భౌతిక దూరం పాటించకపోతే మరింత ప్రమాదం : నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్


కరోనా వైరస్ కట్టడి లక్ష్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలపై మరోసారి దృష్టి సారించారు జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్.... ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన క్రమంలో కూరగాయల మార్కెట్లు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి (నేడు) శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.



- - ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్, ఎస్.బి.ఐ. బ్యాంక్, రిలయన్స్ మార్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ
- - మాస్కులు, భౌతిక దూరం పాటించేలా చూడాలని వ్యాపారులకు, బ్యాంక్ సిబ్బందికి సూచన
- - కరోనా కట్టడిలో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి



నల్లగొండ : కరోనా వైరస్ కట్టడి లక్ష్యంగా రద్దీగా ఉండే ప్రాంతాలపై మరోసారి దృష్టి సారించారు జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్.... ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలించిన క్రమంలో కూరగాయల మార్కెట్లు, బ్యాంకులు, సూపర్ మార్కెట్లు తదితర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.... రద్దీగా ఉండే ప్రాంతాలు, కూరగాయల మార్కెట్లు, సూపర్ మార్కెట్లు, బ్యాంకులు తదితర ప్రాంతాలలో సామాజిక దూరం పాటించకపోతే కరోనా మరింత విస్తృతంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాధ్ హెచ్చరించారు.



(నేడు) శనివారం నల్లగొండ పట్టణంలోని ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్, ఎస్.బి.ఐ. బ్యాంక్, రిలయన్స్ సూపర్ మార్కెట్లలో ఆకస్మికంగా తనిఖీ చేసి బ్యాంకు సిబ్బందికి, కూరగాయల వ్యాపారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కూరగాయల మార్కెట్ వ్యాపారులతో మాట్లాడుతూ సూర్యాపేట, హైదరాబాద్ మలక్ పేట, చెన్నై తదితర ప్రాంతాలలో కూరగాయల మార్కెట్ల ద్వారానే వైరస్ వ్యాప్తి చెందిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకొని అందుకు అనుగుణంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముఖ్యంగా హ్యాండ్ గ్లౌజులు, సానిటైజర్లు వినియోగించడంతో పాటు వినియోగదారులను విధిగా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యత వ్యాపారులదేనని స్పష్టం చేశారు.



ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా భారీగా కేసులు పెరిగే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. కొనుగోళ్ల కోసం వచ్చే వారు ఒకే సారి గుంపులుగా రాకుండా ఒక్కొక్కరుగా కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మార్కెట్లలో రద్దీ పెరగకుండా కూరగాయల దుకాణాల యజమానులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.  భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడం, వృద్ధులు కూరగాయలు అమ్మడం పట్ల జిల్లా ఎస్పీ రంగనాథ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.



ప్రభుత్వం,పోలీసులు సూచించిన నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం బజార్ మార్కెట్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా కలెక్టర్ తో చర్చించి తగిన ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. కూరగాయలు కొనడానికి రద్దీగా ఉన్న ప్రాంతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే మాస్కులు,గ్లౌజులు ధరించాలని కోరారు. కూరగాయలు కొనడానికి అమ్మడానికి వృద్ధులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దని, దీనిని కూరగాయల దుకాణాల యజమానులే పర్యవేక్షణ చేయాలని అన్నారు. వృద్ధులు, గుండె వ్యాధి గ్రస్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైరస్ త్వరగా సోకే ప్రమాదం ఉన్నందున వారు రద్దీ ప్రాంతాలలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.



కూరగాయల మార్కెట్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భౌతిక దూరం పాటించేలా వ్యాపారులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని గుంపులుగా కొనుగోళ్ళకు రాకుండా నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ సిఐ నిగిడాల సురేష్ ను ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ వెంట వన్ టౌన్  సిఐ నిగిడాల సురేష్, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.


పోలీసులకు డార్క్ ఫాంటసీ బిస్కెట్ ప్యాకేట్స్ అందించిన ఐటిసి సంస్థ



- - 1800 ప్యాకెట్ల బిస్కెట్లు ఎస్పీకి అందచేసిన కంపెనీ డిస్ట్రిబ్యూటర్, ప్రతినిధులు
- - 60 వేల విలువైన ప్యాకెట్లు పోలీస్ శాఖకు అందించిన ఐటిసి కంపెనీ


 కరోనా వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందికి తమవంతు సహాయంగా ఐటిసి కంపెనీ డార్క్ ఫాంటసీ బిస్కెట్ ప్యాకేట్స్ కంపెనీ డిస్ర్రీబ్యూటర్, కంపెనీ ప్రతినిధులు జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ కు అందించారు.


(నేడు) శనివారం ఐటిసి కంపెనీ డిస్ట్రిబ్యూటర్, అన్నపూర్ణ సేల్స్ కార్పొరేషన్ అధినేత గట్టాణి శ్రీనివాద్ ఎస్పీ కార్యాలయంలో 1800 బిస్కెట్ ప్యాకెట్లు అందించి జిల్లాలో పని చేస్తున్న పోలీస్ సిబ్బంది అందరికి పంపిణీ చేయాలని కోరారు. కరోనా పై పోలీసులు చేస్తున్న పోరాటంలో ఐటిసి కంపెనీ వారికి బాసటగా నిలవాలని నిర్ణయించి బిస్కెట్ ప్యాకెట్స్ పోలీసులకు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సుమారు 60 వేల రూపాయలు విలువ కలిగిన వీటిని పోలీసులకు అందించడం తమకు ఎంతో గర్వకారణంగా ఉన్నదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీమతి సి.నర్మద, ఐటిసి కంపెనీ ప్రతినిధులు జ్యోతి రాజ్, యశ్ గట్టాణి, ధీరజ్ గట్టాణి, ఎస్.బి. డిఎస్పీ రమణారెడ్డి, సూపరింటెండెంట్ దయాకర్, సిఐలు అనిల్, సురేష్, ఆర్.ఐ. స్పర్జన్ రాజ్,  తదితరులున్నారు.