వ్యవసాయం: దిగుబడులు పెంచడంలో టెక్నాలజీ పాత్ర ఏమిటి?


2050 నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని అంచనా. మరి, అంతమంది ఆహార అవసరాలు ఎలా తీరతాయనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మెదళ్లను తొలిచే ప్రశ్న. జనాభా పెరుగుతోంది. ఆహార పదార్థాలకు డిమాండ్ పెరుగుతోంది. ఆ డిమాండ్‌కు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంలో టెక్నాలజీ అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. గత కొన్ని శతాబ్దాల గణాంకాలను పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 



1930లో ఒక అమెరికన్ రైతు, సగటున నలుగురు వ్యక్తులకు సరిపడా ఆహార ధాన్యాలు పండించేవారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో.. అంటే 1970 నాటికి ఆ సంఖ్య నలుగురి నుంచి 73 మందికి పెరిగింది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగం శరవేగంగా విస్తరించింది. దాంతో, 1970 నుంచి 2019 నాటికి వచ్చేసరికి ఆ సంఖ్య 73 నుంచి 155 మందికి చేరింది. గడిచిన కొన్ని దశాబ్దాల కాలంలో సాంకేతిక విప్లవం కారణంగా వినూత్నమైన యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో, ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయంలో యాంత్రీకరణ భారీగా పెరిగింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సాంకేతికత కొత్తపుంతలు తొక్కుతోంది. హైటెక్ యంత్రాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంటల పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. అంతేకాదు, పారిశ్రామిక, సాంకేతిక సేవల రంగాల్లో సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డేటా ఎనలిటిక్స్... వ్యవసాయంలోనూ కీలకంగా మారుతున్నాయి. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా పలు టెక్నాలజీ సంస్థలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి





రోబో రైతులు


వ్యవసాయంలోకి రోబో 'రైతులు' ప్రవేశిస్తున్నారు. వచ్చే రెండు మూడు దశాబ్దాల కాలంలో వ్యవసాయం చాలావరకు డిజిటల్ అయిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రైతుగా.. కూలీగా.. వ్యవసాయ శాస్త్రవేత్తగా.. ఇలా అన్ని పనులూ అలవోకగా చేసే రోబోలు రానున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే పలు సంస్థలు రోబోల పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నాయి. ఆ రోబోలు పొలంలో కలుపు మొక్కలను గుర్తించి, తొలగించడం మొదలుకుని.. పంట కోత వరకు అన్ని పనులూ చేయగలవని నిపుణులు అంటున్నారు. అవి అందుబాటులోకి వస్తే రైతు పొలానికి వెళ్లాల్సిన పనుండదు. ఇంట్లో ఉండి స్మార్ట్ ఫోన్‌తో కమాండ్ ఇచ్చి రోబోలతో పంటలను పర్యవేక్షించొచ్చు


వర్చువల్ రియాలిటీ


వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతుందని అమెరికాకు చెందిన విన్‌ఫీల్డ్ అనే సంస్థకు చెందిన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ టెడీ బికాలిన్ అంటున్నారు. ఒక మొక్క ప్రతి అణువణువునూ పరీక్షించి, దాని ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఉపయోగపడే వీఆర్ సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో ఉంది ఈ సంస్థ. "ఈ డ్రోన్లతో పంటచేలను త్రీడీ ఫొటోలు తీయొచ్చు. ఆ చిత్రాలను సెన్సార్లతో పరీక్షించి మొక్కల ఆరోగ్య స్థితిని తెలుసుకోవచ్చు. చీడపీడలను స్పష్టంగా గుర్తించే వీలుంటుంది. అలాగే, ఆ మొక్కలకు ఎలాంటి పోషకాలు అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి సాంకేతికత రానున్న కాలంలో ఎంతగానో ఉపయోగపడుతుంది" అని టెడీ బికాలిన్ చెబుతున్నారు. "గిట్టుబాటు కావడంలేదంటూ వ్యవసాయాన్ని వదిలేసిన రైతులను చూశాం. కానీ, టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నందున గతంలో వ్యవసాయం అంటే వెనకడుగు వేసిన వారు కూడా ఇప్పుడు ఈ రంగంలోకి ఆసక్తిగా వస్తున్నారు. యువత సాగుపై ఆసక్తి చూపుతుండటం మంచి పరిణామం" అని ఆయన అన్నారు.



