ఏదైనా చేద్దాం.. ఎలాగైనా సాధిద్దాం! ఈ ఆలోచన కార్పొరేట్ ఆఫీస్‌లో పుడితే.. క్షణాల్లో పరిష్కారం తడుతుంది. ఏంబీఏలు చేసినవారికొస్తే వారంలో ఓ ఆచరణలోకి వస్తుంది. ఇదే ప్రశ్న అడవిలో ఉదయిస్తే.. అడవిబిడ్డలు వారిని వారు ప్రశ్నించుకుంటే.. ఆలోచన రాలేదు. సమాధానం దొరకలేదు. అయినా పట్టు విడవలేదు. అన్వేషించారు. పరిష్కారం కనుక్కున్నారు. ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఏకంగా ఓ పరిశ్రమనే నెలకొల్పారు. వారెన్నడూ ఊహించని ఆదాయం సంపాదించారు. ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలికారు. ఆ అడవిబిడ్డల విజయగాథ చదివేయండి.
ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు చిక్కటి అడవిలో పచ్చగా ఉంటుంది. ఈ అడవితల్లి ఒడిలో ఆదివాసీలు ఎందరో. తరాలు మారినా వారిది మారని జీవనశైలి. కష్టాలు ఎదురైనా, నష్టాలు కలిగినా.. మా బతుకులింతే అని బాధపడటం ఒక్కటే తెలుసు. ఈ పరిస్థితిలో మార్పు రావాలనుకున్నారు ఆ ఆడబిడ్డలు. ఎనిమిది మంది కలిసి కష్టాలను అష్టదిగ్బంధనం చేయాలని నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రుల వెతలు చూసిన ఆ కళ్లతో.. కొత్త కలలు కనడం మొదలుపెట్టారు. వాటిని సాకారం చేసుకొని అడవిలో అష్టలక్ష్ములయ్యారు.
ఎనిమిది మంది కలిసి.. సోనీ, శారద, పద్మావతి, జమున, దుర్గా, కల్యాణి, లలిత, సావిత్రి అందరివీ నిరుపేద కుటుంబాలే. వసతి గృహాల్లో ఉంటూ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుకున్నారు. ఇంటర్, డిగ్రీలు పూర్తి చేసినా.. పోటీ ప్రపంచంలో ఉపాధి పొందలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఓ ప్రకటన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. 'ఉపాధి లేక ఖాళీగా ఉంటున్న ఆదివాసీ యువతకు పారిశ్రామిక రంగంలో రాణించేలా రుణసాయం అందిస్తామ'న్న ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కృష్ణ ఆదిత్య ప్రకటన వీరిలో కొత్త ఆశలు నింపింది. ఉన్నత ఆశయం దిశగా నడిపించింది. ఎనిమిది మంది కలిసి 'మేం సబ్బులు, షాంపూల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామనీ, రుణసాయం చేయాలనీ' అధికారులకు విన్నవించుకున్నారు. పరిశ్రమ ఏర్పాటుపై వీరికి పూర్తి అవగాహన లేదని కృష్ణ ఆదిత్య భావించారు. అయినా వీరి విజ్ఞప్తిని తోసిపారేయకుండా.. వెన్నంటి ఉండి ప్రోత్సహించారు. సబ్బులు, షాంపూల తయారీలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలని సూచించారు. అది పూర్తయ్యాక రుణసాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మూడు నెలల శిక్షణ కొండంత ఆశతో ఆ ఎనిమిది మంది హైదరాబాద్ చేరుకున్నారు. జేడీఎం యూత్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో శిక్షణకు సిద్ధమయ్యారు. ఓ ప్రైవేట్ హెర్బల్ ల్యాబోరేటరీలో మూడు నెలల పాటు సబ్బుల, షాంపూల తయారీ నేర్చుకున్నారు. యంత్రాల పనితీరు తెలుసుకున్నారు. అవి మొరాయిస్తే ఏం చేయాలో అవగాహన పొందారు. యంత్రాల నిర్వహణలో సహకారం కోసం లక్ష్మణ్, బాపూరావు అనే ఇద్దరు ఆదివాసీ యువకులకు శిక్షణ ఇప్పించారు. మూడు నెలలు తిరిగే సరికి.. పూర్తిస్థాయి పట్టు సాధించారు.
నెల లాభం రూ.లక్ష.. శిక్షణ పూర్తయిన తర్వాత అందరూ కలిసి 'గాయత్రి జాయింట్ లయబెలిటీ' పేరుతో ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు. అదే పేరుతో పరిశ్రమను రిజిస్టర్ చేయించారు. రూ.20 లక్షలు రుణం లభించడంతో రెండు నెలల కిందట ఉట్నూరులో గ్లిజరిన్ సబ్బులు, షాంపూల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. యంత్రాల ఏర్పాటు, ముడిసరకు, ప్యాకింగ్ మెటీరియల్ తెచ్చుకుని అన్నీ సిద్ధం చేసుకున్నారు. మరో నెలలో 15వేల సబ్బులు, 15వేల షాంపూ బాటిళ్లు తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. రేయింబవళ్లు వాళ్లు చేసిన పరిశ్రమకు అద్భుతమైన ఫలితం దక్కింది. వీరి ఉత్పత్తులను గిరిజన సహకార సంస్థ ద్వారా మార్కెటింగ్ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలకు వాటిని సరఫరా చేశారు. 10వేల సబ్బులు, 10వేల షాంపూలు విక్రయించగా పెట్టుబడి పోను లక్ష రూపాయల లాభం ఆర్జించి శభాష్ అనిపించుకున్నారు. 'ఎలా బతకాలో పాలుపోని స్థితిలో ఐటీడీఏ అందించిన సహకారం మరచిపోలేనిది. మేమంతా కలిసి కష్టపడుతున్నాం. భవిష్యత్తులో మరికొందరికి ఉపాధి కల్పిస్తామ'ని ఆనందంగా చెబుతున్న ఈ అడవిబిడ్డలు అందరికీ ఆదర్శం.
- మహ్మద్ రహీముద్దీన్, ఉట్నూరు