కరుణకు, దాతృత్వానికి ప్రతీకైన ... "రంజాన్" పర్వదినం నేడే


ముస్లింలకు అతిపెద్ద పండుగ రంజాన్. రంజాన్ మాసం వచ్చిందంటే ఉపవాసాలకు సమయం వచ్చినట్లే. నెల రోజుల పాటు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పచ్చి నీళ్లు సైతం ముట్టుకోకుండా కఠినంగా ఉపవాసాలు ఆచరించే ముస్లింలు సూర్యాస్తమయం తర్వాత అన్నపానీయాలను సేవించి సేదతీరతారు. ఈ పండగ, రంజాన్ మాసం కోసం ప్రపంచంలో చాలా దేశాలలో ప్రత్యేక అనుమతులు, ఏర్పాట్లు కూడా ఉంటాయి.ఇక మన భాగ్యనగరం విషయానికి వస్తే ఇక్కడ రంజాన్ శోభ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ నెల రోజుల పాటు నగరంలో రాత్రేదో పగలేదో అర్ధం కానంతగా భాగ్యనగరం మెరిసిపోతుంది. ఎక్కడ చూసిన విద్యుత్ దీపాలతో అలంకరించిన వీధులు, పూట పూట వినిపించే మత ప్రవచనాలు.. ప్రత్యేకించి ఈ మాసం కోసమే తయారుచేసిన అత్తరు వాసనలతో హైదరాబాద్ నగరం మురిసిపోతుంది.ఇక ఈ నెల రోజుల పాటు నగరంలో లభించే హర్రీస్, హలీం, బిర్యానీ, కబాబ్, నోరూరించే ఖీర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ లవర్స్ ఉన్నారంటే అతిశయోక్తికాదు. ఇక ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసరాలలో ఈ సమయంలో ప్రత్యేకంగా దొరికే గాజులు, వస్తువులు, బట్టలకు కూడా విశేష ప్రాధాన్యం ఉంటుంది. హైదరాబాద్ లో రంజాన్ అంటే ముస్లింలతో పాటు మిగతా మతాల వారికి కూడా పండగగానే ఉంటుంది. కానీ ఈఏడాది అవేమీ లేకుండానే రంజాన్ పూర్తవుతుంది. ప్రపంచాన్ని వణికించే మహమ్మారి కరోనా రంజాన్ సంబరాలపై నీళ్లు చల్లేసింది.


రంజాన్ వంటకాల కోసం ఆవురావురుమంటున్న ఫుడ్ లవర్స్ నోట్లో మట్టికొట్టేసిన కరోనా ఈ కాలంలో లభించే అత్తరు వాసన తగలక నాసికాలను మొద్దుబారేలా చేసింది. ప్రతి ఏడాది దగ్గరుండి జరిపించే ప్రభుత్వం కూడా చేసేదేం లేక జాగ్రత్తలతో ఎవరి ఇంట్లో వాళ్ళు పండగ చేసుకోవాలని తిరిగి ప్రజలనే కోరింది.అలా ఇప్పుడున్న వాళ్ళెవ్వరూ కూడా ఇప్పటి వరకు రంజాన్ పండగ ఇలా బోసిపోయిన సందర్భం చూడనేలేదు. అయితే భాగ్యనగరంగా పుట్టిన మన హైదరాబాద్ చరిత్రలో ఇలాంటి పరిస్థితి గతంలో ఒకసారి తలెత్తిందని చరిత్ర చెప్తుంది. గతంలో 112 సంవత్సరాల క్రితం అంటే 1908లో సరిగ్గా రంజాన్ మాసంలోనే భారీ వర్షాలతో మూసీ నది ప్రళయ గర్జనతో నగరంపై విరుచుపడింది.దీంతో హైదరాబాద్ ప్రజలు ప్రాణాలను అరచేతిన పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడిపారు.


