ఇక 'మీసేవ'లకు సెలవు


జనవరి 1 నుంచి సచివాలయాల్లోనే సేవలు


ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం



ఆందోళనలో మీసేవ నిర్వాహకులు



అనంతపురం కలెక్టరేట్‌ : ప్రభుత్వ కార్యాలయాల చుట్టు తిరగకుండా ప్రజల సమయం వృధా కాకుండా ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు పొందేందుకు గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీసేవా కేంద్రాలు మూతపడేలా ఉన్నాయి.అధికారులు, ప్రజల మధ్య వారదిగా ఉన్న మీసేవా కేంద్రాలకు స్వస్థి చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అందుకు నిర్ధారించేలా ఉంది.2020 జనవరి 1 వ తేది నుంచి మీసేవా కేంద్రాల ద్వారా ప్రజలు పొందుతున్న 356 రకాల సేవలన్ని గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో 12 సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా మీ సేవా కేంద్రాల నిర్వాహకులు తీవ్ర ఆందోళనలో పడ్డారు.ఉన్న ఫలంగా తమకు ఉపాధి దూరం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.జిల్లాలో సుమారుగా ఎపి ఆన్‌లైన్‌, మీసేవా కేంద్రాలు 838 పైబడి మీ సేవా సెంటర్లు ఉన్నాయి ఒక్కొక్క సెంటర్‌ లో ముగ్గురు సిబ్బంది పని చేస్తున్నారు.సుమారుగా 3 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.మీ సేవల ద్వారా ప్రదానంగా రెవెన్యూ, ఎలక్ట్రిసిటి, లేబర్‌, సంక్షేమ పథకాలకు దరఖాస్తు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన అన్ని దరఖాస్తులు ప్రజలు చేసుకునే వెసులుబాటును కల్పించారు.2003 లో ఈ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు.వాటి పరిధిలో ఆర్‌టిఏ, ఎపిడిసిఎల్‌, విద్యా శాఖ, పోటీ పరిక్షలు, ఫలితాలు, టెలిఫోన్‌ రంగానికి సంబంధించిన చెల్లింపులు తదితర సేవాలు అందించేవారు.ఆ తరువాత 2012 లో మీసేవా వ్యవస్థను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం మీసేవా కేంద్రాల ద్వారా అందే సేవలన్నింటిని సచివాలయాల ద్వారా అందించేందుకు సిద్దమైంది.ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు సేవలను అందించాలని నిర్ణయించింది.సుదీర్ఘకాలంగా సేవలను అందిస్తున్న మీసేవ నిర్వాహకులు, సిబ్బంది కి ఎదురయ్యే సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకుండానే సేవలను మళ్లింపు చేయడంపై నిర్వాహకులు ఆందోళనలు పడుతున్నారు.ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడనున్నాయని మీసేవ సెంటర్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకి చేరవేయటంలో మీ సేవలు ఎంతో ప్రాధాన్యతగా నిలిచాయి.ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అనేక ఆన్‌లైన్‌ దరకాస్తులను, రెవెన్యూ సమస్యలకు సులభంగా వేగంగా అందించుటలో మీ సేవకులు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఉపాధిలో భాగంగా నిర్వాహణకు సామగ్రికి రూ.లక్షల్లో ఖర్చుపెట్టి సేవలు అందిస్తున్నారు.చాలా చోట్ల కనీసం నిర్వాహణ ఖర్చులు కూడా రాకపోవటంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం గ్రామ సచివాలయాలకు మీసేవకి సంబందించిన సేవలు పూర్తి పారదర్శకంగా ఉచితంగా అందించాలనే సంకల్పంతో ఉండండతో ఇప్పుడు మీ సేవ నిర్వాహకులు, సిబ్బంది పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.


సచివాలయంలో మీసేవ కేంద్రాల సేవలు కొనసాగించాలి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మీసేవా కేంద్రాల నిర్వహణ ద్వారా వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయి. ఉపాధి పొందుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడంతో బాధ్యతగా పని చేశారు.12 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందించిన నిర్వాహకులు, సిబ్బంది ఉపాదిని దూరం చేసేలా ప్రభుత్వం ఆలోచించడం బాధాకరం. నిర్వాహకుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది.మీసేవా సేవలు సచివాలయంలోనే ఒక విభాగం ఏర్పాటు చేయాలి. నాన్‌ సర్వీస్‌ సచివాలయం ద్వారా అందించాలి.
ఎం.ఫయాజ్‌
మీ సేవా కోఆర్డినేటర్‌