ఈ నెల 21న ఆకాశంలో అద్భుత దృశ్యం


ఈ నెల 21న ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కరించనుంది. ఆ రోజు సూర్యుడు మండుతున్న ఉంగరంలా వినువీధిన దర్శనమివ్వనున్నాడు. వలయాకార గ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రణం కావడం, అదీ కరోనా విలయంలో వస్తుండటంతో.. అందరిలో ఆసక్తి నెలకొంది.


జూన్ 21న మరోసారి సూర్యగ్రహణం రాబోతోంది. ఆ రోజు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు గ్రహణం మొదలై మధ్యాహ్నం 3 గంటల 4 నిమిషాలకు ముగియనుంది. పూర్తి గ్రహణం ఉదయం 10 గంటల 17 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషాల దాగా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డిసెంబర్ 26, 2019లో వచ్చిన సూర్యగ్రహణానికీ, ఈనెల 21న వచ్చే సూర్య గ్రహణానికి చాలా తేడా ఉంటుంది. ఈ ఏడాదికి ఇదే తొలి సూర్యగ్రహణం కావడంతో అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.


చంద్రబింబం మూసినంత మేర మూయగా.. దాని చుట్టూ కనిపించే సూర్యగోళం మండుతున్న ఉంగరంలా కనిపిస్తుంది. దీన్నే వలయాకార గ్రహణం అంటారు. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల్లో, హిందూ, పసిఫిక్‌ మహాసముద్రాల్లోని దీవుల్లో, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించనుంది. మిగిలిన చోట్ల కేవలం పాక్షిక సూర్యగ్రహణమే కనిపిస్తుంది. ఒక సెకను నుంచి 12నిముషాల వ్యవధి మధ్యలో ఈ వలయాకార గ్రహణ సమయం ఉండే అవకాశం ఉంది.


మరో ఐదు రోజుల్లో ఏర్పడనున్న వలయాకార సూర్యగ్రహణం .. కరోనా వైరస్ పైనా ప్రభావం చూపుతుందా అంటే ... దీనిపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. నిపుణులు అలాంటిదేమీ ఉండదని చెబుతుండగా., కొందరు ఆధ్యాత్మికవాదులు మాత్రం..సూర్యగ్రహణం మేలు చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నారు.


మొత్తానికి ఈ నెల 21కోసం ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆకాశంలో ఆవిష్కృతం కాబోయే అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.