హైదరాబాద్ : తెలంగాణ లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. రోజురోజుకీ కోవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 206 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్కరోజులో నమోదైన కేసులతో పోల్చితే ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇవాళ ఒక్కరోజే 10 మంది బాధితులు మృతి చెందగా... ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 123 కు చేరింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు సంఖ్య 3,496 కు చేరినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.
గడచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 152 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలోను ఒక్కరోజులో నమోదైన కేసులతో పోల్చితే ఇదే అత్యధికం.
రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ లో 18, నిర్మల్, యాదాద్రి జిల్లాల్లో 5 చొప్పున , మహబూబ్ నగర్ జిల్లాలో4, జగిత్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో 2 చొప్పున కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మహబూబాబాద్, వికారాబాద్, జనగామ, గద్వాల, నల్గొండ, భద్రాధ్రి, కరీంనగర్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనా బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకుని 1,710 మంది డిశ్చార్జ్ కాగా ... 1,663 మంది చికిత్స పొందుతున్నారు.