ఈ దశాబ్దంలో అత్యుత్తమ జట్టు భారత్‌


రెండు దశాబ్దాల్లో మెరుగైన టీమిండియా


ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక ప్రపంచకప్‌, రెండు సెమీఫైనల్స్‌.. ఒక ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఒక రన్నరప్‌.. ఇది టీమిండియా ఈ దశాబ్దంలో కొనసాగిన తీరు. 2010 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్‌ 22 (ఈ ఏడాది ఆదివారం ఆడిన చివరి వన్డే) వరకు టీమిండియా మొత్తం 249 వన్డేలాడింది. అందులో 157 విజయాలు సాధించగా 79 ఓటములు చవిచూసింది. మరో 6 మ్యాచ్‌లు టై కాగా, 7 వన్డేలు ఫలితం తేలలేదు. దీంతో ఈ దశాబ్దంలోనే భారత్‌ అత్యధిక వన్డే విజయాలు సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. అలాగే ప్రపంచంలో మరే జట్టుకు సాధ్యంకాని విధంగా నిలకడ ప్రదర్శన కొనసాగించింది.


గెలుపోటముల నిష్పత్తి (2010-2019):


* భారత్‌ -1.987 (249 మ్యాచ్‌లు 157 విజయాలు)
* ఆస్ట్రేలియా -1.582 (216 మ్యాచ్‌ల్లో 125 విజయాలు)
* ఇంగ్లాండ్‌ -1.500 (218 మ్యాచ్‌ల్లో 123 విజయాలు)
* దక్షిణాఫ్రికా -1.676 (188 మ్యాచ్‌ల్లో 114 విజయాలు)


గెలుపోటముల నిష్పత్తి (2000-2009):


* ఆస్ట్రేలియా -3.060 (282 మ్యాచ్‌లు, 202 విజయాలు)
* దక్షిణాఫ్రికా -1.825 (254 మ్యాచ్‌లు, 157 విజయాలు)
* శ్రీలంక -1.360 (276 మ్యాచ్‌లు, 155 విజయాలు)
* పాకిస్థాన్‌ -1.360 (267 మ్యాచ్‌లు, 151 విజయాలు)
* భారత్‌ -1.238 (307 మ్యా్‌చ్‌లు, 161 విజయాలు)


గెలుపోటముల నిష్పత్తి (1990-1999):


* దక్షిణాఫ్రికా -1.803
* ఆస్ట్రేలియా -1.728
* పాకిస్థాన్‌ -1.390
* వెస్టిండీస్‌ -1.078
* భారత్‌ -1.016


ఈ గణంకాలు చూస్తేనే అర్థమవుతుంది భారత్‌ గత రెండు దశాబ్దాల్లో ఎలా పుంజుకుందనే విషయం.


2000-2009 మధ్య కాలంలో టీమిండియా పెద్ద ఈవెంట్లలో విజయాలు సాధించడం మొదలుపెట్టింది. గంగూలీ నాయకత్వంలో 2003లో ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడంతో పాటు 2002 ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలవడం, అదే ఏడాది నాట్‌వెస్ట్‌ సిరీస్‌ విజయం సాధించిడం తెలిసిందే. ఇక 2011-2019 మధ్య కాలంలో టీమిండియా అద్భుతమైన నిలకడతత్వం ప్రదర్శించింది. ధోనీ నాయకత్వంలో 2011 ప్రపంచకప్‌తో పాటు 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ విజయం సాధించింది. మరోవైపు 2015, 2019 ప్రపంచకప్‌లలో సెమీస్‌ వరకు చేరింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ చేరినా పాక్‌ చేతిలో ఓటమిపాలైంది. వీటన్నింటినీ చూస్తే వన్డేల్లో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది.


సిరీస్‌ విజయాల్లోనూ భారత్‌ టాప్‌:
మరోవైపు వన్డే విజయాల్లోనే కాకుండా టీమిండియా ఈ దశాబ్దంలో అత్యధిక సిరీస్‌లు గెలిచిన జట్టుగా అగ్రస్థానంలో నిలిచింది. 2010 నుంచి 2019 వరకు భారత్‌ మొత్తం 35 సిరీస్‌లు గెలుపొందింది. ఇంగ్లాండ్‌ 32, ఆస్ట్రేలియా 30 విజయాలతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.