అమెరికాలో ఉంటూ అక్కడి ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయుల కృషిని గుర్తించిన అధ్యక్షుడు ట్రంప్ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభంలో అక్కడి వైద్యులు, శాస్త్రవేత్తలు అందిస్తున్న సేవల్ని ప్రత్యేకంగా కొనియాడారు. మహమ్మారిపై చేస్తున్న పోరులో వారి పాత్ర మరువలేనిదని కితాబిచ్చారు. ప్రధాని మోదీని తన గొప్ప మిత్రుడిగా పేర్కొన్న ట్రంప్.. కరోనా వైరస్‌పై యుద్ధంలో ఆయనతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్ర పరిశోధనా రంగంలో భారతీయులు చేస్తున్న కృషి ప్రశంసించడం ఇదే తొలిసారి.
కరోనా వైరస్‌కు విరుగుడుగా వ్యాక్సిన్‌ను తయారు చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. భారత్‌లోనూ ఆ దిశగా కృషి జరుగుతోంది. అమెరికాలో జరుగుతున్న పరిశోధనల్లో ఇండియన్-అమెరికన్ శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ వంటి పలు మెడికల్ సైన్సెస్ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, బయో ఫార్మా అంకుర సంస్థల్లో భారతీయులు విశేష కృషి చేస్తున్నారు. అమెరికాలో దాదాపు 40 లక్షల మంది ఇండియన్ అమెరికన్లు ఉన్నట్లు అంచనా. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయకుంటే భారత్‌పై ప్రతీకారం తప్పదని గత నెలలో హెచ్చరించిన తర్వాత.. ఇండియాపై ట్రంప్ ప్రశంసలు కురిపించడం ఇదే తొలిసారి.
''అమెరికా జనాభాలో అనేక మంది భారతీయులు ఉన్నారు. వీరిలో చాలా గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఉన్నారు. వ్యాక్సిన్ తయారీ కోసం కృషి చేస్తున్నారు. ప్రధాని మోదీ నాకు గొప్ప మిత్రుడు. ఈ సంక్షోభంలో ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. వ్యాక్సిన్ తయారీలో పరస్పరం సహకరించుకుంటాం. కంటికి కనిపించని శత్రువును జయిస్తాం. మహమ్మారిపై పోరులో భారత్‌కు అండగా ఉంటాం''
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
భారత్‌కు వెంటిలేటర్లు అందిస్తాం..
కొవిడ్-19 చికిత్సలో కీలకంగా మారిన వెంటిలేటర్లను భారత్‌కు అందించనున్నామని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. అయితే అవి ఎన్ని అనేది మాత్రం చెప్పలేదు. ప్రధాని మోదీతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ ప్రకటన చేశారు. ట్రంప్ విజ్ఞప్తి మేరకు గత నెల అమెరికాకు భారత్ భారీ స్థాయిలో హైడ్రాక్సీక్లోరోక్విన్ నిల్వల్ని సరఫరా చేసిన విషయం తెలిసిందే.