చీడపీడలను తెలిపే రోబో


ఈ రోబో దానంతట అదే పంట పొలాల్లో తిరుగుతూ తన కెమెరాలతో మొక్కలను చిత్రీకరిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆ ఫొటోలను విశ్లేషించి మొక్కల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో అంచనా వేస్తుంది. దాని ఆధారంగా రైతు పంటకు చీడపీడల గురించి, మొక్కలకు ఏయే పోషకాలు అవసరం అన్న విషయాలను తెలుసుకునే వీలుంటుందని ఈ రోబో తయారీ సంస్థ నిర్వాహకుడు చెప్పారు. ప్రస్తుతం యూకేలోని 25,000 ఎకరాల పంటచేలలో ఈ రోబోను ప్రయోగాత్మకంగా వినియోగిస్తున్నారు. ఇది మరో రకమైన రోబో. దీనికి అత్యాధునిక కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఏ భూమిలో ఏ ఎరువును, ఏ పంటకు ఎంత మోతాదులో వాడాలో ఇది చెప్పేస్తుందట. దీనివల్ల ఎరువులపై పెడుతున్న ఖర్చు 90 శాతం తగ్గుతుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.



పంటల ఉత్పత్తిని పెంచుతాం


తేనెటీగలు, సీతాకోక చిలుకల్లాంటి మిత్ర కీటకాలు పంటల ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. పుప్పొడి రేణువులను ఒక పువ్వు నుంచి మరో పువ్వుకు చేరవేస్తాయి. అయితే, మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం కారణంగా ఎన్నో కీటకాలు అంతరించి పోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట దిగుబడుల మీద తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా డ్రాప్‌ కాప్టర్ అనే స్టార్టప్ సంస్థ ఒక పరిష్కారం చూపిస్తోంది. ఈ సంస్థ ఒక ప్రత్యేకమైన డ్రోన్‌ను రూపొందించింది. అది పంట చేల మీద 10 అడుగుల ఎత్తులో తిరుగుతూ పుప్పొడి రేణువులను చల్లుతుంది. గంటకు 40 ఎకరాల చెర్రీ తోటను పూర్తిచేయగలదు. "వివిధ కారణాలతో మిత్ర కీటకాలు కనుమరుగవుతున్నాయి. అలాగే, అత్యంత చలిగా లేదా అత్యంత వేడిగా ఉండే ప్రాంతాల్లో తేనెటీగలు ఉండవు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఈ డ్రోన్‌ను తయారు చేశాం" అని డ్రాప్‌కాప్టర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆడమ్ ఫైన్ చెప్పారు. "పొలాల్లో తేనెటీగలు తక్కువగా ఉంటే పంట దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు రైతులు మా వద్దకు వస్తే డ్రోన్ల సాయంతో దిగుబడులు పెంచే ప్రయత్నం చేస్తాం. అలా ఇప్పటికే మంచి ఫలితాలు సాధించాం. మా సాంకేతికత తేనెటీగలకు ప్రత్యామ్నాయం అని చెప్పడం లేదు. కానీ, ఇదొక అవకాశంగా పరిగణించొచ్చు" అని ఆయన అన్నారు.



డ్రోన్‌తో పిచికారీ


ఎల్ సాల్వడోర్ దేశంలోని చెరకుతో పాటు వివిధ రకాల తోటలపై డ్రోన్లు ఎగురుతున్నాయి. ఈ డ్రోన్లు 20 లీటర్ల ట్యాంకులతో పంటలపై ఎరువులను, పురుగుమందులను పిచికారీ చేస్తున్నాయి.


ఈ డ్రోన్లను హైలియా అనే సంస్థ రూపొందించింది.


ట్రాక్టర్లు, ప్లేన్‌లు పిచికారీ చేయలేని ప్రాంతాల్లో సైతం ఈ డ్రోన్ల సాయంతో ఎరువులను, మందులను పిచికారీ చేయగలుగుతున్నామని ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టిన ఆ సంస్థ ప్రతినిధి నిక్ నవ్రతిల్ వివరించారు. ఈ విధానంతో పంటల దిగుబడి కూడా పెరుగుతుందని ఆయన అంటున్నారు. ఈ డ్రోన్‌తో ఒక పూటలో దాదాపు 40 హెక్టార్ల పొలానికి పురుగుమందు పిచికారీ చేయగలుగుతున్నామని ఆయన తెలిపారు. భారత్‌లోని పత్తి పంటలపై కూడా ఇలాంటి డ్రోన్లను ప్రయోగాత్మకంగా పరీక్షించారు.