మూసీ వరదలకు ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా భారీగా జరిగింది. ఆ వరదల నుండి కోలుకోలేనందుకు భాగ్యనగర ప్రజలకు ఎన్నో ఏళ్ళు పట్టింది. అయితే, వరదలు వచ్చిన ఆ ఏడాది రంజాన్ వేడుకలు జరగలేదు. మరుసటి ఏడాది నుండి స్థోమతను బట్టి మెల్లగా పరిస్థితులు చక్కబడ్డాయి.ఆ తర్వాత మూసీ నదిపై డ్యామ్ లు ఏర్పాటై ఇప్పటికి మళ్ళీ వరద ముప్పు రాలేదు.

అయితే ఇన్నాళ్లుకు 112 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కరోనా మహమ్మారితో అదే పరిస్థితి దాపురించింది. నగరంలో ప్రజలను ఒకవైపు ఆర్ధిక కష్టాలు వెంటాడుతుంటే.. మరోవైపు కరోనా భయంతో పండగ సందడి లేకుండాపోయింది. చివరికి ఆలింగనం చేసుకొని చెప్పుకొనే 'అలాయ్ - బలాయ్' ఆత్మీయ శుభాకాంక్షలు కూడా సామజిక దూరం పేరిట కరువైపోయాయి.



ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. హైదరాబాద్‌లో ఈ పండగ చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం సాధాసీదాగా జరుగుతున్నాయి. కరోనా కారణంగా మసీదులకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అంతా ఇళ్లలనే ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఎక్కువ మంది గుమిగూడకుండా జాగ్రత్తపడుతూ.. పండగ సంబరాలు చేసుకుంటున్నారు. ఎప్పుడూ రద్దీగా, సామూహిక ప్రార్థనలు జరిగే రంజాన్ పండగ ఇలా జరగడం 112 ఏళ్ల చరిత్రలో ఇదే తొలిసారిగా చెబుతున్నారు.


బంధువులు, స్నేహితులను కలుసుకొని ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకోవడం సంప్రధాయం. కానీ ఈసారి వీటన్నింటికి దూరంగా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. ప్రస్తుత పరిస్థితులు 112 ఏళ్ల క్రితం నాటి సంఘటనను గుర్తు చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో హైదరాబాద్‌లో మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దీంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్లన్ని బురదమయంగా మారడంతో మసీదులకు ఎవరూ వెళ్లలేకపోయారు.

దీంతో ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి ఎలాంటి ఆర్భాటం లేకుండా పండగ జరుపుకున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా అలాంటి పరిస్థితే వచ్చిందని చెబుతున్నారు. దీంతో రంజాన్ మాసంలో ఎప్పుడూ కళకళలాడే నగరం ఇప్పుడు కళ తప్పింది. చార్మినార్, మక్కా మసీదు ప్రాంతాలు అన్ని నిర్మానుషంగా కనిపిస్తున్నాయి.


ఈద్‌-ఉల్‌-ఫితర్‌ (రంజాన్‌)


ఆకాశంలో నెలవంక కనిపించడంతో నిన్న రాత్రితో ముస్లింల ఉపవాస దీక్షలు ముగిశాయి. ముస్లింలు ఈద్ ఉల్ ఫితర్ వేడుక ఏర్పాట్లలో మునిగిపోయారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే శుక్రానా నమాజ్‌గా జరుపుకోవాలని మత పెద్దలు సూచించారు. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామిక్‌ కేలండర్‌లో వచ్చే తొమ్మిదవ నెలే రంజాన్‌. ఈ నెలలోనే దివ్య ఖురాన్‌ గ్రంథం ఆవిర్భవించిందని ముస్లింల నమ్మకం. ముస్లింల జీవన విధానం ఎలా ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, అల్లాకు ప్రార్ధనలు ఎలా చేయాలి వంటి విషయాలను ఈ గ్రంథం వివరిస్తుంది. జీవిత నావకు చుక్కాని లాంటి ఈ గ్రంధాన్ని ఇచ్చినందుకు భక్తులు కృతజ్ఞతగా ఉపవాస దీక్షలు అర్పిస్తారు.


