న్యూయార్క్: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌పై చేస్తున్న పోరులో మత పెద్దలు కీలక పాత్ర పోషించవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. మహమ్మారి ప్రభావానికి గురైన ప్రజలు తిరిగి కోలుకోవడంలో మత పెద్దల పాత్ర ఎంతో కీలకమన్నారు. స్థిరమైన, సమానమైన ప్రపంచాన్ని నిర్మించడంలో వివిధ వర్గాలు కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని గుటెర్రస్ స్పష్టం చేశారు. ఈ సమయంలో వైరస్‌పై విస్తృత అవగాహన కలిపించడమే కాకుండా దీనిద్వారా త్వరగా కోలుకునే మార్గాలను ప్రజలకు వివరించడంలో మత పెద్దలు కీలకమని గుటెర్రస్ ట్విటర్‌లో ద్వారా పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూలేని విధంగా ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
కేవలం ఇది ఆరోగ్య అత్యయిక స్థితి మాత్రమే కాదు, జీవనోపాధి దెబ్బతీస్తూ మానవ జీవితాన్నే తారుమారు చేసే తీవ్రసంక్షోభం అని గుటెర్రస్ అభిప్రాయపడ్డారు. గతంలో ఇలాంటి ఆరోగ్య సంక్షోభ సమయంలో మత పెద్దలు ప్రజలకు అండగా నిలబడ్డ తీరు ప్రపంచానికి తెలుసన్నారు. కొవిడ్-19 మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని తన విజ్ఞప్తి మేరకు మద్దతు తెలిపిన మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న సమయంలో విదేశీయుల పట్ల ద్వేషభావం, జాత్యాహంకారం వంటి సంఘటనలతోపాటు అసహన చర్యలను తీవ్రంగా ఖండించాలని మత పెద్దలకు సూచించారు. కొవిడ్-19 విజృంభిస్తోన్న సమయంలో వస్తున్న అసత్య వార్తలను, ప్రచారాలను వారికున్న నెట్‌వర్క్ ద్వారా తిప్పికొట్టడంతోపాటు సామరస్యం వెల్లివిరిసేలా మతపెద్దలు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ పిలుపునిచ్చారు.