10% అధిక దిగుబడి


ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌నోవ్ సంస్థ రూపొందించిన డ్రోన్లకు కెమెరాలు అమర్చి ఉంటాయి. ఈ కెమెరాల సాయంతో మొక్కల పెరుగుదల సమయంలో వాటికి నైట్రోజన్ ఏ స్థాయిలో అందుతోందో తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి, పంటకు ఏ సమయంలో ఎరువులు వాడాలి? పంటలో ఏ ప్రాంతంలో ఎరువులు ఎక్కువ అవసరం? లాంటి విషయాలు తెలుసుకోవడం సులభమవుతుంది. ఈ విధానం ద్వారా.. ఎరువులు, మందులు వృధా అవ్వవు. ఖర్చు కూడా తగ్గుతుంది. దీనివల్ల తమకు 10% అధిక దిగుబడి వచ్చిందని ఫ్రాన్స్‌లో భారీ ఎత్తున వ్యవసాయం చేసే సహకార సంస్థ 'ఒసీలియా' తెలిపింది. వీటికి అమర్చిన మల్టీ స్పెక్ట్రల్ సెన్సార్‌లు కంటికి కనపడని ఇన్ఫ్రారెడ్, రేడియేషన్, అల్ట్రావయొలెట్ కిరణాలను కూడా రికార్డు చేయగలవు. దాంతో పంటలకు పోషకాల లోపం, పురుగు పట్టడం, నీరు సరిగా అందకపోవడం లాంటి పరిస్థితులను ఇట్టే గుర్తించవచ్చు.



ఉపాధికి గండి పడుతుందా?


అయితే, టెక్నాలజీ పెరగడం వల్ల రైతులకు ఖర్చులు, శ్రమ, సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది. కానీ, ఇదే సమయంలో కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కూలీల కొరత ఉన్న చోట రోబోల వల్ల ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ, వ్యవసాయమే ప్రధాన ఉపాధి వనరుగా ఉన్న ప్రాంతాల్లో రోబోటిక్ సాగుతో ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది.


కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాలి


రైతుల ఆదాయం పెంచుతామంటూ 2014 ఎన్నికలప్పుడు బీజేపీ ఇచ్చిన హామీకి అనుగుణంగా మోదీ ప్రభుత్వం 14 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించింది. మరి వ్యవసాయ రంగానికి సంబంధించిన ఈ నిర్ణయం యువత మీద, సామాన్య ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపనుంది? అన్న విషయాలను వివరించారు ప్రముఖ వ్యవసాయ వ్యాపార నిపుణులు, ఐఐఎం రిటైర్డ్ ప్రొఫెసర్ అనిల్ గుప్తా.


ప్రభుత్వ నిర్ణయం ఏమిటి?


పంటల సగటు ఉత్పత్తి వ్యయం కన్నా.. కనీసం 50 శాతం అధికంగా రైతులకు మద్దతు ధర చెల్లించాలని స్వామినాథన్ కమిషన్ నివేదిక పేర్కొంది. దాంతో అన్ని పంటలకూ కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను ఉత్పత్తి వ్యయానికి ఒకటిన్నర రెట్లకు పెంచనున్నట్లు 2018-19 వార్షిక బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఆ పెంపునకు తాజాగా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) ఆమోదం తెలిపింది. 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు పెంచాలని వ్యవసాయ ఖర్చులు, ధరలు విభాగం కమిషనర్‌కు సూచించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,000 భారం పడుతుందని రాజ్‌నాథ్ సింగ్ బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం సామాన్య వినియోగదారుడి మీద ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు. కానీ, పరోక్షంగా మాత్రం తప్పకుండా ఉండే అవకాశముంది.


1. ఆర్థిక, ఆరోగ్య పరమైన సంబంధం


వ్యవసాయ ఉత్పత్తుల ధరలకు ప్రజల ఆర్థిక, ఆరోగ్య పరమైన అంశాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థతోనూ ప్రత్యక్ష సంబంధం ఉంటుంది.. కాబట్టి సామాన్యుడి జేబు మీద ప్రభావం పడుతుంది.


2- వ్యాపార అవకాశాలు


ఈ కనీస మద్దతు ధరల గురించి లోతుగా తెలుసుకోవడం ద్వారా యువత మరిన్ని వ్యాపార అవకాశాలను అన్వేషించే వీలుంటుంది. ఉదాహరణకు.. రైతుల నుంచే పంటలను నేరుగా కొనుగోలు చేసి, వివిధ రకాల ఆహార ఉత్పత్తులను తయారు చేయవచ్చు. లేదా ఆ ఉత్పత్తులకు అదనపు విలువలను జోడించి(ప్రాసెస్ చేసి) మార్కెట్‌లోకి తీసుకురావచ్చు.


3. ధర తక్కువ, పోషకాలు ఎక్కువ


మంచి పోషక విలువలు కలిగి ఉండి.. తక్కువ ధరకే లభించే పంట రాగి. ఇందులో క్యాల్షియం దండిగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా... రాగులతో చేసిన వంటకాలకు పట్టణాలు, నగరాల్లో డిమాండ్ భారీగా పెరుగుతోంది. దాన్ని యువత, గృహిణులు ఒక వ్యాపార అవకాశంగా మలచుకుని రాగులతో రకరకాల ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేసుకోవచ్చు. అదే సమయంలో ప్రజలకు మెరుగైన పోషక పదార్థాలు కూడా అందే వీలుంటుంది.


