జూన్ 08న ప్రపంచ సాగర దినోత్సవం లేదా ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం

మన జీవితంలో సమద్రం ప్రాముఖ్యత, వాటిని పరిరక్షించే మార్గాలపై ప్రజలందరికి అవగాహన కల్పిచటం కోసమే ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

చరిత్ర:
సముద్ర జలం వల్ల లబ్దిపొందుతూ వచ్చిన మానవుడు ఆ జలాలకు తాను కలిగిస్తున్న నష్టం గురించి గాని, సముద్రజలాలలో వస్తున్న మార్పు గురించి గాని అంతగా పట్టించుకోలేదు. తన చర్యల వల్ల కాలుష్యము అధికమై భూతాపం పెరిగి ధృవాలలోని మంచు కరిగిపోతుందని, సముద్రమట్టము పెరుగుతుందని గమనించిన సామాజికవేత్తలు వాటిని పరిరక్షించటం కోసం రకరకాల మార్గాలను అన్వేషించటం మొదలుపెట్టారు. పర్యావరణమంటే అడవులు, నదుల వరకే అనుకుని వాటికి సంబంధించిన అవగాహన మాత్రమే కల్పిస్తున్న అంతర్జాతీయ సంస్థలు సముద్రజలాల గురించి ప్రజలకు తెలియజేయల్సినఅవసరాన్న్ని గుర్తించాయి .


1992 లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ధరిత్రి సదస్సు జరిగింది. ఆ సందర్భంగా సముద్రాలమీద అవగాహన పెంచాలని నిర్ణయించారు. అప్పటివరకు తుఫాన్‌లను మాత్రమే చూసిన తీర ప్రజలకు 2005లో వచ్చిన సునామీ అది సృష్టించిన బీభత్సం తర్వాత ఇక సాగర దినోత్సవం ద్వారా సముద్రాల మీద ప్రజల ఆలోచనలను మార్చాల్సిన అవసరము ఉందని తీర్మానించుకున్నారు. సముద్రాలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజెప్పడానికి ప్రతి ఏటా జూన్‌8వ తేదీని ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా పాటించాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. 2009 నుండి ప్రపంచ సాగర దినోత్సవ నిర్వహణ ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్‌08న "సాగరదినోత్సవం లేదా మహాసముద్రాల దినోత్సవం" గా జరుపుకుంటున్నారు .

సముద్రాల ఆవశ్యకత
సముద్రాలు జీవవైవిధ్యానికి పట్టుగొమ్మలు. కోట్లాది చేపలు, పక్షులు సముద్రజీవులకు అవి ఆవాసాలుగా ఉన్నాయి. భూతాపాన్ని కట్టడి చేయటంలో సముద్రాలు విశేషంగా దోహదపడుతాయి. భూమిపై ఉండే బొగ్గుపులుసు వాయువులో 1/3 వంతును శోషించి, సాగరాలు మనకు ప్రాణవాయువును అందిస్తాయి. వాతావరణ సమతుల్యతను కాపాడటంలో సముద్రాలు అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. ఏటా 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన సముద్ర వనరులను మనకందిస్తాయి. 300కోట్ల మంది ప్రజలు ప్రత్యక్షంగా కాని పరోక్షంగా కాని సముద్రాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ విధంగా మనకెంతో మేలు చేసే సముద్రాలను మనం చేజేతులరా నాశనం చేసుకుంటున్నాం. వాటిని పూర్తిగా కాలుష్యంతో నింపి వేస్తున్నాం.