'కేజీఎఫ్‌2' ఫస్ట్‌లుక్‌


హైదరాబాద్‌: కన్నడ చిత్రంగా మొదలై పాన్‌ ఇండియా సినిమాగా భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'కేజీఎఫ్'. ఒక్క చిత్రంతో కథానాయకుడు యశ్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌లకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పుడు ఆ చిత్రానికి రెండో భాగం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శనివారం 'కేజీఎఫ్‌: చాప్టర్‌2'కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ చిత్ర బృందం విడుదల చేసింది.


'సామ్రాజ్యం పునర్నిర్మితమవుతోంది..' అంటూ కేజీఎఫ్‌లో పనిచేసే వారితో కలిసి ఒక పెద్ద స్తంభాన్ని తాడుతో లాగుతూ యశ్‌ కనిపించారు. గరుడను చంపడానికి కేజీఎఫ్‌లోకి అడుగుపెట్టిన రాఖీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు?


కేజీఎఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? తన తమ్ముడి మరణవార్త తెలిసిన అధీర ఏం చేశాడు? గరుడ చనిపోయాడన్న వార్త తెలిసి ఇనాయత్‌ ఖలి దేశంపై దండెత్తడానికి ఎలాంటి ప్రణాళికలు వేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాఖీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు 'కేజీఎఫ్‌2'లో సమాధానం లభించనుంది.


ఇందులో అధీరగా సంజయ్‌దత్‌ నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ క్రిస్మస్‌కు రావాల్సి ఉంది. అయితే, షూటింగ్‌ ఆలస్యం కావడంతో వచ్చే ఏడాది వేసవికి సినిమాను తీసుకొచ్చేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. హోంబాలే ఫిల్మ్ష్‌, వారాహి చలన చిత్ర నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బాసుర్‌ సంగీత అందిస్తున్నారు.