక్కువ సమయంలో సమీకరించేందుకు కసరత్తు చేస్తున్నాయి.