4. పోషకాహార లోపంపై యుద్ధం


రాగుల వంటకాలను క్రమం తప్పకుండా మధ్యాహ్న భోజనంలో తీసుకుంటే పోషకాహార లోపాన్ని తరిమికొట్టొచ్చు. రాగుల్లో ఉండే క్యాల్షియం ఎముకలు బలంగా తయారయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు, వృద్ధులకు రాగులు ఎంతో మేలు చేస్తాయి. పిల్లల్లో ఎముకల ఎదుగుదలకు, వృద్ధుల్లో ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. పైగా.. రాగి వర్షాధార పంట కాబట్టి నీటి అవసరం కూడా పెద్దగా ఉండదు. రాగులు ఒక్కటే కాదు.. ఇంకా ఆయా ప్రాంతాల్లో పండించే పంటలకు అనుగుణంగా యువత ఆలోచించాలి.


5. ద్రవ్యోల్బణం నియంత్రణ


మార్కెట్‌లో పంటలకు డిమాండ్ బాగుంటే.. రైతులు కూడా వాటిని పండించేందుకు ఆసక్తి చూపుతారు. దాంతో దేశంలో డిమాండ్, సప్లై మధ్య అంతరం తగ్గుతుంది. ఫలితంగా ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటాయి. వినియోగదారుడికి నేరుగా లబ్ధి చేకూరుతుంది. డిమాండ్, సప్లై మధ్య అంతరం తగ్గినప్పుడు దేశంలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది.


6. రైతు, వినియోగదారుడు ఇద్దరికీ మేలే


ప్రతిదానికీ మార్కెట్‌కి వెళ్లకుండా.. వినియోగదారులు చిన్న బృందంగా ఏర్పడి ఆహార ధాన్యాలను నేరుగా రైతుల నుంచే కొనుగోలు చేయాలి. అది ఇరువురికీ ప్రయోజనకరంగా ఉంటుంది. రైతుకు మంచి రేటు వస్తుంది. మరోవైపు వినియోగదారుడికి కూడా మార్కెట్‌లో కంటే తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు దొరుకుతాయి. మధ్యలో దళారుల ప్రమేయం లేనప్పుడు కమీషన్లు, పన్నులు ఉండవు కాబట్టి ధరలు తక్కువగా ఉంటాయి.


7. ఆ అంతరం తగ్గాలి


ప్రభుత్వం పంటల ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. కానీ.. ఆ ధరలకు పంటలను కొనుగోలు చేసినప్పుడే రైతు ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ ప్రభుత్వం కనీస మద్దతు ధరలు చెల్లించకపోతే.. సమస్య అలాగే ఉండిపోతుంది. కొనుగోలు చేసినా.. ఆ ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అవసరమైన గిడ్డంగులు ఉండాలి. రైతులు పండించిన పంట వినియోగదారులకు చేరే వరకు ధరలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ ధరలతో పోల్చితే రైతుకు అందే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. ధరలో ఆ అంతరాలు తగ్గి, రైతుకు ఎక్కువ ప్రయోజనం కలగాలి. అప్పుడే వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది. రైతులు మరింత ఎక్కువ పండించేందుకు ఆసక్తి చూపిస్తారు. దాంతో చివరికి ఎక్కువ లబ్ధి చేకూరేది వినియోగదారుడికే. 



పెరిగిన ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరలు


ప్రభుత్వం పెంచిన కనీస మద్దతు ధరలు(ఎంఎస్‌పీ) ఈ కింది విధంగా ఉన్నాయి:



  • వరి రూ.1,750(క్వింటాకు రూ.200 పెరిగింది)

  • జొన్నలు కొత్త ధర క్వింటా రూ.1,950

  • రాగులు 50% (కనీస మద్దతు ధర అత్యధికంగా రాగుల మీద పెరిగింది)

  • నువ్వులు 45.11% పెరిగింది(గతంలో రూ. 4,050, ఇప్పుడు రూ.5,877)

  • కందులు 4.13% (కొత్త ధర క్వింటాకు రూ. 5,675)

  • మినుములు 3.70% పెరిగింది (కొత్త ధర రూ. 5,600)

  • వేరుశనగలు 9.87%

  • పత్తి 28.11% పెరిగింది(కొత్త ధర క్వింటాకు రూ.5,150)

  • పెసలు(పెసర్లు) 25% పెరిగింది( కొత్త ధర క్వింటా రూ.6,975)