ఈ పర్వదినాన్ని ముస్లింలు (నేడు)  సోమవారం జరుపుకోనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి, లాక్‌డౌన్‌ నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా ఈ యేడాది ఈద్‌ ప్రత్యేక ప్రార్థనలు ఈద్గాలు, మసీదులలో కాకుండా ఇళ్లల్లోనే జరగనున్నాయి. ఈ రంజాన్‌ పండుగ ముస్లింలందరి జీవితాల్లో ఆనందం నిండాలని, ‌ 'ఈ పండగ ప్రేమ వ్యక్తీకరణకు, సోదరభావం, సామరస్యానికి ప్రతిరూపంగా దాతృత్వంపై ఉన్న విశ్వాసాన్ని మరింత బలంగా చూపాలని, కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పండగను ఘనంగా జరుపుకోవాలి' అని రాష్ట్రపతి  రాంనాథ్‌ కోవింద్ ఆకాంక్షించారు.



ఇక తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మత సామరస్యానికి నిదర్శనమని, పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని కోరారు సీఎం కేసీఆర్‌. రంజాన్‌ పండుగ సామరస్యం, సహృద్భావం, దాతృత్వానికి ప్రతీకని అన్నారు ఏపీ సీఎం జగన్‌. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ జాగ్రత్తలు పాటిస్తూ.. కఠిన ఉపవాస దీక్షలు ఆచరించడం అభినందనీయమన్నారు ఇరు రాష్ట్రాల సీఎంలు. ప్రతీ ఒక్కరు ఇంటిలోనే ఉండి పండుగ జరుపుకోవాలని సూచించారు.



ముస్లింలకు ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ వ్యవస్థాపక, అధ్యక్షులు దేశభక్త డా౹౹ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ రంజాన్‌ శుభాకాంక్షలు


ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ వ్యవస్థాపక, అధ్యక్షులు దేశభక్త డా౹౹ అద్దంకి స్వామిదాస్ రంజిత్ ఓఫీర్ ‌శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభ సంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు పాటించారన్నారు. ఈ విపత్కర కరోనా సమయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని తెలిపారు. నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్య మాసానికి రంజాన్‌ ఒక ముగింపు వేడుకన్నారు. ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని పేర్కొన్నారు.


మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది కూడా రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని తెలిపారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్‌ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని అన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని.. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని, ప్రతీ ఒక్కరు ఇంటిలోనే ఉండి పండుగ జరుపుకోవాలని సూచించారు.



భారతీయ మాజీ సైనికులు, ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నోబుల్ రుంజాల మాట్లాడుతూ క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికగా విశ్వవ్యాప్తంగా రంజాన్‌ మాసం పవిత్రత ఆపాదించుకుందని పేర్కొన్నారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమతత్వానికి, కరుణకు, దాతృత్వానికీ ప్రతీకగా అభివర్ణించారు. ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. తెలుగు రాష్ట్రాల ముస్లింలంతా రంజాన్‌ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, రంజాన్‌ జీవన పరమార్థాన్ని తెలియజేస్తుందని, కఠిన స్వీయ క్రమశిక్షణను నిర్దేశిస్తుందని చెప్పారు. పవిత్ర ఖురాన్‌ బోధనలు జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతాయని చెప్పారు. కొవిడ్‌ ను ఎదుర్కొనే స్థైర్యాన్ని రంజాన్‌ పర్వదినం అందిస్తుందని తెలిపారు.



 ఇండియా ప్రజాబంధు పార్టీ జాతీయ కోశాధికారి తోట నర్సింహులు, జాతీయ సంయుక్త కార్యదర్శి మధు పాలమాకుల, కార్యనిర్వాహక కార్యదర్శి అబ్బులు యాదాల, పార్టీ జాతీయ నాయకులు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్, సామ్యూల్ జాన్ అబ్రహం,  జీడి సురేష్, జాతీయ మహిళా అధ్యక్షురాలు షీభా ప్రవీణ్, మహిళా జనరల్ సెక్రటరీ ఎం. సంధ్య రాణి, మల్కాజ్ గిరి జిల్లా అధ్యక్షులు సువార్త రాజు, పార్టీ నాయకులు దయానంద్, జాతీయ యూత్ అధ్యక్షులు మస్కు  సుధాకర్, పార్టీ మహిళా నాయకురాళ్లు శ్రావణి అలమేటి, సులక్షణ తదితరులు ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.


 


Dailyhunt