మందులెందుకు.......?


ఔషధాల కొనుగోలుపై ఆరా తీస్తున్న అధికారులు


హైదరాబాద్‌:  ఔషధ దుకాణాలను ఆశ్రయిస్తున్న వారిలో సాధారణ జ్వరం, జలుబు పీడితులే అధికంగా ఉన్నారు. కరోనా వైరస్‌ భయంతో కొందరు పారాసిటమాల్‌, హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ సల్ఫేట్‌ గోలీలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు సర్కిళ్ల వారీగా ఔషధ దుకాణాలపై నిఘా ఉంచారు.


వాట్సాప్‌ సాయంతో...


జీహెచ్‌ఎంసీ పరిధిలోని 30సర్కిళ్ల ఉపకమిషనర్లు, సంబంధిత సహాయ వైద్యాధికారులు, డ్రగ్‌ కంట్రోలర్లతో కలిసి రంగంలోకి దిగారు. ఔషధ నియంత్రణాధికారుల నుంచి మెడికల్‌ షాపుల వివరాలు తీసుకుంటున్నామని, యజమానుల ఫోన్‌ నంబర్లతో డివిజన్లు, సర్కిళ్ల వారీగా వాట్సాప్‌ గ్రూపులు సృష్టించి సమాచారాన్ని సేకరిస్తున్నామని జీహెచ్‌ఎంసీ తెలిపింది.


మందులు కొనుగోలు చేసిన వ్యక్తులకు ఫోన్‌ చేసి వ్యాధి లక్షణాలను ఆరా తీస్తున్నాం. అనుమానం వస్తే ఇంటికెళ్లి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నాం.' అని అధికారులు 'ఈనాడు'కు తెలిపారు.


నగరవ్యాప్తంగా నిఘా...


యూసఫ్‌గూడ సర్కిల్‌ పరిధిలో 260 దుకాణాలుండగా.. బుధవారం వాటి నుంచి 50 మంది జ్వరం, జలుబు సమస్యలకు మందులు కొనగా విచారించారు. ఖైరతాబాద్‌ సర్కిల్‌లో పది మంది జ్వర పీడితులను గుర్తించారు. వీరందరిపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ల చిట్టీలు ఉన్నోళ్లకే మందులివ్వాలని యజమానులకు స్పష్టం చేశారు.


కఠిన చర్యలు తీసుకుంటాం...


పారాసిటమాల్‌తోపాటు కరోనా నివారణకు ఉపయోగించే ఇతర ఔషధాలు కొనుగోలు చేసే వ్యక్తుల వివరాలను జీహెచ్‌ఎంసీ అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఔషధ దుకాణాల నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టానుసారం మందులు విక్రయిస్తే విచారణ జరిపి యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మందుల దుకాణదారులు సహకరిస్తే వ్యాధి లక్షణాలున్న వారిని కనిపెట్టి, మహమ్మారి నుంచి నగరాన్ని రక్షించుకోవచ్చని రామ్మోహన్‌ గుర్తుచేశారు.